మేలుకొలుపు

పరిపూర్ణ జ్ఞాని అయిన బుద్ధుడు ఉన్న వనాన్ని, గోవిందుడు నిలచిపోయిన ఆ వనాన్ని వదిలి వెళ్తున్నప్పుడు, తను కూడా తన పాత జన్మను ఆ తోటలోనే వదిలి వెళ్తున్నట్లు అనిపించింది సిద్ధార్థునికి. తన దారిన తను నడుస్తుండగా అతని మస్తిష్కం నిండా ఇదే ఆలోచన ఉన్నది. అతడు లోతుగా ఆలోచించాడు. ఈ భావన అతనిని పూర్తిగా ముంచెత్తి, అతను కారణాలు గుర్తించగలిగే స్థితిని చేరుకునేంత వరకు ఆలోచించాడు, ఏమంటే, కారణాలను గుర్తించటం అంటే, ఆలోచించటం; కేవలం ఆలోచనవల్లనే భావనలు జ్ఞానంగా మారతాయి. అప్పుడు మాత్రమే ఆ భావనలు అదృశ్యమవ్వవు, వాస్తవాలౌతాయి, పరిపక్వమవ్వటం మొదలుపెడతాయి.

సిద్ధార్థుడు తన దారిన తాను నడుస్తూ లోతుగా ఆలోచించాడు. "తను ఇక యువకుడు కాదు’ అని అతను గుర్తించాడు; అతను ఇప్పుడు ఎదిగిన మనిషి. పామును కుబుసం వీడినట్లు, తనను ఏదో విడిచిపెట్టిందని అతను గ్రహించాడు. తనలో భాగంగా ఉండిందీ, తను యువకుడిగా ఉన్నప్పుడంతా తనను అనుసరించిందీ ఏదో- ఇప్పుడు ఇక తనతో లేదు: అది- 'గురువులను కలిగి ఉండాలనే కోరిక, వారి బోధల్ని వినాలనే ఇచ్ఛ'- ఆ కోరిక ఇప్పుడిక లేదు. తను కలిసిన చివరి గురువును కూడా తను వదిలిపెట్టాడు- చివరికి అత్యున్నతుడు, పరిపూర్ణ జ్ఞాని, అతి పవిత్రుడు అయిన బుద్ధుడిని కూడా వదిలి పెట్టాడు. తను ఆయనను వదిలిపెట్టక తప్పలేదు- తను ఆయన బోధల్ని అంగీకరించలేక పోయాడు.

మెల్లగా ఈ ఆలోచనా కర్త తన దారిన ముందుకు సాగాడు, తనని తాను ప్రశ్నించుకున్నాడు- "నువ్వు గురువులనుండి, వారి బోధనలనుండి ఏమి నేర్చుకోవాలనుకున్నావు? మరి వాళ్లు నీకు ఎన్నో విషయాలు నేర్పించి కూడాను, నేర్పలేకపోయింది ఏమిటి?" అని. అతనికి అనిపించింది, "తను నేర్చుకోవాలనుకున్నది తన ఆత్మనే! దాని స్వభావాన్ని, దాని లక్షణాన్ని తను నేర్చుకోవాలను కున్నాడు.- "నేను నానుండి నా ఆత్మను వదిలించుకుందామనుకున్నాను, దాన్ని జయించుదామనుకున్నాను, కానీ నేను దాన్ని జయించలేకపోయాను, కేవలం దాన్ని మోసగించగల్గాను, దానినుండి కేవలం పారిపోగల్గాను, కేవలం దాన్నుండి దాక్కొనగల్గాను. నిజంగానే, ఈ ఆత్మ తప్ప ప్రపంచంలో మరేదీ నా ఆలోచనలను ఇంతగా నింపి ఉంచలేదు- ఈ ఆత్మ, ఈ జటిల సమస్య- "నేను జీవిస్తున్నాను, నేను ఒకడిని ఉన్నాను, ఈ నేను ఇతరులందరికీ భిన్నమైనదానిని, వారందరికీ వేరుగా ఉన్నాను, నేను సిద్ధార్థుడిని" అనే ఈ 'నేను' నా ఆలోచనలన్నింటినీ సంపూర్ణంగా ఆక్రమించి ఉన్నది. అయినప్పటికీ, ప్రపంచంలో దీన్ని గురించి- ఈ అసలు సిద్ధార్థుని గురించి- నాకు తెలిసినంత తక్కువ, మరే ఇతర వస్తువును గురించీ తెలియదు."

ఈ ఆలోచనా కర్త, మెల్లగా తన దారి వెంబడి తను వెళ్తూ, వెళ్తూ, అకస్మాత్తుగా నిశ్చలంగా నిలబడిపోయాడు- ఈ ఆలోచన అతన్ని బంధించివేసింది- కానీ అంతలోనే ఇంకొక ఆలోచన, ఇందులోనుండే తలెత్తింది: "నాకు ’నా’ గురించి ఏమీ తెలియక పోవటానికి, సిద్ధార్థుడు నాకు అపరిచితునిలా, అంతుబట్టకుండా దూరంగా ఉండిపోవటానికి, కారణం ఒకటున్నది- ఒక్కటే కారణం- నాకు ఈ ’నేను’ అంటే భయం, నేను నా ఈ ఆత్మనుండి పారిపోతున్నాను. నేను పరబ్రహ్మకై, పరమాత్మకై వెంపర్లాడాను. ’నన్ను’ నాశనం చేయాలనుకున్నాను. ’నా’నుండి దూరంగా పారిపోదామనుకున్నాను, అంతరంగపు అడుగును కనుగొనటంకోసం, అన్నింటికీ ఆధారమైన దానిని కనుగొనటం కోసం, ఆత్మను, ప్రాణాన్ని, దివ్యత్వాన్ని, సంపూర్ణత్వాన్ని కనుగొనటం కోసం. కానీ అలా చెయ్యటంలో, ఆ మార్గంలో నన్ను నేను కోల్పోయాను". సిద్ధార్థుడు పైకి చూశాడు, తన చుట్టూ పరికించాడు. చిరునవ్వొకటి అతని ముఖం నిండా పరచుకున్నది. ఏదో దీర్ఘ స్వప్నం నుండి కళ్లు తెరచిన బలమైన భావన ఒకటి అతని అస్తిత్వపు లోతులనుండి నేరుగా పరచుకున్నది. తను ఇక ఏం చెయ్యాలో తెలిసినవాని మాదిరిగా, సిద్ధార్థుడు వెంటనే వేగంగా నడక సాగించాడు.

"అవును, నేను ఇక సిద్ధార్థుని నుండి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నించను. ఇకపై నా ఆలోచనలను ఆత్మపైగాని, ప్రపంచపు బాధలపైగానీ వెచ్చించను. శిధిలాల్ని అన్వేషించేందుకై ఇకపైన నన్ను నేను ఖండించుకొని, నాశనం చేసుకోను. ఇక నేను యోగాన్నిగాని, వేదాన్నిగాని, సన్యాసాన్నిగాని, ఏ ఇతరబోధనల్నిగానీ పఠించను. ’నా’నుండి నేర్చుకుంటాను, ’నాకు’ నేను శిష్యుణ్ణవుతాను. సిద్ధార్థుని రహస్యాన్ని నానుండి నేను నేర్చుకుంటాను’ అనుకున్నాడు అతను గట్టిగా.

ప్రపంచాన్ని తొలిసారి చూస్తున్నవాడిలాగా, సిద్ధార్థుడు చుట్టూ కలయజూశాడు. ప్రపంచం అందంగాను, వింతగాను, అద్భుతంగాను తోచింది. ఇక్కడ నీలం, ఇక్కడ పసుపు పచ్చ, ఇక్కడ ఆకుపచ్చ, ఆకాశం, నది, అడవి, కొండలు- అన్నీ అందంగాను, అన్నీ మహాద్భుతంగాను, మంత్ర ముగ్ధాలుగాను, వాటి మధ్యలో తను- ఈ సిద్ధార్థుడు- మేల్కొన్నవాడు- ’తన’ వద్దకు పయనిస్తూ. ఇవన్నీ- ఈ పసుపు పచ్చ, ఈ నీలం, ఈ నది, ఈ అడవి- ఇవన్నీ సిద్ధార్థుని కనులముందు మొదటిసారి కదలాడాయి. "ఇదంతా ఇక మారుని మాయకాదు, మాయ కప్పే ముసుగు కాదు. ఇవన్నీ విద్యమాన ప్రపంచపు అర్ధరహితమైన, సంభావ్యతాపూర్ణమైన వైవిధ్యతలు కాదు; ఏకత్వాన్ని కోరుతూ, వైవిధ్యతను తిరస్కరించిన బ్రాహ్మణ పండితులు ద్వేషించే ప్రపంచపు వివిధ ముఖాలు కాదు. నది నదే. ఒకవేళ సిద్ధార్థునిలోని పరమాత్మ, దివ్యత్వం రహస్యంగా ఆ నీలంలోను, నదిలోను నివసిస్తే, అక్కడ పసుపు పచ్చ, నీలం, -ఇక్కడ సిద్ధార్థుడు- ఉండాలనేది కేవలం ఆ దైవకళ. అర్థాలూ, వాస్తవాలూ వస్తువుల వెనక ఎక్కడో దాక్కొని లేవు- అవి వస్తువులలోనే ఉన్నాయి: వస్తువులంతటా వ్యాపించి ఉన్నాయవి.

త్వరగా నడుచుకొనిపోతూ అతడు అనుకున్నాడు- "నేనెంత చెవిటివాడిని, మూర్ఖుడిని అయినాను! ఎవరైనా తాము చదవాలనుకొన్నదానిని చదివేటప్పుడు, ఆ వ్రాతలోని అక్షరాలను, విరామ చిహ్నాలను ద్వేషించరు, వాటిని భ్రమగాను, విలువలేనివిగాను, సంభావ్యతా పూర్ణాలుగాను తలచరు. వారు వాటిని చదువుతారు, చదివి వాటిని ప్రేమిస్తారు, ఒక్కొక్క అక్షరాన్నీ ఇష్టపడతారు. కానీ నేను- ప్రపంచపు పుస్తకాన్ని చదవాలనుకొన్న నేను- నా స్వీయ స్వభావమనే పుస్తకాన్ని చదవదలచిన నేను- అందులోని అక్షరాల్ని, గుర్తుల్ని ముందుగానే ద్వేషించటం మొదలుపెట్టాను. నేను ఈ రూప ప్రపంచాన్ని భ్రమగా తలచాను. నేను నా కళ్లను, నా నాలుకను సంభావ్యతవల్ల కలిగినవిగా తలచాను. ఇప్పుడది ముగిసింది. నేను మేలుకున్నాను. నేను నిజంగానే మేలుకున్నాను. ఈ రోజే జన్మనెత్తాను."

సిద్ధార్థుని మనసులో ఈ ఆలోచనలు నడుస్తుండగా, మార్గమధ్యంలో- పాము ఎదురైనట్లు-అకస్మాత్తుగా అతడు ఆగిపోయి, స్థిరంగా నిలబడ్డాడు:

ఆ క్షణంలో అతనికి ఇంకొక సంగతి స్పష్టమయ్యింది- తను- కొత్తగా మేలుకొన్న తాను, కొత్తగా జన్మనెత్తిన తాను, తన జీవితాన్ని పూర్తిగా కొత్తగా ప్రారంభించాలి. ఆరోజు ఉదయం తాను జేతవనాన్ని వదిలినప్పుడు, బుద్ధభవానుని ఆ వనాన్ని వదిలినప్పుడు, అప్పటికే మేలుకొని, ’తన’వద్దకు పయనించటం మొదలు పెట్టినప్పుడు- తనయింటికి, తన తండ్రి వద్దకు- తిరిగి వెళ్లాలనుకున్నాడు. అనేక సంవత్సరాల సన్యాసం తరువాత తను ఇంటికి తిరిగి వెళ్లటం సహజమైన చర్యగా తోచింది అప్పుడు. కానీ ఇప్పుడు, మార్గమధ్యంలో పాము ఎదురైనట్లు తాను నిశ్చలంగా నిల్చున్న ఈ క్షణంలో, అతనికి ఈ ఆలోచనకూడా కలిగింది: "ఇప్పటి నేను గతంలో ఉన్నవాడిని కాదు. నేనిప్పుడు సన్యాసిని కాదు, పురోహితుడిని కాదు, బ్రాహ్మణుడిని కాదు. మరి నేను ఇంట్లో మా నాన్న గారితో కలిసి ఏం చేయను? చదవాలా? యజ్ఞాలు చెయ్యాలా? ధ్యానసాధన చెయ్యాలా? ప్రస్తుతానికి ఇవన్నీ ముగిశాయి, నావరకూ."

సిద్ధార్థుడు నిశ్చలంగా నిలబడ్డాడు. ఒక క్షణకాలంపాటు మంచులాంటి చల్లని వణుకొకటి అతన్ని ముంచెత్తింది. తను ఎంత ఒంటరో గుర్తించినప్పుడు అతను అంతర్గతంగా ఒక పిల్లజంతువు మాదిరి, పక్షి మాదిరి, లేదా కుందేలు పిల్ల మాదిరి కంపించాడు. అనేక సంవత్సరాలుగా తను నిరాశ్రయుడిగా, ఇల్లు లేకుండా బ్రతికాడు. కానీ ఎన్నడూ ఇలా అనిపించలేదు. ఇప్పుడు ఆతనికి తెలిసింది. గతంలో, తను చాలా లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు, తను ఇంకా తన తండ్రి బిడ్డడే, గొప్ప బ్రాహ్మణుడే, సాంప్రదాయికమైన వ్యక్తే. ఇప్పుడు తను కేవలం సిద్ధార్థుడు, మేల్కొన్నవ్యక్తి. ఇదికాక ఇంకేమీ కాడు. అతనొక్కసారి లోతుగా శ్వాస పీల్చాడు, ఒక్క క్షణకాలం పాటు కంపించాడు. తనంత ఒంటరి ఎవ్వరూ లేరు. తను క్షత్రియుడు కాదు- ఏ రాజవంశానికీ చెందిన వాడు కాదు; ఏలాంటి వృత్తిదారుడూ కాడు- ఎలాంటి వృత్తిదారుల సంఘాన్నీ, దాని జీవితాన్ని,భాషనూ శరణు జొచ్చే వీలు లేదు. అతడిపుడు బ్రాహ్మణుడూ కాడు, బ్రాహ్మణుల జీవితాన్ని పంచుకునేందుకు; శ్రమణులకు చెందిన సన్యాసికూడా కాడు!

అరణ్యంలో అత్యంత ఏకాంతవాసం చేసే ముని కూడా ఒంటరి కాడు- అతను కూడా ఏదో ఒక వర్గానికి చెందినవాడే అయి ఉంటాడు. గోవిందుడు భిక్షువు అయ్యాడు- వేలాది ఇతర భిక్షువులు అతని సోదరులు: అవే వస్త్రాలు ధరిస్తారు, అవే నమ్మకాలను పంచుకుంటారు, అదే భాషలో మాట్లాడతారు. కానీ తను, సిద్దార్థుడు- తాను దేనికి చెందుతాడు? ఎవరి జీవితాన్ని తను పంచుకుంటాడు? ఎవరి భాషలో తను మాట్లాడతాడు?

అతని చుట్టూ అల్లుకొని ఉన్న ప్రపంచం మొత్తం కరగిపోయిన ఆ క్షణాన, ఆకాశంలో ఒంటరి నక్షత్రం మాదిరి అతనొక్కడే ఏకాకిగా నిలచిన ఆ క్షణాన్న భయంకరమైన నిస్పృహ అతనిని ఆవరించింది- కానీ అతను గతంలో కంటే ఇంకా ఎక్కువగా ’తానైనాడు’. 'అతనిలోని మేలుకొలుపుకు సూచిక' అన్నట్లు, అతని మేను చివరిసారి కంపించింది- జననపు బాధలో చివరిది. ఆ వెంటనే అతడు కదిలి ముందుకు సాగాడు; త్వరత్వరగా, ఆతృతగా నడవటం మొదలు పెట్టాడు- ఇక ఇంటివైపుకు కాదు, ఇక తండ్రి వద్దకు కాదు, ఇక వెనక్కి తిరిగి చూస్తూ కాదు.

changed April 29, 2010