బ్రాహ్మణ కుమారుడు

ఇంటి పంచన; నది ఒడ్డున, పడవల ప్రక్కన కాచే పగటి ఎండలో- రావిచెట్లు, అత్తి చెట్ల నడుమన- ముద్దులొలికే బ్రాహ్మణ కుమారుడు సిద్దార్ఠుడు, తన స్నేహితుడు గోవిందునితో పాటు పెరిగి పెద్దవుతున్నాడు. సంధ్యా వందనాలు , యజ్ఞాలు, క్రతువులు నది ఒడ్డున అదే పనిగా చేస్తూండటం వల్లనేమో, అతని చిన్నారి భుజస్కంధాలు చక్కని గోధుమ వర్ణం సంతరించుకున్నాయి. తను ఆటలాడేటప్పుడు, అమ్మ పాటలు పాడేటప్పుడు, నాన్నగారు పాఠాలు బోధిస్తున్నప్పుడు, పండితుల సహచర్యంలో ఉన్నప్పుడు, మామిడి తోటలో అతని కళ్లపై నీడలు నాట్యమాడేవి. సిద్ధార్ఠుడు ఈ సరికే చాలా పండితచర్చల్లో పాల్గొని ఉన్నాడు; గోవిందునితో తార్కికవాదం చేశాడు; అతనితో కలిసి ధ్యానాన్ని, --------విద్యను సాధన చేశాడు. నిశ్శబ్దంగా 'ఓం' ను ధారణ చేయటం ఈపాటికే అతనికి వచ్చేసింది. తను తీసుకునే ప్రతి ఊపిరితోబాటు ఓంకారాన్ని అంతరంగంలో స్మరించటం, ఊపిరి వదిలేటప్పుడు తన ఆంతరాత్మతో సంపూర్ణంగా ఈ ప్రణవనాదాన్ని అనుసంధానించటం అలవడింది. బ్రహ్మ తేజం అతని ముఖంలో ప్రతిఫలిస్తోంది. తన అంతరంగపు లోతుల్లో విశ్వాంతర్యామి, అవినాశి అయిన పరమాత్మను గుర్తించటం అతనికి ఈ సరికే అర్ధమైంది.

తన కుమారుని మేధస్సును, అతని జ్ఞానాభిలాషను చూసుకొన్నప్పుడు అతని తండ్రి మనస్సు సంతోషంతో నిండిపోయేది. తన పుత్రుడు గొప్ప పండితుడౌతాడని, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, వరిష్ఠ పురోహితుడౌతాడని ఆయన కలలు కనేవాడు.

కొడుకు నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, సంపూర్ణ సౌందర్యంతో తనకు నమస్కరిస్తున్నప్పుడు ఆ తల్లి గుండెల్లో గర్వం తొణికిసలాడేది. "తన సిద్ధార్ఠ! బలశాలి! అందగాడు! చక్కని శరీర సౌష్టవం గలవాడు!" అని.

సిద్ధార్ఠుడు రాజసం ఉట్టిపడే కళ్లతో, తీగలాంటి శరీర ఆకృతితో హుందాగా పట్టణ వీధుల గుండా నడుస్తుంటే పడుచు బ్రాహ్మణ యువతుల గుండెల్లో ప్రేమ ఉరకలెత్తేది.

అందరికంటే అధికంగా అతనిని ఆరాధించేది అతని స్నేహితుడు, బ్రాహ్మణ పుత్రుడైన గోవిందుడు. సిద్ధార్థుని అందమైన కళ్లను, స్పష్టమైన కంఠస్వరాన్నీ అతను ప్రేమించేవాడు. సిద్ధార్థుని నడకతీరంటే గోవిందునికి ఇష్టం. శరీరపు కదలికల్లో అతని లాస్యం గోవిందుని ఆరాధన. సిద్ధార్థుడు ఏమేం చేసేవాడో అవన్నీ గోవిందునికి ఇష్టమయ్యేవి- అతను ఏది మాట్లాడితే అదల్లా నచ్చేది. అయితే అతను అన్నిటికంటే ఇష్టపడేది సిద్ధార్థుని మేధస్సును, అతని సున్నితమైన, సునిశితమైన ఆలోచనలను, అతని దృఢనిశ్చయాలను, అతని ఉన్నత వ్యక్తిత్వాన్ని. "అతను ఒక సాధారణ బ్రాహ్మణుడో, కర్మలు చేయించే ఒక బద్ధకపు మొద్దులాంటి అధికారో, మంత్రాలతో పబ్బంగడుపుకొనే దురాశాపరుడో, నిరుపయోగంగాను, మోసపూరితంగాను కబుర్లు చెప్పే ఉపన్యాసకుడో, దొంగచాటు పనులు చేసే దుర్మార్గపు పూజారో, లేకపోతే ఏదో ఒక పెద్ద మందలో ఒక అమాయకప్రాణిగా బ్రతుకు వెళ్ళదీసే తెలివిలేని మూర్ఖపు గొర్రో అవ్వడు-" అని మాత్రం గోవిందునికి తెలుసు. "ఉహు, అవ్వడు. తను-గోవిందుడు కూడా ఇలాంటివేమీ కాడు. పదివేలమంది సాధారణ బ్రాహ్మణుల్లో ఒకడుగా బ్రతకడు తను."

గోవిందునికి సిద్ధార్థుడిని అనుసరించాలని కోరిక. "తనకు ప్రియమైన, అద్భుతమైన సిద్ధార్థుడిని అనుసరించాలి. ఒకవేళ అతను ఎప్పటికైనా దేవుడైపోతే, ఒకవేళ ఎప్పటికైనా తేజోమయమైన స్వర్గధామంలోకి ప్రవేశిస్తే, అప్పుడు గోవిందుడు అతని స్నేహితుడిగా, అతని సహచరునిగా, అతని సేవకునిగా, అతని ధ్వజవాహకునిగా, అతని నీడగా అతని వెంట వెళ్తాడు."

అందరూ సిద్ధార్థుడిని అంతగా ప్రేమించేవాళ్ళు. అతను అంతగా మురిపించేవాడు, అందరినీ సంతోషపరచేవాడు.

కానీ స్వయంగా సిద్ధార్థుడిలో మాత్రం సంతోషం లేదు. అత్తి పండ్ల తోటలోని గులాబి దారులవెంట గమ్యంలేనట్లు తిరుగుతున్నా, తోటలోని పలాస నీడలో ఆలోచనాగ్రస్తుడై కూర్చుని ఉండిపోయినా, ప్రతిరోజూ ప్రాయశ్చిత్త స్నానాల్లో భాగంగా శరీర అవయవాలన్నింటినీ శుభ్ర పరచుకుంటున్నా, మామిడి చెట్ల గుబుర్ల నడుమ చూడ చక్కని లాస్యంతో యజ్ఞ హవ్యాలను సమర్పిస్తున్నా, అందరిచేతా ప్రేమింపబడుతున్నా, అందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నా- అతని అంతరంగంలో మాత్రం ఆనందం కరవైంది. నదినుంచి, రాత్రిపూట మెరిసే చుక్కల్లోంచి, మండే సూర్యుకిరణాల్లోంచి కలలు, అశాంతితో నిండిన ఆలోచనలు అతనిలోనికి ప్రవహించేవి. యజ్ఞగుండాలపొగ నుండి పైకి ఎగిరి వచ్చి రుగ్వేదపు రుక్కుల నుండి వెలువడి, పురాతన బ్రాహ్మణుల బోధనల నుండి జాలువారి- కలలు, అంతరాత్మను క్షోభ పెట్టే అశాంతి అతన్ని ముప్పిరిగొనేవి.

సిద్ధార్థుడు తనలోని అసంతృప్తి బీజాలను గమనించసాగాడు. తన తల్లిదండ్రుల ప్రేమగాని, చివరికి తన స్నేహితుడు గోవిందుని ప్రేమకూడాను- తనను ఎల్లప్పుడూ సంతోషపెట్టజాలదని, తనకు శాంతినివ్వజాలదని, తనను తృప్తిపరదని, సరిపోదని అతనికి అనిపించసాగింది. ఇంకొక అనుమానం కూడా అతన్ని వేధించసాగింది: "గౌరవనీయులైన తన తండ్రిగారుగాని, తన ఇతర గురువులుగాని, జ్ఞానవంతులైన బ్రాహ్మణ శ్రేష్ఠులందరూగాని, తమ జ్ఞానంలో అధిక భాగాన్ని- ప్రధానభాగాన్నంతా- పూర్తిగా ఇప్పటికే అతనికి అందించేశారు; తమ విజ్ఞానం సర్వస్వాన్నీ ఇప్పటికే వేచి ఉన్న తన పాత్రలోకి ఒంపేశారు, అయినా ఆ పాత్ర నిండలేదు, తన మేధస్సుకు సంతృప్తి కలగలేదు, తన ఆత్మకు శాంతి లభించలేదు, తన హృదయంలో నిశ్చలత లేదు. ప్రాయశ్చిత్త స్నానాలు బాగున్నాయి- కానీ అవి నీళ్ళే! - తన పాపాలను అవి కడిగి వెయ్యలేదు, ఆక్రోశిస్తున్న తన హృదయానికవి సాంత్వన నివ్వలేదు. యజ్ఞాలు, దేవతలను ఆవాహన చెయ్యటం అద్భుతంగా ఉండినై- కానీ, అవేనా అన్నీ? యజ్ఞాలు సంతోషాన్నిచ్చాయా? మరి దేవతల సంగతి? ప్రపంచాన్ని సృజించినవాడు నిజంగా ప్రజాపతేనా? దాన్ని సృజించింది- మరి తానొక్కడే సృజించింది- ఆత్మ కాదూ? నీలాగా, నాలాగా సృజించబడ్డ రూపాలు గదా, దేవతలుకూడాను?- నశించేవీ, భంగురమైనవిన్నీ? అందువల్ల దేవతలకు యజ్ఞాలద్వారా హవ్యాలనివ్వటం నిజంగా మంచిదేనా, సరైనదేనా? అర్థవంతమైనదేనా, విలువగలపనేనా అసలది? వేరే ఎవరికోసం యజ్ఞాలు చెయ్యాలి, వేరే ఎవరి పట్ల మనం భక్తిశ్రద్ధలు చూపాలి,- ఆ అవ్యక్తునికి, పరమాత్మకు, ఆత్మైక స్వరూపునికి తప్ప? ఈ పరమాత్మ ఎక్కడ కనబడతాడు, ఆ అవ్యక్తుడెక్కడ నివసిస్తాడు, ఆ ఆత్మ స్వరూపుని అనంత హృదయం ఎక్కడ స్పందిస్తూంటుంది? ప్రతి వ్యక్తి లోపల, హృదయాంతరాళంళో, అంతరంగంలోని ఆ అనంతంలో తప్ప? కానీ, ఈ "లోపల", ఈ అంతరాళం, ఈ ఆత్మ ఎక్కడ ఉంది? అది మాంసం ఎముకలతో కూడిన ఈ శరీరంకాదు, ఆలోచన కాదు, తెలివిడి-విజ్ఞానం- కాదు- అలా అని జ్ఞానులు బోధిస్తున్నారు. మరి, అది ఎక్కడ ఉన్నట్లు? ఈ ఆత్మ వైపుకు, ఈ "నిజమైన నేను" వైపుకు- పయనిచేందుకు అనుసరించదగిన మంచి మార్గం వేరే ఏదైనా ఉందా? ఎవ్వరూ ఆ మార్గాన్ని చూపలేదు, ఎవ్వరికీ తెలీదు- తన తండ్రికిగాని, గురువులకుగాని, జ్ఞానులకుగాని, పవిత్ర మంత్రాలకుగాని- ఎవ్వరికీ తెలీదు. బ్రాహ్మణులకు, వారి పవిత్ర గ్రంధాలకు అంతా తెలుసు; మొత్తం. వాళ్లు స్పృశించని అంశంలేదు- విశ్వం యొక్క సృష్టి, శబ్దపు పుట్టుక, ఆహారం, ఉచ్చ్వాసం, నిశ్వాసం, ఇంద్రియాల అమరిక, దేవతల చర్యలు ఆశ్చర్యాన్ని గొల్పేటన్ని విషయాలు తెలుసువాళ్లకి- కానీ ఎన్ని తెలుసుకొనీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా, అతి ప్రధాన మైన ఆ ఒక్క విషయం- నిజానికది ఒక్కటే ప్రధానవిషయం- అది- తెలీకపోతే?"

"వేదాలలోని అనేక ఋక్కులు- ముఖ్యంగా సామవేదం చివర్లోని ఉపనిషత్తులు- ఈ అంతరాత్మ గురించి చెప్పాయి: "ఆత్మే సర్వ ప్రపంచము" అని చెప్తున్నాయవి. దీని ప్రకారం, మనం నిద్రిస్తున్నప్పుడు మన అంతరంగపు లోతుల్లోకి చొచ్చుకుపోయి, మనం ఆత్మతో ఐక్యమొందుతాం. ఈ వేదమంత్రాలలో అద్భుతమైన జ్ఞానం ఉంది- తేనెటీగలు పూలనుండి మకరందం సేకరించినంత పరిశుభ్రంగా, అత్యాశ్చర్యకరమైన భాషలో ఋషుల విజ్ఞానం మొత్తం ఇక్కడ లభిస్తోంది. అవును, అమితమైన ఈ విజ్ఞాన సర్వస్వాన్ని- జ్ఞానవంతులైన బ్రాహ్మణులు తరతరాలుగా, ఒక పరంపరగా, సమీకరించి, సంరక్షించిన ఈ విజ్ఞానాన్ని మొత్తాన్నీ- అంత సులభంగా తీసి పారెయ్యలేం. కానీ ఈ జ్ఞానాన్ని కేవలం కలిగి ఉండటంలో మాత్రమేకాక, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటంలో కూడా విజయం సాధించిన బ్రాహ్మణులు, పురోహితులు, జ్ఞానులు ఎక్కడ ఉన్నారు? పరవిద్యను సాధన చేసి, నిద్రాసమయంలో ఆత్మతో ఏకమై, దానిని మెలకువలోను, జీవితమంతటా, అన్ని చోట్లా- వాక్కులోను, కర్మలలోను అన్నింటా- నిలుపుకున్న ఆ మహాత్ములెక్కడున్నారు?" సిద్ధార్థునికి గౌరవనీయులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు అనేకమంది తెలుసు- "వారందరిలోకీ ఉత్తముడు తన తండ్రి- పవిత్రుడు, పండితుడు, అత్యున్నతమైన మన్నన గలవాడు. తన తండ్రి మెచ్చుకొనదగినవాడు; ఆయన ప్రవర్తన ప్రశాంతంగాను, సమున్నతంగాను ఉంటుంది. ఆయన చక్కని జీవితాన్ని గడుపుతున్నాడు; ఆయన మాటల్లో జ్ఞానం ఉట్టిపడుతుంది; ఆయన మస్తిష్కంలోని ఆలోచనలు సున్నితంగాను, సమున్నతంగాను ఉంటాయి- కానీ అంత విషయ పరిజ్ఞానం కలిగినప్పటికీ, ఆయన సంపూర్ణానందంలో ఉంటున్నాడా? శాంతిని సాధించాడా? ఆయనకూడా తృప్తినెరుగని ఒక అన్వేషకుడు కాదూ? ఆయనకూడ నిరంతరం తృప్తిలేకుండా తీర్థస్థలాలకు, యజ్ఞాలకు, పుస్తకాలలోకి, బ్రాహ్మణుల ప్రవచనాలకు వెళ్లటంలేదూ? ఒకవేళ ఏ మచ్చా లేనివాడైతే ఆయన తన పాపాలను తుడిచేసుకోవటం ఎందుకు? ప్రతిరోజూ క్రొత్తగా తనను తాను పరిశుద్ధం చేసుకునేందుకు కృషి చెయ్యటం ఎందుకు? అంటే ఆత్మ ఆయనలో లేదా? అంటే ఆయన హృదయంలోపల ఆధారభూతమైనది ఏదీ లేనట్లేనా? మనం ఆ ఆధారాన్ని మన అంతరంగంలోనే కనుగొనాలి- దాన్ని మనం నిజంగా సంపాదించాలి. అది తప్ప మిగిలిన ప్రయత్నమంతా కోరికే- తప్పుడు దారి. తప్పు." సిద్ధార్థుని ఆలోచనలు అలా ఉండేవి; అదే అతని దాహం; అదే అతని దు:ఖం.

తరచు అతను ఛాందోగ్య ఉపనిషత్తులోని వాక్యాలు కొన్నింటిని మననం చేసుకునేవాడు- "నిజంగా చెప్పాలంటే, పరబ్రహ్మ పేరు సత్యం. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాళ్ళు ప్రతిరోజూ స్వర్గలోకంలోకి ప్రవేశిస్తారు". అది- ఆ స్వర్గలోకం- తరచు తనకు చాలా దగ్గరికి వచ్చినట్లు అనిపించేది అతనికి.. కానీ అతను నిజంగా ఏనాడూ దాన్ని చేరుకోలేదు; తన తృష్ణ ఏనాడూ పూర్తిగా తీరనూ లేదు. అతనికి తెలిసిన జ్ఞానుల్లో కూడాను, ఎవరెవరి బోధనల్ని అతను చాలా ఇష్ట పడేవాడో, వాళ్లల్లో ఏ ఒక్కరూ కూడాను- దాన్ని- ఆ స్వర్గధామాన్ని- చేరుకోలేదు. ఈ అనంతమైన దప్పికను సంపూర్ణంగా తీర్చుకోలేదు, ఒక్కరుకూడా.

"గోవిందా-" అన్నాడు ఒకనాడు సిద్ధార్థుడు, తన స్నేహితునితో- "గోవిందా, వెళ్దాం రా, మర్రిచెట్టు దగ్గరికి. ధ్యానం సాధన చేద్దాం." వాళ్ళిద్దరూ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకరికొకరు 20 అడుగుల దూరంలో కూర్చున్నారు. ఓంకారాన్ని జపించేందుకు కూర్చున్న సిద్ధార్థుడు ముందు మంద్రస్వరంతో శ్లోకం ఒకటి చదివాడు.

ఓంకారం విల్లు- బాణం ఆత్మ    
లక్ష్యం పరబ్రహ్మ    
ఆ లక్ష్యం వైపుకు నిర్విరామంగా పెట్టాలి గురి.

ధ్యానం కోసం మామూలుగా కేటాయించే సమయం ముగియగానే గోవిందుడు లేచి నిలబడ్డాడు. అప్పటికి సాయంకాలమయ్యింది. సాయంత్రపు సంధ్యావందనాది క్రియలకు సమయమైంది. అతను సిద్ధార్థుడిని పేరుపెట్టి పిలిచాడు, కానీ సమాధానం రాలేదు: చూడగా సిద్ధార్థుడు నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు- చూపు దూరంగా ఉన్న లక్ష్యం దేనిపైననో కేంద్రీకృతమై ఉన్నట్లున్నది. అతని పళ్ళ మధ్య సందులోంచి కొంచెంగా అతని నాలుక కొస కనబడుతున్నది. శ్వాస ఆడుతున్నట్లు లేదు. అతను ఆ విధంగా ధ్యానంలో ఒళ్లు మరిచిపోయి కూర్చుని, ఓంకారాన్నే ధ్యానిస్తూ, పరబ్రహ్మకేసి సంధించబడ్డ బాణం లాంటి ఆత్మతో అనుసంధానమైనాడు.

కొద్దిరోజుల క్రితమే కొందరు 'శ్రమణులు' సిద్ధార్థుడుండే పట్టణం గుండా వెళ్లారు- ఎక్కడా స్థిర నివాసం ఉండకుండా సంచరిస్తూ ఉండే సన్యాసులు వాళ్లు- సన్నగా, పీలగా, బక్కచిక్కిన ముగ్గురు మనుషులు. అంతగా ముసలివాళ్లూ కాదు, మరీ పడుచువాళ్లూ కాదు- వాళ్ల భుజాలు దుమ్ము గొట్టుకుపోయి, రక్తం ఓడుతూ ఉండినై. దాదాపు నగ్నంగా, ఎండకు మాడిపోయి, ఏకాకులుగా, వింతగా, సౌహార్ద్రతలేకుండా మానవ ప్రపంచంలో తిరుగాడుతున్న బక్క తోడేళ్లమాదిరి. స్తంభించిన ఉద్వేగాల వాతావరణం- ఘోరమైన వేషధారణ సృజించే, ఏమాత్రం జాలిలేని కౄరమైన ఆత్మ తిరస్కారపు వాతావరణం- వారి చుట్టూతా ఆవరించి ఉంది.

ఇప్పుడు, ఒక గంటపాటు ధ్యానం చేసిన తరువాత, ఆ సాయం సమయంలో- సిద్ధార్థుడు అన్నాడు గోవిందునితో- "స్నేహితుడా, రేపు ఉదయం ఈ సిద్ధార్థుడు శ్రమణులలో చేరనున్నాడు. అతను శ్రమణుడౌతాడు." అని.

ఈ మాటలు విని, తన మిత్రుని ముఖంలో ద్యోతకమౌతున్న దృఢ నిశ్చయాన్ని, వింటిని వదిలిన బాణం మాదిరి- పూర్వ నిర్ధారితమూ,అవిచలనమూ అయిన ఆ నిర్ణయాన్ని చూసి గోవిందుడు వివ్వెరపోయాడు. మిత్రుని ముఖాన్ని చూసిన క్షణంలోనే అతనికి "ఇప్పుడిక ఇది ప్రారంభం" అని అర్థమయ్యింది. సిద్ధార్థుడు ఇక తన సొంతదారిన ప్రయాణం మొదలుపెడుతున్నాడు. అతని విధి ఇప్పుడు ఇక తనకు తాను వెల్లడి కానున్నది. -దానితోపాటు తన ప్రారబ్ధం కూడాను. ఆ ఆలోచనవల్ల, ఎండిపోయిన అరటితొక్క మాదిరి నీలిగి పోయాడు గోవిందుడు.

"అయ్యో, సిద్ధార్థా, మీ నాన్నగారు దీనికి అంగీకరిస్తారంటావా?"

సిద్ధార్థుడు అప్పుడే కళ్ళు తెరుచుకున్నవాడి మాదిరి చూశాడతన్ని. గోవిందుని ఆత్మను, అందులోని ఆందోళనను, అందులోని నిస్పృహను, మెరుపువేగంతో చదివి అర్థంచేసుకున్నాడు.

"మనం పదాలను వృధా చేసుకోనక్కర్లేదు గోవిందా" అన్నాడతను మృదువుగా. "రేపు సూర్యోదయానికల్లా నేను శ్రమణుల జీవితం మొదలు పెడతాను. దీనిపై ఇక మళ్ళీ చర్చ వద్దు."

సిద్ధార్థుడు తండ్రిని చూడబోయేటప్పటికి ఆయన తన గదిలో దర్భగడ్డితో చేసిన చాపపై కూర్చుని ఉన్నాడు. అతడు వెళ్ళి తండ్రి వెనక నిలబడ్డాడు. తండ్రి తన రాకను గుర్తించే వరకు అతను అలా అక్కడే నిల్చున్నాడు. "నువ్వేనా సిద్ధార్థా? " అడిగాడు తండ్రి. "చెప్పు, నీ మనసులో ఏం నడుస్తోందో."

సిద్ధార్థుడన్నాడు: " మీ సమ్మతితో నివేదిస్తున్నాను, నాన్నగారూ, నేను రేపు మీ ఇల్లు వదిలి సన్యాసులలో చేరిపోవాలని అనుకుంటున్న సంగతి మీకు చెప్పాలని వచ్చాను. నేను శ్రమణుడినవుదామనుకుంటున్నాను. తండ్రిగారు దీన్ని కాదనరని ఆశిస్తున్నాను."

ఆయన ఏమీ మాట్లాడలేదు. సిద్ధార్థుడు చేతులు కట్టుకొని నిశ్శబ్దంగా, కదలకుండా అలాగే నిలబడ్డాడు. తండ్రికూడా నిశ్శబ్దంగా, కదలకుండా చాపమీద కూర్చొని ఉండిపోయాడు. తండ్రి ఎంతసేపు మాట్లాడలేదంటే, ఆకాశంలోని నక్షత్రాలు వారి చిన్న కిటికీని దాటిపోయి చివరికి తమ ఆకారాల్నికూడా మార్చుకున్నాయి. అప్పుడతని తండ్రి అన్నాడు: "బ్రాహ్మణులు కఠినంగాను, కోపంగాను మాట్లాడటం సమంజసం కాదు; కానీ నా హృదయంలో వ్యధ నిండి ఉన్నది. నువ్వు ఈ విషయాన్ని మరోమారు నాముందు ఎత్తవని నేను అనుకుంటున్నాను."

ఆయన మెల్లగా లేచి నిల్చున్నాడు. సిద్ధార్థుడు చేతులు కట్టుకుని నిశ్శబ్దంగా అలాగే నిలబడి ఉన్నాడు.

"ఇంకా దేనికోసం నించున్నావు?" అడిగాడు తండ్రి.

"మీకు తెలుసు, ఎందుకో" అన్నాడు సిద్ధార్థుడు.

అతని తండ్రి బాధగా గదిలోంచి బయటికి నడిచి తన మంచం మీద పడుకున్నాడు.

ఒక గంట గడిచింది. ఆ బ్రాహ్మణుడికి నిద్రపట్టలేదు. ఆయన లేచి, ఇంట్లో అటూ ఇటూ తిరిగి, ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. గది కిటికీలోంచి చూస్తే, లోపల సిద్ధార్థుడు కనిపించాడు నిలబడి- చేతులు కట్టుకుని, కదలకుండా. అతను ధరించిన పలుచని వస్త్రాలు సన్నగా మెరుస్తున్నాయి. ఆ తండ్రి గుండె చివుక్కుమన్నది. వెనక్కివెళ్లి మంచంమీద పడుకున్నాడు మళ్ళీ.

ఇంకొక గంట గడిచింది. బ్రాహ్మణుడికి ఇంకా నిద్ర రాలేదు. మళ్లీ ఒకసారి లేచి, అటూ ఇటూ తిరిగి ఇంటి బయట నిలబడ్డాడు. -చంద్రుడు ఉదయించాడు. ఆయన కిటికీలోంచి లోపలికి చూశాడు- సిద్ధార్థుడు నిలబడి ఉన్నాడు కదలకుండా, చేతులు కట్టుకొని. అతని చీలమండలపైన చంద్రునికాంతి పడుతున్నది. తండ్రి గుండె బరువెక్కింది. వెళ్ళి పడుకున్నాడు.

ఆయన మళ్లీ ఒక గంటకు, మళ్ళీ రెండవ గంటకు లేచి బయటికి వచ్చాడు. కిటికీలోంచి చూశాడు- సిద్ధార్థుడు ఇంకా నిలబడే ఉన్నాడు- చంద్రుని వెన్నెలలో, నక్షత్రాల కాంతిలో, చీకట్లో ఆయన నిశ్శబ్దంగా మళ్లీ మళ్లీ వచ్చి చూశాడు- గంట గంటకూ- గదిలోకి చూశాడు. కొడుకు నిశ్చలంగా అలాగే నిలబడి ఉన్నాడు. ఆయన గుండెల్లో కోపం. ఆందోళనతో, వ్యధాభరితంగా.

సూర్యోదయానికి ఒక గంటముందు, రాత్రి చివరి గంట మిగిలి ఉందనగా ఆయన మళ్లీ వచ్చాడు. గదిలోకి ప్రవేశించాడు. యువకుడు అక్కడే నిలబడి ఉన్నాడు- పొడవుగా, ఎవరో నూతన వ్యక్తి మాదిరి వింతగా అనిపిస్తున్నాడిప్పుడు.

"సిద్ధార్థా!" ఆయన అడిగాడు-" ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నావు?"

"మీకు తెలుసు దేనికోసమో"

"తెల్లవారి, మధ్యాహ్నమై, మళ్లీ చీకటి పడేంతవరకు అట్లాగే నిల్చొని ఉండి ఎదురుచూస్తుంటావా?"

"నేను నిలబడతాను, ఎదురుచూస్తాను."

"నువ్వు అలిసి పోతావు, సిద్ధార్థా!"

"నేను అలిసిపోతాను."

"నీకు నిద్ర వస్తుంది, సిద్ధార్థా!"

"నేను నిద్రపోను."

"నువ్వు చచ్చిపోతావు సిద్ధార్థా!"

నేను చచ్చిపోతాను."

"అంటే నువ్వు చచ్చిపోనైనా పోతావు గానీ, మీ నాన్న మాట వినవన్న మాట"

"సిద్ధార్థుడు ఎల్లప్పుడూ తండ్రి నిర్ణయాన్ని గౌరవిస్తూనే ఉంటాడు."

"అంటే మరి నువ్వు నీ ఈ పనిని వదిలి పెట్టేస్తావా?"

"సిద్ధార్థుడు తండ్రి చెప్పినట్లు చేస్తాడు."

ప్రభాతకాంతి అప్పుడప్పుడే గదిలోనికి ప్రవేశిస్తున్నది. ఆ బ్రాహ్మణుడు గమనించాడు- సిద్ధార్థుని కాళ్లు కొద్ది కొద్దిగా వణుకుతున్నాయి, కానీ సిద్ధార్థుని ముఖంలో వణుకు లేదు. అతని కళ్లు నిశ్చలంగా, చూపు సుదూరంగా ఉంది. "సిద్ధార్థుడిక తనతోపాటు ఈ ఇంట్లో ఉండే అవకాశం లేదు" అని ఆ తండ్రికి అర్థమైపోయింది- "అతను తనను వదిలేశాడు ఈ సరికే."

తండ్రి సిద్ధార్థుని భుజంపై చెయ్యి వేశాడు. "నువ్వు అరణ్యంలోకి వెళ్తావు" అన్నాడు. శ్రమణుడివౌతావు. ఒకవేళ నీకు అర్ణణ్యంలో సంపూర్ణానందం-మోక్షం-లభిస్తే, వెనక్కి వచ్చి ఆ విద్యను నాకూ నేర్పు. ఒకవేళ నీకు భ్రమలు తొలగిపోవటం మాత్రమే జరిగితే, అప్పుడుకూడా వెనక్కి రా, మనం ఇద్దరం కలిసి మళ్ళీ దేవతలకు యజ్ఞ హవిస్సులనివ్వవచ్చు. ఇప్పుడిక వెళ్ళు- మీ అమ్మకు నమస్కరించి, ఆమెకు చెప్పు- నువ్వెక్కడికి వెళ్తున్నావో. నాకైతే, ఇది నదికి వెళ్లి ఉదయ సంధ్యావందనాలు ఆచరించాల్సిన సమయం."

కొడుకు భుజం మీదినుండి చేయి తీసి, ఆయన బయటికి వెళ్ళిపోయాడు. నడవటానికి ప్రయత్నిస్తే సిద్ధార్థుడి కాళ్లు వణికి వంకర్లు తిరిగాయి. అతను తమాయించుకొని, తండ్రికి నమస్కరించి తనకు చెప్పబడిన పని చేసేందుకై తల్లి దగ్గరకు వెళ్లాడు.

ఉదయ సంధ్యలో, ఇంకా నిద్రపోతున్న పట్టణాన్ని వదిలి, మొద్దుబారిన కాళ్లతో, అతను మెల్లగా ముందుకు పోతుంటే, ఊరి చివరన గల గుడిశలోంచి నక్కుతూ బయటికి వచ్చిన నీడలాంటి ఆకారం ఈ యాత్రికుడిని కలుసుకున్నది. అది- గోవిందుడు!

"నువ్వు వచ్చావు" అని చిరునవ్వు నవ్వాడు సిద్ధార్థుడు.

"నేను వచ్చాను" అన్నాడు గోవిందుడు.

changed April 29, 2010