సంసారం

చాలా కాలం పాటు సిద్ధార్థుడు ప్రాపంచిక జీవితం గడుపుతూనే, దానికి లోబడకుండా ఉన్నాడు. తీవ్రమైన సాధనలతో కూడుకున్న శ్రమణ జీవన సమయంలో నశించిపోయిన అతని ఇంద్రియాలు ఇక తిరిగి జీవం పోసుకున్నాయి. అతడు ధనసంపదల్ని, మోహాన్ని, అధికారాన్ని రుచిచూశాడు; కానీ అంతర్గతంగా, తన హృదయంలో చాలా కాలంపాటు ఇంకా శ్రమణుడిగానే ఉన్నాడు. తెలివైన కమల దీన్ని గుర్తించింది. ఆలోచించటం, వేచి ఉండటం, ఉపవాసం ఉండటం అనే కళలే ఎల్లప్పుడూ అతని జీవితాన్ని శాసిస్తున్నాయి. అతను ప్రపంచపు సాధారణ ప్రజల నుండి ఎలా దూరంగా ఉన్నాడో, అలాగే వారంతాకూడా అతనికి ఇంకా అపరిచితులుగానే (ఏలియన్) ఉండిపోయారు.

సంవత్సరాలు గడిచాయి. సుఖకరమైన పరిస్థితులలో మునిగిన సిద్ధార్థుడు కాలగతిని దాదాపు గమనించనేలేదు. అతనిప్పుడు ధనికుడు- అతనికి ఒక సొంత ఇల్లు, సొంత పరివారం, పట్టణానికి వెలుపల , నదిఒడ్డున ఒక సొంత తోట ఏర్పడి చాలాకాలం గడిచింది. ప్రజలు అతనిని ఇష్టపడేవారు. వారికి డబ్బు కావాలన్నా, సలహాలు కావాలన్నా అతని వద్దకు వచ్చేవారు. అయితే కమల తప్ప వేరే సన్నిహితులు మాత్రం అతనికి ఎవరూ లేరు. ఆ అద్భుతమైన (గ్లోరియస్), ఉన్నతమైన మేలుకొలుపు- అతడు యువకుడిగా ఉన్నప్పుడు కలిగిన సమున్నతమైన ఆ మేలుకొలుపు- గౌతముని బోధన తరువాతి రోజుల్లో, గోవిందుని విడచిపెట్టిన తరువాత, అప్రమత్తతతో కూడుకున్న ఆ ఆశయం- గురువులు, సిద్ధాంతాలు లేకుండా ఒంటరిగా నిలిచినపుడు కలిగిన ఆ ఆతృత, ఆ సన్నద్ధత- అంతా ఒక జ్ఞాపకంగా మారిపోయింది- అంతా గతించింది. ఒకప్పుడు అతనికి దగ్గరగా ఉంటూ , అతని హృదయంలో ఉచ్చస్వరంతో రాగాలాపన చేసిన ఆ పవిత్రధార ఇప్పుడు మూగవోయి, దూరంగా, ఎక్కడో, మెల్లగా గుసగుసలాడుతున్నది. అయినప్పటికీ , తాను శ్రమణులనుండి, గౌతముని నుండి, తన తండ్రి నుండి, బ్రాహ్మణులనుండి నేర్చుకున్న విషయాలు అనేకాన్ని అతడు చాలాకాలం పాటు తనలో నిలుపుకున్నాదు. మితజీవనం, ఆలోచనలో సంతోషం, ధ్యాన సమయం, ఆత్మకు సంబంధించిన రహస్య జ్ఞానం, శరీరం, మనస్సు కాని ఆ పరమాత్మ జ్ఞానం- వీటిలో అనేకాన్ని అతను నిలుపుకున్నాడు, మిగిలినవి మునిగిపోయి, దుమ్ముతో కప్పబడిపోయాయి. కుమ్మరి సారెను ఒకసారి తిప్పి వదిలితే, ఆ తరువాత కూడా చాలా సేపటివరకు అది తిరుగుతూనే పోతుంది- ఆపైన చాలా మెల్లగా, మెల్లగా తిరుగుతూ, చివరికి ఆగిపోతుంది- ఈ వైరాగ్య చక్రం కూడా అదేవిధంగా ప్రవర్తించింది. ఈ వైరాగ్య చక్రం, ఈ ఆలోచనా చక్రం, విచక్షణతో కూడిన ఈ చక్రం సిద్ధార్థుని ఆత్మలో ఇంకా మెల్లగా భ్రమిస్తూనే ఉన్నది- భ్రమిస్తోంది ఇంకా- కానీ మెల్ల మెల్లగా, సందేహిస్తూ- ఇప్పుడు దాదాపు ఆగిపోయే పరిస్థితిని చేరుకున్నది. మెల్లమెల్లగా, మృతి చెందనున్న వృక్షపు కాండంలోనికి తేమ చేరుకున్నట్లు, అలా చేరిన తేమ మెల్ల మెల్లగా దానిని నింపి కుళ్లిపోజేసేటట్టు, మెల్ల మెల్లగా సిద్ధార్థుని ఆత్మలోకి ప్రపంచమూ, జడత్వమూ ప్రవేశించింది; మెల్లగా దాన్ని నింపివేసింది; దాన్ని బరువెక్కించింది; అలసిపోయేటట్లు, నిద్రపోయేటట్లు చేసింది. కానీ వేరొకవైపున అతని ఇంద్రియాలు ఇంకా మేలుకొన్నాయి, చాలా విషయాలనవి నేర్చుకున్నాయి, చాలా అనుభవాలను గడించాయి.

సిద్ధార్థుడిప్పుడు వ్యాపార కార్యకలాపాల్ని నడపటం నేర్చుకున్నాడు, జనాలపైన అధికారం చెలాయించటం నేర్చుకున్నాడు, స్త్రీలతో వినోదించటం నేర్చుకున్నాడు, చక్కని వస్త్రాలు ధరించటం, పరిచారకులను ఉంచుకోవటం, తియ్యని సుగంధాలీనే నీటిలో స్నానమాడటం చేస్తున్నాడు. మధురమైన వంటకాలను, శ్రద్ధగా తయారుచేసిన వివిధ పదార్థాలను- చేపలు, మాంసం, పక్షులు, మసాలాలు, రుచికరమైన పిండివంటలు (డెయింటీస్) తినటం నేర్చుకున్నాడు; ఇంకా మధువు త్రాగటం కూడా నేర్చాడు. వీటన్నిటి కారణంగా అతను బద్ధకస్తునిగాను, మతిమరపువానిగాను తయారయ్యాడు. ఇంకా అతను జూదమాడటం, చదరంగమాడటం, నాట్యకత్తెల నాట్యాలు చూడటం, పల్లకీలలో ఎక్కి తిరగటం, మెత్తని పరుపులపై శయనించటం నేర్చుకున్నాడు. కానీ అతను ఎల్లప్పుడూ తనను తాను ఇతరులకంటే భిన్నంగా, వారికంటే అధికునిగా భావించేవాడు, వారిని ఎల్లప్పుడూ కొంత (తక్కువగా, తిరస్కారంగా,) అవహేళనగా చూసేవాడు; కొంత ఎగతాళితో కూడిన చులకనభావం (డిస్‍డైన్)తో- ప్రాపంచిక జీవితాన్ని గడిపేవారిపట్ల శ్రమణులకుండే చులకనభావంతో- చూసేవాడు. కామస్వామి బాధపడ్డప్పుడు- తను అవమానింప బడ్డాడనిగాని, లేదా తన వ్యాపార కార్యకలాపాల చికాకుల్లో ఉన్నప్పుడుగానీ- సిద్ధార్థుడు అతనిని ఎప్పుడూ పరిహసించేవాడు- కానీ మెల్లగా, కాలం గడిచినకొద్దీ, అతనికి తెలీకుండానే అతని ఈ ఎగతాళి, ’తాను అధికుడు’ అన్న భావమూ మందగించాయి. పెరుగుతున్న తన సంపదలతో బాటు, క్రమంగా సిద్ధార్థుడుకూడా సాధారణ ప్రజల లక్షణాలు కొన్నింటిని, వారి (ఛైల్డిష్‍నెస్) చిన్నతనాన్ని, పిల్లచేష్టల్ని, వారి ఆందోళనలు కొన్నింటిని అంది పుచ్చుకున్నాడు. అయినా అతను వారి పట్ల అసూయ పడుతూనే ఉన్నాడు. వారిలాగా ఎంత మారాడో, అంతకంటే ఎక్కువగా అతను వారిపట్ల అసూయ పడ్డాడు. తనకు లేనిదొకటి వారిలో ఉన్నది- ఇదే అతని అసూయకు కారణం: వారు తమ జీవితాల్ని లోతుగా, అనుభవిస్తూ జీవిస్తున్నారు; దానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జీవిస్తున్నారు. వారి సంతోషాలు, దు:ఖాలలో ఒక లోతు ఉన్నది- ప్రేమించడానికి కావలసిన ఆ నిరంతర శక్తి, ఆతృతతోటీ- అయినా తీయని హాయితోటీ- కూడిన ఆ శక్తి ఏదో వారిలో ఉన్నది. వీళ్లెప్పుడూ నిరంతరంగా తమను తాము ప్రేమించుకుంటారు; తమ పిల్లలపట్ల, సామాజిక గౌరవంపట్ల, డబ్బుపట్ల, ప్రణాలికల పట్ల, లేదా ఆశపట్ల ప్రేమగా ఉంటారు. కానీ ఇవి అతను వాళ్లనుండి నేర్చుకోలేదు- చిన్న పిల్లల ఈ సంతోషాల్నీ, తప్పిదాల్నీ- వీటిబదులు వారినుండి అతను తాను అసహ్యించుకునే, తనకు ఇష్టంలేని సంగతుల్నే నేర్చుకున్నాడు. చాలా ఉత్సాహంగా గడచిన సాయంత్రం తరువాత, పడుకొని, మరునాడు ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేచి, ఆపైన ఇక రోజంతా అలసటతో, నీరసంగా గడిపే సందర్భాలు రాను రాను అధికం అవుతున్నాయి. కామస్వామి తన కష్టాలు వినిపించి విసిగించినప్పుడు, ఇప్పుడు అతనికి అసహనమూ, కోపమూ వస్తున్నాయి. జూదంలో ఓడినప్పుడు అతను మరింత బిగ్గరగా నవ్వుతున్నాడు. ఇతరులకంటే అతని ముఖంలో తెలివితేటలు, మేధోశక్తి ఇంకా అధికంగానే కానవస్తున్నాయి; కానీ అతనిప్పుడు ఎప్పుడోగాని నవ్వటంలేదు. క్రమంగా అతని ముఖం, ధనవంతుల ముఖాల్లో తరచు కానవచ్చే భావాలను- అసంతృప్తి, రోగం, దు:ఖం, సోమరితనం, ప్రేమరాహిత్యపు భావాలను- సంతరించుకున్నది. మెల్లగా సంపన్నుల ఇండ్లలో ఉండే (సోల్ సిక్‍నెస్)ఆత్మరోగం?? అతనిని ఆవరించింది-

ఒక ముసుగు మాదిరి, పలుచని పొగమంచు మాదిరి, సిద్ధార్థునిలో ఒక అలసట పరచుకొన్నది- మెల్లగా, ప్రతిరోజూ ఇంకొంత మందంగా, ప్రతినెలా ఇంకొంత చీకటిగా, ప్రతి సంవత్సరం ఇంకొంత బరువుగా, నూతన వస్త్రాలు సమయం గడిచేకొద్దీ పాతబడ్డట్లు, వాని రంగుల మెరుపు తగ్గిపోయినట్లు, మరకలుపడి, ముడతలు పడ్డట్లు, అంచులు చినిగిపోయినట్లు, అక్కడక్కడా పిగిలిపోయి, దారపుపోగులు మాత్రమే మిగిలినట్లు, గోవిందుని విడచిపెట్టిన తరువాత సిద్ధార్థుడు మొదలుపెట్టిన నూతన జీవితంకూడా రాను రాను పాతబడింది; కాల ప్రవాహంలో తన రంగును, మెరుపును కోల్పోయింది; ముడతలు, మరకలు ప్రోదిచేసుకున్నది; ఇంకా, లోతుల్లో దాగొని, అక్కడక్కడా ఇప్పటికే బయటపడుతూ, నిరాశ, నిస్పృహ బయలుదేరాయి; రోత, జుగుప్స పొంచి చూడటం మొదలెట్టాయి. సిద్ధార్థుడు దీన్ని గమనించలేదు- తనలో ఒకసారి మేల్కొని, మంచికాలంలో ఎల్లప్పుడూ దారిచూపుతూ నడిపిన ఆ విస్పష్టమైన అంతర్వాణి ఇప్పుడు మూగవోయిందని మాత్రం అతడు గుర్తించగల్గాడు.

ప్రపంచం అతనిని ఆవహించింది: సుఖాభిలాష, పేరాశ, సోమరితనం, చివరికి తాను గతంలో ఎల్లప్పుడూ తుచ్చమైనదిగాను, అతి హేయమైనదిగాను భావించిన వ్యసనం- ఆస్తినార్జించే కోరిక- అది కూడా చోటు చేసుకున్నది. ఆస్తులు, వాటిపై ఆధిపత్యం, సంపదలు, వాటిని సంపాదించటం- ఇవన్నీ చివరికి అతన్ని చేజిక్కించుకున్నాయి. ఇప్పుడిక అవేవీ అతనికి బొమ్మలాటలు కావు. అవిప్పుడు శృంఖలాలయ్యాయి; భారమైనాయి. ఈ అధో మార్గంలో, మెలికలు తిరుగుతూ పోయిన- ఘోరమైన- అతి నీచమైన- పతనపు బాటలో సిద్ధార్థుడు జూదం ఆడటం ద్వారా పయనించాడు. తన హృదయంలో ఏనాడైతే అతను శ్రమణుడిగా ఉండటం మానేశాడో, ఆనాటినుండే అతను మరింత ఉత్సాహంతో డబ్బుల్ని, రత్నాలనూ పణంగా పెట్టి జూదమాడటం మొదలెట్టాడు- ఏ ఆటనైతే అతను సాధారణ ప్రజల ఆచారంగా భావించి, చిరునవ్వుతో, చనువుతో, ముద్దుగా(ఇండల్జెంట్) ఆడాడో, దానిలో ఇప్పుడతను భయంకరుడైనాడు- అతనికి ఎదురులేదు- అతనితో ఆడే సాహసం ఏ కొద్ది మందికో తప్ప ఉండేదికాదు- ఏమంటే అతను ఒడ్డే సంపదలు అంత హెచ్చు స్థాయిలోను, అంత దుస్సాహసంగాను ఉండేవి. మానసికమైన ఒక గట్టి అవసరంకొద్దీ అతను జూదమాడాడు. ఈ దౌర్భాగ్యపు డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టి, జూదమాడి నాశనం చేయటం ద్వారా అతను ఒక ఉద్రేకపూర్ణమైన సుఖభావనను ప్రాప్తినొందాడు. వ్యాపారుల ఆరాధ్యదైవం సంపద- ఆ సంపద పట్ల తనకున్న అసహ్యాన్ని అతను ఇక వేరే ఏవిధంగానూ ఇంత స్పష్టంగా, ఇంత వెటకారంగా వ్యక్తీకరించలేకపోయాడు. అందువల్ల అతను తనను తాను అసహ్యించుకుంటూ, తనను తాను ఎగతాళి చేసుకుంటూ, పరిమితులు లేకుండా, చాలా ఎక్కువ జూదమాడాడు. అతను వేలు గెల్చాడు, వేలు పడేశాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు, రత్నాలు పోగొట్టుకున్నాడు, పొలాల్ని, ఇళ్లను పోగొట్టుకున్నాడు, గెల్చుకున్నాడు, మళ్లీ పోగొట్టుకున్నాడు. జూదమాడే సమయంలో అంత ఎక్కువ పణాలతో ఆడినప్పటి ఉత్కంఠను, ఆ సమయంలో అతను అనుభవించే ఆ భయంకరమైన, కౄరమైన ఆతృతను అతను అమితంగా ఇష్టపడ్డాడు. అతను ఈ అనుభూతిని ప్రేమించాడు- దాన్ని మళ్ళీ కొత్తగా అనుభవించేందుకు, దాన్ని పెంచుకునేందుకు, దాన్ని రేకెత్తించేందుకు తపించాడు- ఏమంటే కేవలం ఈ ఒక్క అనుభూతిలోనే అతనికి ఒక రకమైన సంతోషం, ఒక రకమైన ఉత్తేజం, నిస్సారము, రసరహితము అయిన తన సంతృప్త జీవితంలో ఒక ఉద్వేగ పూరిత మధురిమ- కనిపించింది. అలా పెద్ద మొత్తాలు పోగొట్టుకున్న ప్రతిసారీ అతను క్రొత్త సంపదలు కూడబెట్టేందుకు నడుంబిగించేవాడు. ఆతృతగా వ్యాపారంలోకి దూకేవాడు; తన బాకీదార్ల నందరినీ అప్పులు తీర్చమని ఒత్తిడి చేసేవాడు- ఎందుకంటే అతనికి మళ్లీ ఆడాలని కోరిక- మళ్లీ విచ్చలవిడిగా ఖర్చుపెట్టాలి; అలా తనకు సంపదల పట్ల ఉన్న అసహ్యాన్ని మళ్లీ వ్యక్తం చెయ్యాలి. నష్టాలు వచ్చినప్పుడు సిద్ధార్థుడు సహనం కోల్పోయాడు: అప్పులు త్వరగా తీర్చని బాకీదార్లపై కోపగించుకుంటున్నాడు; భిక్షగాళ్ల పట్ల అతని హృదయంలో ఇప్పుడు జాలి, దయ కలగటంలేదు. పేదలకు బహుమానాలు, అప్పులు ఇవ్వాలనే కోరిక అతనికి ఇప్పుడు లేదు. ఒకప్పుడు, ఒక్కసారి పాచికలు విసరటం మీద పదివేలు ఒడ్డి, నవ్విన సిద్ధార్థుడు, ఇప్పుడు వ్యాపారంలో కరుడు గట్టాడు, నీచంగా తయారయ్యాడు, ఒక్కొక్కసారి, రాత్రిపూట డబ్బుల గురించి కలగన్నాడు. ఈ అసహ్యపు మాయాజాలంనుండి ఎప్పుడైనా మెలకువ వచ్చినప్పుడు, పడకగది గోడమీది అద్దంలో తన ప్రతిబింబాన్ని, ఇంకా ముసలిదై, వికారంగా తయారైన తన రూపాన్ని చూసుకున్నప్పుడు, అలా, సిగ్గూ, జుగుప్సా తనను ఆవహించినప్పుడు, అతను మళ్లీ పారిపోయేవాడు- ఇంకొక కొత్త జూదానికి పరుగులెత్తాడు; ఆ కంగారులో మోహం వైపుకు, ద్రాక్ష సారాయి వైపుకు, మళ్లీ అక్కడినుండి డబ్బు సంపాదించాలి; కూడబెట్టాలనే కోరికవైపుకు పరుగులు తీశాడు. అర్థ రహితమైన ఈ చక్రంలో అతడు తనను తాను అలసిపోగొట్టుకున్నాడు; వృద్ధుడైనాడు, రోగి అయినాడు.

ఆ సమయంలో ఒక కల అతనికి స్పృహ తెప్పించింది: ఒక నాటి సాయంకాలం అతను కమలతో, అందమైన ఆమె ఆనందవనంలో ఉన్నాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఒక చెట్టుకింద కూర్చున్నారు. కమల చాలా గంభీరంగా మాట్లాడుతున్నది- ఆమె మాటల వెనుక దు:ఖం, అలసట దాగి ఉన్నాయి. ఆమె అతనిని గౌతముని గురించి చెప్పమని అడిగింది. ఎంత చెప్పినా ఆమెకు తనివి తీరటం లేదు. ఆయన కనులెంత స్వచ్ఛంగా ఉంటాయో, ఆయన నోరెంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉన్నదో, ఆయన చిరునవ్వెంత నిర్మలంగా ఉన్నదో, ఆయన తీరు మొత్తం ఎంత శాంతిని ప్రతిఫలిస్తున్నదో- చాలా సేపటివరకు అతను ఆమెకు బుద్ధభగవానుని గురించి చెప్పవలసి వచ్చింది- అపుడు కమల నిట్టూరుస్తూ అన్నది- "నేను కూడా బుద్ధుని అనుయాయినౌతాను. నాయీ అనంద వనాన్ని ఆయనకు అర్పించి, ఆయన బోధనలను శరణువేడతాను." అని.

కానీ ఆ వెంటనే ఆమె అతనిని కవ్వించింది. ఆపైన రతిలో తీవ్ర భావోద్వేకంతో, కళ్లలో నీరొచ్చేటట్లు, బలంగా అతనిని హత్తుకున్నది, క్షణికమైన ఈ సుఖంలోని చివరి మధుర బిందువుల్ని మరొక్కసారి ఆస్వాదించాలన్న తీవ్రమైన ఇచ్ఛతో వర్తించింది. మోహం మృత్యువుకు ఎంత దగ్గరో సిద్దార్థునికి ఇంత వింతగా ఎన్నడూ తెలియరాలేదు. ఆపైన అతను ఆమె ప్రక్కన పడుకొని ఉన్నాడు, కమల ముఖం అతని ముఖానికి దగ్గరగా ఉన్నది; ఆ సమయంలో ఆమె కనుల క్రింద, పెదిమల కొనల్లోను అతను -మొదటిసారిగా- శిశిరపు ఛాయలు, వార్థక్య సూచికలు- సన్నని గీతలు, ముడతలు- చూసి కలవర పడ్డాడు. సిద్ధార్థునికి ఇంకా నలభయ్యవ పడి దాటలేదు- అప్పటికే నల్లని తన జుట్టులో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు పొడచూపటం గమనించాడు. కమల అందమైన ముఖంలో అలసట కానవస్తోందిప్పుడు- సంతోషకరమైన లక్ష్యం అంటూ లేని మార్గంలో పయనించిన అలసట. ఆ అలసటలో, దాగుడుమూతలాడుతున్న ముసలితనం. మూలన నక్కి, ఇంకా బయటకు రాకుండా- బహుశ: ఇంకా మనసు ఉపరితలానికే అవగతంకాని భయమేనేమో- కనబడింది. జీవన శిశిర సంధ్య పట్ల భయం, ముసలితనం అంటే భయం, మృత్యుభీతి. తన హృదయం నిండా దు:ఖంతో, ఆ హృదయపు మారుమూలల్లో భయంతో- అతను ఆమెనుండి శలవు తీసుకున్నాడు.

ఆ తరువాత మిగిలిన రాత్రిని తన ఇంట్లో, నాట్యకత్తెల సరసన, తప్ప తాగుతూ గడిపాడు సిద్ధార్థుడు; తన తోటివారికంటే తానే అధికుడు అన్నరీతిలో నటించాడు- నిజంగా అతనిలో ఆధిక్యం ఏమీ లేదు ఇప్పుడు. విపరీతంగా తప్ప త్రాగి, అర్థరాత్రి గడచిన తరువాత ఇంకా అలసిపోయి, అయినా చల్లారని ఆందోళనతో, నిస్పృహతో, దాదాపు కళ్లనీళ్ల పర్యంతమౌతూ అతను పడుకొనేందుకు ప్రయత్నించాడు. తానిక దీన్ని భరించలేనన్పించింది అతనికి. జుగుప్స పూర్తిగా అవరించి అతనిని వశపరచుకున్నది. కుళ్లిన మధువు మాదిరి, లోతు, గాంభీర్యత కరువై, వెగటు పుట్టించేంత మధురమైన సంగీతం మాదిరి, నాట్యకత్తెల ముఖాలపై చెరగని అతితీపి చిరునవ్వు మాదిరి, వారి కేశాలనుండి, చన్నుల నుండి వెలువడే తియ్యని సువాసనల కంపు మాదిరి, జుగుప్స అతనిని లోబరచుకున్నది. కానీ వీటన్నిటికంటే ప్రధానంగా- అతనికి తనపై తనకే రోత పుట్టింది- సువాసనలీనే తన కేశసంపదపై రోత, తన నోటినుండి వచ్చే ద్రాక్ష సారాయి వాసనపై రోత, మృదువుగా, మెత్త మెత్తగా తయారైన తన చర్మపు రూపంపై రోత. కడుపు పట్టనంతగా తిని, తాగి, అతి కష్టం మీద దాన్నంతా వాంతి చేసుకొని, చివరికి కొంత మెరుగు అనుకునే (త్రాగుబోతు) మాదిరి, అశాంతి పాలైన ఈ మానవుడు కూడా ఈ సుఖాల్ని, ఈ అలవాట్లను, పూర్తిగా అర్థరహితమైన ఈ జీవితాన్నీ ఒక్కసారిగా వదిలించుకోగల్గితే బాగుండుననుకున్నాడు. పొద్దు పొడవబోతుండగా, నగరమధ్యం లోని తన భవంతి బయట అప్పుడప్పుడే పనులు మొదలౌతున్న సూచనలు పొడచూపుతుండగా, అతనికి కునుకు పట్టింది- కొద్ది క్షణాల ఆ నిద్ర-నిద్రకాని- సందిగ్ధ స్థితిలో అతనికొక కలవచ్చింది:

కమల దగ్గర ఒక చిన్న పిట్ట ఉండేది. పాటలు పాడే అరుదైన ఆ పిట్టను కమల ఒక బంగారు పంజరంలో ఉంచి పెంచేది. సిద్ధార్థునికి కలలో వచ్చింది ఈ పిట్టే. ప్రతిరోజూ ఉదయం పాటలు పాడే ఈ పిట్ట, ఆనాడు మూగవోయింది- సద్దు చేయలేదు. సిద్ధార్థునికి ఆశ్చర్యం వేసి, ఆ పంజరం దగ్గరకు వెళ్లి లోనికి చూశాడు. చిన్నపిట్ట చచ్చి పడి ఉన్నది- పంజరంలోనే ఎండిపోయి పడి ఉన్నది. అతను దాన్ని బయటికి తీసి, క్షణ కాలం పాటు చేతిలో పట్టుకొని, వెంటనే రోడ్డుపైకి విసిరి పడేశాడు. ఆ క్షణంలోనే అతనికి చెప్పరానంత భయం కల్గింది: ఈ పక్షితోబాటే తనలో మిగిలిన ఏ కొద్దిపాటి మంచితనాన్ని, ఏ కొద్దిపాటి విలువల్ని కూడా, తను సంపూర్ణంగా బయటికి విసరిపారేసినట్లు అతని హృదయం రోదించింది.

ఈ కలనుండి మేలుకొన్న సిద్ధార్థుడిలో భయంకరమైన దు:ఖం వెల్లువెత్తింది. తన జీవితాన్ని తను నిరర్థకంగా, అర్థరహితంగా గడిపాడని అతనికి అనిపించింది. జీవితంలో ప్రాధమికమైనదానిని, ప్రధానమైనదానిని, విలువైనదానిని, సార్థకమైనదానిని దేన్నీ అతను కొంచెంగా కూడా నిలుపుకోలేదు. నౌక నాశనంకాగా సముద్రమధ్యంలోని ద్వీపపు అంచున, తీరంపై ఒంటరిగా నిలచిన నావికుని మాదిరి, అతను ఏకాకిగా నిలిచాడు.

ఇలా దు:ఖితుడైన సిద్ధార్థుడు తన ’ఆనందవనం’ లోకి వెళ్లి, దాని తలుపులు మూసి, ఒక మామిడి చెట్టు క్రింద కూర్చొని, తన హృదయంరంగంలో భీతి, మృత్యువు తాండవించటం చూశాడు. చెల్లాచెదరుగా ఉన్న తన ఆలోచనలను మెల్లగా సమీకరించుకొని, అతడు తన జీవితాన్ని- తాను గుర్తు చేసుకోగల్గిన తొలినాళ్లనుండి, నాటి వరకు గల తన జీవితం మొత్తాన్ని- ఒకసారి నెమరువేసుకున్నాడు. అతను నిజంగా, సంతోషంగా ఎప్పుడున్నాడు? నిజమైన ఆనందాన్ని అతడు ఎప్పుడు అనుభూతిచెందాడు? నిజంగానే చాలాసార్లు ఆనందానుభూతికి లోనైనాడు తను- చిన్నతనంలోనే బ్రాహ్మణులు తనను మెచ్చుకున్నప్పుడు, సమకాలీకులనందరినీ తాను జయించినప్పుడు, వేదమంత్రాలు పఠించటంలో తనను తాను అధిగమించినప్పుడు, పండితులకు యజ్ఞనిర్వహణలో సాయంచేస్తూ, వారితో జరిపిన శాస్త్రచర్చల్లో విజయుడైనప్పుడు కూడాను. అప్పుడతని మనసులో తోచింది- " నీ ముందొక మార్గం పరచుకొని ఉన్నది. దానిని అనుసరించమని నీకు నిర్దేశం లభిస్తోంది. దేవతలు నీకోసం ఎదురుచూస్తున్నారు" అని. ఆ తరువాత యువకునిగా నిరంతరం ఉన్నతంగా విహరించే తన లక్ష్య సాధనకై, తనవంటి (మోక్ష)గాముల సమూహాలలో చేరి బయటికి వచ్చిన ఆ సమయంలో- బ్రాహ్మణుల బోధనల్ని అర్థంచేసుకునేందుకై శ్రమించినప్పుడు, కొత్తగా సంపాదించిన చిరుజ్ఞానం ప్రతి ఒక్కటీ కొత్త కృష్ణను కల్గించిన ఆ రోజుల్లో, ఆ తృష్ణ నడుమ, తన కృషి మధ్యలో తను అనుకున్నాడు- "ముందుకు సాగు, ముందుకు. ఇదే, నీ మార్గం." అని. తను ఇంటిని వదలి శ్రమణులను చేరినప్పుడు తను ఈ స్వరాన్ని విన్నాడు; మళ్లీ తాను శ్రమణులను వదలి ఆ పరిపూర్ణవ్యక్తి వద్దకు వెళ్లినప్పుడూ ఈ స్వరాన్ని విన్నాడు; మళ్లీ ఆయనను వదలి అగమ్యం (అన్‍నోన్)లోనికి పయనించినప్పుడు కూడానూ. తాను ఈ స్వరాన్ని చివరిసారి విని ఇప్పటికి ఎంతకాలమైంది? సమున్నతంగా విహరించి ఎన్ని ఏళ్లైంది? ఏలాంటి (లాఫ్టీ) విశిష్టమైన లక్ష్యమూ లేకుండా, ఎలాంటి తృష్ణా లేకుండా, ఎలాంటి ఉన్నతీ లేకుండా, చిన్న చిన్న సుఖాలతో తృప్తి పడుతూ-; కానీ నిజానికి ఏనాడు తృప్తి అన్నది లేకుండా బ్రతుకుతూ- ఎన్ని సంవత్సరాలు వృధాగా గడిపేశాడు తను! తనకు తెలీకుండానే, తను ఈ సాధారణ ప్రజలమాదిరి, ఈ పామరులమాదిరి, ఈ పిల్లల మాదిరి, బ్రతకాలని ఆశపడుతూ బ్రతికాడు; కానీ నిజానికి తన జీవితం వారి జీవితాలకంటే ఘోరంగా, వారి జీవితాలకంటే పేదగా, గడిచింది- ఎందుకంటే వారి లక్ష్యాలు తన లక్ష్యాలు కావు, వారి దు:ఖాలు తన దు:ఖాలు కావు. ఈ కామస్వామి ప్రపంచం, ప్రజల ఈ ప్రపంచం అంతా తనకు ఒకప్పుడు ఒక ఆటగా ఉండేది- ఒక నాట్యం- ఒక హాస్యనాటకం- అతను ప్రేక్షకుడు- కేవలం కమల మాత్రమే అతనికి దగ్గరగా ఉండేది. కేవలం ఆమె ఒక్కతే విలువైనది- కానీ మరి ఇప్పుడు? ఇప్పుడు కూడా ఆమె తన హృదయానికి దగ్గరగా ఉన్నదా? తనకు ఇంకా ఆమె అవసరం ఉన్నదా? ఆమెకు అతని అవసరం ఉన్నదా, ఇంకా? వాళ్లిద్దరూ అంతంలేని ఆట ఏదో ఆడుతున్నారు కదూ? దీనికోసం జీవించాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? లేదు. ఈ క్రీడను సంసారం అంటారు- పిల్లలు ఆడాల్సిన ఆట ఇది- దీన్ని ఒకసారి, రెండుసార్లు, పదిసార్లవరకు ఆడి, బహుశ: ఆనందించవచ్చు- కానీ నిరంతరంగా, ఎప్పటికీ ఆడాలంటే, ఈ ఆటకు అంత యోగ్యత ఉన్నదా?"

ఈ ఆట అంతమైందని సిద్ధార్థునికి అర్థమైంది- ఇక తను ఈ ఆటను ఆడలేడు. అతని శరీరం ఒకసారి కంపించింది. తనలోని ఏదో అంతరించిన భావన కల్గింది అతనికి.

అతను ఆ రోజంతా మామిడిచెట్టు క్రిందే కూర్చున్నాడు. తన తండ్రి గురించి, గోవిందుని గురించి, గౌతముని గురించి ఆలోచిస్తూ. తాను కామస్వామి అవ్వటంకోసం వీరందరినీ వదిలిపెట్టాడా?

రాత్రి చీకటి పడేంతవరకు అక్కడే కూర్చున్నాడు. పైన ఆకాశంలో నక్షత్రాలను చూసి అతను అనుకున్నాడు- "నేను ఇక్కడ, నా మామిడి చెట్టు క్రింద, నా ఆనందవనంలో, కూర్చొని ఉన్నాను." అని. ఈ ఆలోచనవల్ల అతని ముఖంపై చిరునవ్వొకటి కదలాడింది. ఇలా తను ఒక మామిడి చెట్టుకు, ఒక తోటకు యజమాని కావలసిరావటం అంత అవసరమా, అది అసలు సరైనదేనా, మూర్ఖత్వం కాదూ? "

అది కూడా ముగిసిపోయింది. అతనిలో అదికూడా అంతరించింది. అతనులేచి, మామిడి చెట్టుకు, ఆనంద వనానికి వీడ్కోలు చెప్పాడు. ఆ రోజంతా ఏమీ తినకపోవటం వల్ల అతనికి విపరీతంగా ఆకలివేస్తున్నది- పట్టణంలోని తన భవంతి, తనగది, పడక, ఆహారపదార్థాలతో నిండిన బల్ల- అన్నీ గుర్తుకు వచ్చాయి. అతను అలసటతో కూడిన నవ్వొకటి నవ్వి, తలఊచి, వీటన్నిటికీ వీడ్కోలు పల్కాడు.

రాత్రికి రాత్రే సిద్ధార్థుడు తన తోటను, పట్టణాన్ని వదిలిపెట్టాడు; ఇక ఎన్నడూ తిరిగి రాలేదు. చాలాకాలం వరకూ కామస్వామి అతనికోసం వెతికించాడు- సిద్ధార్థుడు ఎవరో బందిపోటుదొంగల పాలబడ్డాడని అతనికి అనుమానం. కమల అతనికోసం వెతకలేదు. సిద్ధార్థుడు కనబడటం లేదన్న వార్త ఆమెకు ఆశ్చర్యం కలిగించలేదు- ఆమె ఎప్పుడూ అనుకునేదే గదా, అతను శ్రమణుడు కాదూ? గృహమంటూ లేని, యాత్రికుడు కదూ, అతను? తాము చివరిసారి కలిసినప్పుడు ఆమెకు ఇది చాలా గట్టిగా అనిపించిందికూడా. (ఇష్టమైనవాడిని) కోల్పోయిన బాధలోనే, "తమ తుది సంగమంలో తాను అతన్ని తనకు అంత దగ్గరగా హత్తుకొన్నది, అతనికి అంత పరిపూర్ణంగా స్వాధీనమైంది, అంత సంపూర్ణంగా లోబడింది-" అన్న ఆలోచన ఆమెకు సంతోషాన్నిచ్చింది.

సిద్ధార్థుని అదృశ్యం గురించి తెలియగానే మొదట ఆమె తన గది కిటికీ దగ్గరకు వెళ్లింది. అక్కడ బంగారు పంజరంలో, ఆ అరుదైన, పాటలుపాడే పిట్ట బందీ అయి ఉన్నది. ఆమె పంజరాన్ని తెరచి, పక్షిని చూస్తూ చాలాసేపు నిశ్చలంగా నిలబడిపోయింది. ఆనాటినుండీ ఆమె ఇక విటులనెవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు- ఇంటి తలుపుల్ని మూసివేసింది. కొద్దికాలం తరువాత, తాను గర్భవతిననీ, సిద్ధార్థునితో కలిగిన చివరి సంగమ ఫలం తన గర్భంలో పెరుగుతున్నదనీ గ్రహించింది.

changed March 26, 2008