ప్రజల నడుమ

వ్యాపారి కామస్వామిని కలిసేందుకు వెళ్లాడు సిద్ధార్థుడు. సంపద ఉట్టిపడే ఆ భవంతిలోని ఒక గదిలో సిద్ధార్థుడు దాని యజమానికోసం వేచి ఉన్నాడు. పరిచారకులు అతనిని ఆ గదిలో కూర్చుండబెట్టేముందు ఖరీదైన తివాచీలు పరచిన మార్గంలో లోనికి తీసుకొని వెళ్లారు. కామస్వామి సన్నని, కలుపుగోలు మనిషి: ఇప్పుడిప్పుడే నెరుస్తున్న జుట్టు; తెలివి, లౌక్యం ఉట్టిపడే కళ్లు; శృంగార పిపాస కానవచ్చే నోరు. యజమాని, అతిథి ఒకరినొకరు సాదరంగా పలకరించుకున్నారు.

"మీరు బ్రాహ్మణులు, పండితులు అని, ఎవరైనా వ్యాపారి వద్ద పనిచేయ గోరుతున్నారని నాకు తెలిసింది" అని ప్రారంభించాడు వ్యాపారి. "మీరెందుకు పని చేయాలనుకుంటున్నారు? -దారిద్ర్యంలో (లేమి, అవసరం, నీడ్) ఉన్నారు కాబట్టేనా?"

"కాదు" అన్నాడు సిద్ధార్థుడు "నేను ఇప్పుడు దరిద్రంలో లేను, అంతేకాదు, ఎప్పుడూ లేమిలో లేను. నేను శ్రమణుల వద్ద చాలాకాలం గడిపి వచ్చాను"

"శ్రమణులనుండి వచ్చినట్లయితే మీరు దారిద్ర్యంలో ఎందుకులేరు? శ్రమణులు అందరూ పూర్తిగా ’నా’ అన్నది లేకుండా ఉండరా?"

"నాకు ఎలాంటి ఆస్తీ లేదు- ఒకవేళ మీ ఉద్దేశం అదే అయినట్లైతే. నిజంగానే నాకు ఎలాంటి సంపదగానీ లేదు, అయితే అది పూర్తిగా నా స్వయం నిర్ణయం! -అందుకని నేను లేమిలో లేను."

"కానీ ఎలాంటి ఆస్తులూ (పొసెషన్స్) లేకుండా మీరు ఎలా జీవిస్తారు?"

"నేనెప్పుడూ ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. నావంటూ ఏమీ లేకుండా నేను దాదాపు మూడు సంవత్సరాలున్నాను. ఈ కాలంలో ఎప్పుడూ ’నేను ఎలా జీవించాలి’ అన్న ప్రశ్న తలెత్తలేదు."

"అంటే మీరు ఇతరుల ఆస్తిపైన బ్రతికారన్నమాట!"

అలాగే అనిపిస్తున్నది మరి. వ్యాపారికూడా ఇతరుల ఆస్తులపైనే బ్రతుకుతుంటాడు."

"బాగా చెప్పారు, కానీ అతను ఇతరులనుండి దేన్నీ ఊరికే తీసుకోడు, తాను తీసుకున్నదానికి ప్రతిఫలంగా అతడు తనవద్ద ఉన్న వస్తువుల్ని ఇస్తాడు."

"ప్రపంచపు రీతి అలాగే ఉన్నట్లుంది. అందరూ తీసుకుంటారు, అందరూ ఇస్తారు. జీవితం అలాగే నడుస్తోంది."

"కానీ మీవంటూ ఏ ఆస్తులూ లేకపోతే, మీరెట్లా ఇవ్వగల్గుతారు?"

"ప్రతివాడూ తనవద్ద ఉన్నదానిని ఇస్తాడు. సైనికుడు శక్తిని ఇస్తాడు, వ్యాపారి వస్తువుల్ని ఇస్తాడు, గురువు శిక్షణ/విద్యనిస్తాడు, రైతు బియ్యాన్నిస్తాడు, జాలరి చేపల్ని ఇస్తాడు."

"బాగా చెప్పారు. మరి మీరేమి ఇవ్వగలరు? మీరు ఏమి నేర్చుకున్నారని, మీరు ఇవ్వగలరు?"

"నేను ఆలోచించగలను, నేను వేచిఉండగలను, నేను ఉపవాసం ఉండగలను."

"అంతేనా?"

"అంతేననుకుంటున్నాను."

"వాటివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది? ఉదాహరణకు ఉపవాసం- దానివల్ల ఏం ప్రయోజనం?"

"దానివల్ల చాలా ఉపయోగం ఉందండి. ఒక వ్యక్తికి ఎవరికైనా తినటానికి ఏమీ లేకపోతే, ఆవ్యక్తి చేయగల తెలివైన పని ఉపవాసం ఉండటం. ఉదాహరణకు, సిద్ధార్థునికి ఉపవాసం ఉండటం ఎలాగో తెలీకపోతే, ఇవాళ్టిరోజున అతను మీవద్దనో, లేదా ఇతరుల వద్దనో ఏదో ఒక రకమైన పనికి ఒప్పుకోవలసి వచ్చేది, ఏమంటే అకలి అతన్ని అందుకు ప్రేరేపించేది. కానీ ప్రస్తుతం అయితే, సిద్ధార్థుడు ప్రశాంతంగా వేచి ఉండగలడు. అతను అసహనం పాలవడు, అతనికి లేమి లేదు, చాలాకాలం వరకు అతను అకలిని దూరంగా ఉంచి, దానిని చూసి నవ్వగలడు. అందువల్ల "ఉపవాసం ఉండగల్గటం ఉపయోగకరం"అని తెలుస్తున్నది" అన్నాడు సిద్ధార్థుడు.

"చక్కగా చెప్పావు శ్రమణా, ఒక్క క్షణం ఆగు." కామస్వామి బయటికి వెళ్లి ఒక కాగితపు చుట్టతో తిరిగి వచ్చాడు. దానిని తమ అతిథికి అందించి అడిగాడు-"మీరు దీన్ని చదవగలరా?" అని. కాగితపు చుట్టలో వ్యాపార ఒప్పందం ఒకటి వ్రాసి ఉన్నది. సిద్ధార్థుడు దానిని చూసి చదవటం మొదలు పెట్టాడు.

"చాలా బాగుంది" అన్నాడు కామస్వామి. "ఇదిగో ఈ కాగితంలో నాకోసం ఏదైనా రాసి ఇవ్వగలరా?"

సిద్ధార్థుడు ఆ కాగితాన్నీ, కలాన్నీ తీసుకొని, ఏదోరాసి, రెండింటినీ వెనక్కి ఇచ్చాడు.

కామస్వామి చదివాడు: "రాయటం గొప్పది (మంచిది, గుడ్); (కానీ) ఆలోచించటం ఇంకా మంచిది. తెలివి గొప్పది; కానీ ఓపిక ఇంకా గొప్పది."

"మీరు చాలా బాగా రాస్తారు "మెచ్చుకున్నాడు వ్యాపారి- "మనం చర్చించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. అయితే మీరు మా యింట్లోనే ఉండి మా ఆతిథ్యం స్వీకరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను."

సిద్ధార్థుడు అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని అందుకు సమ్మతించాడు. ఇప్పుడతను వ్యాపారి ఇంట్లోనే నివసిస్తున్నాడు. వస్త్రాలు, మేజోళ్లు, ఇప్పుడు అతని దగ్గరకు వచ్చేవి. పరిచారకుడు ఒకడు స్నానానికి నీళ్లు అవీ సిద్ధం చేసేవాడు. రోజూ రెండు పూటలా అద్భుతమైన భోజనం అతనికోసం వడ్డింపబడింది. కానీ సిద్ధార్థుడు రోజుకు ఒకసారి మాత్రమే తినేవాడు. మాంసంగానీ, మద్యంగానీ ముట్టుకునేవాడు కాదు. కామస్వామి అతనితో తన వ్యాపారం గురించి మాట్లాడుతుండేవాడు, సరుకుల్ని, గిడ్డంగుల్ని చూపించేవాడు; జమాఖర్చుల పుస్తకాలు చూపేవాడు. సిద్ధార్థుడు కొత్త సంగతులు అనేకం తెలుసుకున్నాడు; అతను చాలా వినేవాడు, తక్కువ మాట్లాడేవాడు. కమల చెప్పిన మాటల్ని అతను జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు- ఏనాడూ అతను కామస్వామి పట్ల అతివినయాన్ని ప్రదర్శించలేదు- పైపెచ్చు కామస్వామి తనను, తనతో సమానంగాను, నిజానికి తనకంటే అధికునిగాను గౌరవించే విధంగా ప్రవర్తించాడు. కామస్వామి తన వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా -తరచు దానిపట్ల ఒక ఉద్వేగంతో- నడిపేవాడు. కానీ సిద్ధార్థుడు మాత్రం దాన్నంతా ఒక ఆట మాదిరి చూశాడు- ఆ ఆట నియమాలనైతే అతను చక్కగా నేర్చుకున్నాడు, కానీ అవేవీ అతని హృదయాన్ని తాకలేదు. కామస్వామి ఇంటిలో ఉండటం మొదలుపెట్టిన అనతికాలంలోనే అతడు యజమాని వ్యాపారంలో పాలు పంచుకోవటం మొదలుపెట్టాడు. అయితే ప్రతిరోజూ అందమైన కమల పిలిచిన సమయానికి వెళ్లి, అతను ఆమెను సందర్శించేవాడు- చక్కని వస్త్రాలు ధరించీ, చక్కని మేజోళ్లు ధరించీ. త్వరలో అతను అమెకు బహుమానాలుకూడా ఇస్తున్నాడు. తెలివైన ఆమె ఎర్రని పెదవులనుండి అతడు అనేక విషయాలు నేర్చుకున్నాడు. నునుపైన, సుకుమారమైన అమె హస్తాలు అతనికి అనేక సంగతులు నేర్పాయి. ప్రేమలోకంలో అనుభవాన్ని కోరుతూ, దాని లోతుల్ని అందుకునేందుకు గుడ్డిగా, తనివి తీరని దాహంతో అరాటపడే ఆ పిల్లవానికి ఆమె అనేక రహస్యాలను నేర్పింది: ఆనందాన్ని ఇవ్వకుండా ఆనందాన్ని పొందలేరు; ప్రతి శరీర భంగిమ, ప్రతి ముద్దుగింత, ప్రతి చూపు, శరీరంలోని ప్రతి చిన్న భాగానికి తనదైన రహస్యం ఉన్నది. దాన్ని అర్థం చేసుకొనగల్గినవారికి అది అత్యంత సుఖాన్నిస్తుంది.

"ప్రేమకార్యం ముగిసిన వెంటనే ప్రేమికులు ఒకరినొకరు మెచ్చుకొనకుండా, ఒకవైపున తాము గెలుస్తూ, అదేసమయంలో అవతలి వ్యక్తినీ గెలిపించకుండా, విడిపోకూడదు" అని కమల అతనికి నేర్పింది. అలా కలిసి గడిపితే ఒంటరితనపు (నిరాశ) కానీ, ఇక చాలు అనే (నిర్లక్ష్యం)గానీ తలెత్తదు; అవతలి వ్యక్తిని తన అవసరానికి వాడుకోవటం, లేదా తనను అవతలి వ్యక్తి వాడుకొనటం అన్న దుష్టభావనలు కలుగవు. అలా అతడు ఆ తెలివిగల, అందమైన వేశ్యతో అనేక గంటలకొలదీ సుఖాన్ని అనుభవించేవాడు; ఆమెకతను శిష్యుడు, ప్రియుడు, స్నేహితుడు అయినాడు. అతని ప్రస్తుత జీవిత పరమార్థం, దాని విలువ, కామస్వామి వ్యాపారంలో లేవు- అవి కమలతో ముడిపడి ఉన్నాయి.

ముఖ్యమైన పత్రాలు, నిర్దేశాలను వ్రాసే పనిని వ్యాపారి కామస్వామి సిద్ధార్థునికి అప్పగించాడు. ప్రధానమైన కార్యకలాపాలన్నిట్లోనూ అతనిని సంప్రతించటానికి అలవాటు పడ్డాడు. బియ్యం గురించిగాని, ఉన్ని గురించిగానీ, లేక వర్తకం గురించి, వాణిజ్యం గురించి గానీ సిద్ధార్థునికి పెద్దగా అర్థంకాలేదని అతనికి తెలిసిపోయింది. కానీ ప్రశాంతంగాను, స్థిరచిత్తం (ఈక్వానిమిటీ) తోటీ ఉండటంలో మాత్రం అతనికి ఒక అద్భుతశక్తి ఉన్నది; ఈ విషయంలోనే కాక, ఇతరులు చెప్పేదానిని వినే కళలోను, నూతన వ్యక్తులకు సదభిప్రాయం కల్గించటంలోను అతను వ్యాపారి కంటే కూడా అధికుడు. ఒక స్నేహితునితో వ్యాపారి చెప్పాడు-" ఈ బ్రాహ్మణుడు నిజం వ్యాపారి కాదు, ఎన్నటికీ కాలేడు; వ్యాపారంలో అతను ఎన్నడూ మునిగిపోవటం లేదు. కానీ మరి ఏ అదృష్ట నక్షత్రంలో జన్మించటం వల్లనో, మహిమ వల్లనో, లేక మరి అతనేమన్నా దాన్ని శ్రమణులవద్ద నేర్చుకున్నాడో గాని, విజయం తనంతట తానుగా అతన్ని వరించటం అనే రహస్యం మాత్రం ఉన్నది, అతని దగ్గర.

అతను వ్యాపారంలో ఎప్పుడూ ఆడుకుంటున్నట్లు ఉంటాడు, అది అతనిపైన అంతకంటే ఎక్కువ ముద్ర వేయటంలేదు, అది అతనిపై ఆధిపత్యం వహించటంలేదు, అతనికి ఎన్నడూ అపజయమంటే భయంలేదు, నష్టానికి అతను ఎప్పుడూ చింతించలేదు."

ఆ స్నేహితుడు సలహా ఇచ్చాడు అతనికి: " అతను నీకోసం నడిపే వ్యాపారపు లాభాల్లో మూడవ వంతు వాటా అతనికి ఇవ్వు. అయితే నష్టాల్లోకూడా మూడవ వంతు వాటా భరించవలసి ఉంటుందని అతనికి చెప్పు. అలా అతనికి వ్యాపారం పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి."

కామస్వామి ఈ సూచనను అమలు పరచాడు; కానీ సిద్ధార్థునికి ఈ సంగతి అసలు పట్టలేదు. ఒకవేళ తనకు లాభం వస్తే, ప్రశాంతంగా అతను దాన్ని స్వీకరించాడు. ఒకవేళ నష్టాలు ఎదురైతే, అతను బిగ్గరగా నవ్వి "ఓహో, సరే, ఈ లావాదేవీలు సరిగ్గా జరగలేదు" అనేసేవాడు.

నిజంగానే అతను వ్యాపారం పట్ల ఉదాసీనంగా వ్యవహరించేవాడు. ఒకసారి, పెద్దమొత్తంలో వరిపంటను కొనే నిమిత్తం అతనొక గ్రామానికి వెళ్లాడు. అతను అక్కడికి వెళ్లేసరికి అప్పటికే ఆ పంటంతా వేరే వ్యాపారికి అమ్మబడింది. అయినప్పటికీ సిద్ధార్థుడు ఆ గ్రామంలోనే చాలారోజులు ఉండిపోయాడు. రైతులతో కబుర్లు చెప్పాడు; పిల్లలకు డబ్బులిచ్చాడు, అక్కడే ఒక పెళ్లికి కూడా వెళ్లి, సంతృప్తిగా తిరిగి వచ్చాడు. వెంటనే తిరిగి రాకుండా సమయాన్ని, ధనాన్ని వృధా చేసినందుకు వ్యాపారి కామస్వామి అతన్ని గర్హించాడు. కానీ సిద్ధార్థుడిలా బదులిచ్చాడు: "తిట్టకు, నా ప్రియ మిత్రమా, తిట్టి ఏనాడూ ఎవ్వరూ దేన్నీ సాధించలేదు. దీనివల్ల ఒకవేళ ఏమన్నా నష్టం వచ్చినట్లైతే ఆ నష్టాన్ని నేను భరిస్తాను. ఈ ప్రయాణం వల్ల నాకు చాలా సంతృప్తి కలిగింది. చాలామందితో పరిచయం కల్గింది, నేనొక బ్రాహ్మణుడికి మిత్రుడినైనాను, పిల్లలు నా ఒడిలో కూర్చున్నారు, రైతులు నాకు తమ పొలాలను చూపించారు. ఎవ్వరూ నన్నొక వ్యాపారిగా చూడలేదు"

"అదంతా బాగానే ఉంది" అని అయిష్టంగానే ఒప్పుకున్నాడు కామస్వామి. "కానీ నిజానికి నువ్వొక వ్యాపారివి. లేకపోతే నువ్వేమైనా కేవలం సంతోషం (సుఖం, ప్లెజర్) కోసం వెళ్లావా, అక్కడికి?

"ఖచ్చితంగా నేను నా సంతోషం కోసం వెళ్లాను" నవ్వాడు సిద్ధార్థుడు- "ఎందుకు కాదు? నాకు ప్రజలతోటీ, కొత్త గ్రామీణ ప్రాంతాలతోటీ పరిచయం కలిగింది. వారి స్నేహం, వారి ఆప్యాయతలవల్ల నాకు సంతోషం కలిగింది. ఒకవేళ నేనేగనక కామస్వామిని అయిఉంటే, నేనిక సరుకును కొనలేనని తెలిసిన వెంటనే కోపగించుకొని వెనక్కి తిరిగి వచ్చేసేవాడిని, అలా సమయమూ, డబ్బూ పూర్తిగా వృధా అయిపోయి ఉండేవి. కానీ నేను చాలా రోజుల్ని సంతోషంగా గడిపాను, చాలా నేర్చుకున్నాను, చాలా సుఖం పొందాను, కోపగించుకొనిగాని, తొందరపాటుతో గాని నన్ను నేను కష్టపెట్టుకోలేదు, ఇతరులనూ గాయపరచలేదు. ఒకవేళ నేను మళ్ళీ అక్కడికి వెళ్తే, బహుశ: తరువాతి పంట కొనేందుకో, లేక మరే పనిమీదనైనా, ప్రజలు నన్ను స్నేహపూర్వకంగా సమాదరిస్తారు, నేను గతంలో తొందరపాటును, అయిష్టాన్ని ప్రదర్శించనందుకు నేను అప్పుడు సంతోషిస్తాను. అయినా, అదంతా వదిలెయ్యి, స్నేహితుడా, తిట్టి నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు. ఒకవేళ నీకు ఏనాడైనా ’ఈ సిద్ధార్థుడు నాకు చెడు చేస్తున్నాడు’ అని అనిపిస్తే, ఒక్క మాట అను, చాలు, సిద్ధార్థుడు తనదారిన తాను వెళ్ళిపోతాడు. ఆనాటివరకు, కనీసం, మనం మంచి స్నేహితులుగా ఉందాం." సిద్ధార్థుడు తన మోచేతి కింది నీళ్లు త్రాగి బ్రతుకుతున్నాడని అతన్ని ఒప్పించేందుకు వ్యాపారి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. సిద్ధార్థుడు తన నీళ్లు తను త్రాగుతున్నాడు. అంతేకాదు, తాము అందరమూ ఇతరుల నీళ్లు- అందరి నీళ్లనూ- త్రాగి బ్రతుకుతున్నాము. కామస్వామికి అనేక కష్టాలుండేవి, సిద్ధార్థుడికి అతని కష్టాలు ఏనాడూ పట్టలేదు. ఏదైనా లావాదేవీలో నష్టం రాబోతున్నా, పంపిన సరుకులు ఏవైనా గమ్యానికి చేరుకోకుండా తప్పిపోయినా, అప్పు తీసుకున్నవాడెవరైనా ఇక అప్పు తీర్చలేడనిపిస్తున్నాకూడా- అతనిని బాధతో కోపంగా తిట్టటం వల్ల, పళ్ళు బిగించి చూడటం వల్ల, సరిగా నిద్రపోక పోవటం వల్ల ఏదో ప్రయోజనం ఉంటుందని కామస్వామి తన సహచరుడిని ఏనాడూ ఒప్పించలేకపోయాడు. ఒకసారి కామస్వామి గుర్తుచేశాడు సిద్ధార్థునికి- "అన్ని విషయాలూ అతను తన వ్యాపారం నుండే నేర్చుకున్నాడు" అని. దానికి సిద్ధార్థుడు ఇలా బదులిచ్చాడు: "అంత హాస్యాలాడవద్దు. చేపల బుట్ట ఖరీదెంత చేస్తుంది, డబ్బుని అప్పు ఇచ్చినప్పుడు దానిపైన ఎంత వడ్డీ అడగచ్చు అనేవి నేను మీనుండి నేర్చుకున్నాను. అది మీ పరిజ్ఞానం. కానీ ప్రియమైన కామస్వామీ, ’ఎలా ఆలోచించాలి’ అన్నది మాత్రం నేను మీనుండి నేర్చుకోలేదు. దాన్ని మీరు నానుండి నేర్చుకుంటే బాగుంటుంది."

నిజంగానే అతని మనసు వ్యాపారంలో లేదు. కమలకోసం డబ్బు తెచ్చేందుకు అది సహాయపడుతున్నది, అందులోనూ అది అతనికి నిజంగా అవసరమైనదానికంటే ఎక్కువ ధనాన్ని ఇస్తున్నది. అంతేకాక సిద్ధార్థుని సానుభూతి, ఉత్సుకతలు కేవలం ప్రజలపై ఉంటున్నాయిప్పుడు: వారి పని, బాధలు, కష్టాలు, సుఖాలు, తప్పులు- ఇవన్నీ తనకు చంద్రునికంటే దూరంగా ఉన్నాయి. చంద్రుని గురించి తెలిసినంతకూడా ఇవి తనకు తెలీదు.

ఎవరితోనైనా మాట్లాడటం, ఎవరితోనైనా కలిసి జీవించటం, అందరినుండీ నేర్చుకోవటం- ఇవన్నీ తను సులభంగా చేయగలడని సిద్ధార్థుడు గుర్తించాడు; అయినప్పటికీ, తనను ఇతరులనుండి వేరు చేసేది కూడా ఒకటుందన్న వాస్తవాన్ని అతడు మరువడు- ఇలా తనను ప్రత్యేకంగా వేరు చేసేది- తను ఒకప్పుడు శ్రమణుడుగా ఉండటం. ప్రజలు పిల్లతనంతో, జంతువులమాదిరి జీవిస్తున్నారని అతను గమనించాడు- ఆ జీవితాన్ని అతను ఒకవైపున ప్రేమిస్తున్నాడు; వేరొక వైపున అసహ్యించుకుంటున్నాడు కూడాను. తనకు అంత విలువలేనివిగా తోచేవాటికోసం- డబ్బు, చిన్న చిన్న సుఖాలు, పనికిరాని గౌరవాలకోసం వారు చెమటలు కక్కేలా శ్రమించటం చూశాడు తను; దు:ఖంలో మునిగి తేలటం, అలాగే ముసలివాళ్లవ్వటం చూశాడు; ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు దెబ్బతీసుకోవటం చూశాడు; నిజానికి శమణులు నవ్విపోయే నొప్పులకు వాళ్లు కుమిలిపోవటం చూశాడు; శ్రమణులు అసలు పట్టించుకోని లేమికై వారు విపరీతంగా శోకించి దు:ఖపడటం చూశాడు.

జనాలు తన వద్దకు తెచ్చిన ప్రతిదాన్నీ అతడు స్వీకరించేవాడు. తనకు బట్టలు అమ్మేందుకు వచ్చిన వ్యాపారినీ స్వాగతించాడు; అప్పుకోరి వచ్చిన బాకీదారునూ స్వాగతించాడు; శ్రమణుడంత పేదవాడు ఎలాగూ కాకపోయినా, తన పేదరికపు బాధను ఒక గంటసేపు వివరిస్తూ ఉండిపోయే భిక్షగాడినీ ఆదరించాడు. ధనిక విదేశీ వర్తకులను, తనకు గడ్డం చేసే మంగలిని, తోపుడు బండ్లపై తనకు అరటిపండ్లను అమ్మి తనకు చిల్లర ఇవ్వకుండా మోసంచేసే వీధిబేరగాళ్లను అందరినీ సమానంగా చూశాడు. కామస్వామి అతని వద్దకు వచ్చి తన బాధలు చెప్పుకున్నా, లేకపోతే ఏదైనా వ్యవహారపరంగా సిద్ధార్థుడిని దుయ్యబట్టినా, అతను శ్రద్ధగా, కుతూహలంతో వినేవాడు, ఆశ్చర్యపోయేవాడు, అతన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేవాడు, అవసరమని తోచిన చోట్ల కొంచెంగా అతనిమాటల్ని మన్నించేవాడు, ఆపైన అతన్ని వదిలి తనకోసం వచ్చిన తరువాతి వ్యక్తివైపుకు మళ్లేవాడు. అతని వద్దకు అనేకమంది వచ్చేవారు- అతనితో వ్యాపారం చేసేందుకు కొందరు, అతన్ని మోసగించేందుకు కొందరు, అతను చెప్పేది వినేందుకు కొందరు, అతని సానుభూతిని సంపాదించేందుకు కొందరు, అతని సలహాలు వినేందుకు కొందరు- ఇట్లా చాలామంది ఎప్పుడూ వచ్చేవారు. అతను సలహాలు ఇచ్చేవాడు, సానుభూతి ప్రకటించేవాడు, బహుమతులిచ్చేవాడు, ఇతరులచేత ఇష్టంగా, కావాలని, కొంత మోసపోయేవాడు- ఇలా అతడు ఈ ఆటతో తన ఆలోచనల్ని నింపాడు. గతంలో తన ఆలోచనల్ని దేవతలతోటీ, పరబ్రహ్మ తోటీ నింపినంతగా ఇప్పుడు అతను ఈ ఆటతోటీ, మనుష్యులందరూ ఈ ఆటనాడుతూ పొందే ఉద్వేగాలతోటీ తన ఆలోచనల్ని నింపాడు.

ఒక్కొక్కసారి అతనికి తనలోని ఒక సున్నితమైన స్వరం, మృదువుగా వినబడేది- నిశ్శబ్దంగా అతనికి గుర్తుచేసేది, చాలా మెల్లగా అయిష్టాన్ని ప్రకటించేది. -ఎంత మెల్లగా అంటే, ఆ స్వరం అతనికి దాదాపు వినబడేదికాదు. అయితే అతను అకస్మాత్తుగా చూసేవాడు స్పష్టంగా- తను ఒక వింత జీవితం గడుపుతున్నాడని, కేవలం ఒక క్రీడ అయిన అనేక పనులు అనేకం తాను చేస్తున్నాడని, చాలా ఎక్కువ ఉత్సాహంగా ఉంటున్నాడని, కొన్నిసార్లు సుఖానుభూతి పొందుతున్నాడని, అయితే నిజ జీవితం మాత్రం అతన్ని అంటకుండా, అతని ప్రక్కగా ప్రవహిస్తున్నదని అతనికి తెలిసేది. తన బంతితో ఆటలాడే క్రీడాకారుని మాదిరి, అతడు తన వ్యాపారంతో ఆటలాడుతున్నాడు- తన చుట్టూతా ఉన్నవారితో ఆడుతున్నాడు, వారిని గమనించి, వారినుండి వినోదాన్ని పొందుతున్నాడు; కానీ తన హృదయం అక్కడ లేదు. -తన నిజతత్వంతో అతను అందులో లేడు- అతని స్వీయ ఆత్మ వేరే ఎక్కడో, సుదూరంగా, అదృశ్యంగా, అనంతంగా తిరుగాడుతున్నది- అతని ఈ జీవితంతో దానికి ఏమీ సంబంధం లేదు.

కొన్నిసార్లు అతనికి ఈ ఆలోచనలు భయం గొల్పేవి. ఈ విధంగా (తటస్థంగా) బయటినుండి చూసేవాని మాదిరి కాకుండా, తానుకూడా వారిలా రోజువారీ పిల్లచేష్ఠల్ని ఒక తీవ్రభావనతో, వాటిలో నిజంగా పాల్గొని చెయ్యాలనీ, వారి జీవితాల్ని ఆస్వాదిస్తూ జీవించాలనీ అతనికి అనిపించేది.

అందమైన కమలను అతడు క్రమం తప్పకుండా సందర్శించేవాడు, ఆమె నుండి ప్రేమకళ నేర్చుకున్నాడు. మిగిలిన అన్ని విద్యలలో కంటే ఇందులో ఇవ్వటం, తీసుకోవటం ఏకమైనాయి. అతను ఆమెతో మాట్లాడాడు, ఆమెనుండి నేర్చుకున్నాడు, ఆమెకు సలహాలిచ్చాడు, సలహాలు అందుకున్నాడు. గతంలో తనను గోవిందుడు అర్థం చేసుకున్నదానికంటే ఎక్కువగా ఆమె ఇప్పుడు తనను అర్థం చేసుకున్నది- ఆమె తనలాంటిదే.

ఒకసారి అతను ఆమెతో అన్నాదు- "నువ్వు నాలాంటిదానివి; నువ్వు ఇతరులు అందరికంటే భిన్నమైనదానివి. నువ్వు కమలవు మాత్రమే, మరేమీ కావు. నీలో అంతర్గతంగా ఒక నిశ్చలత ఉన్నది. నామాదిరే, నువ్వుకూడా ఏ సమయంలోనైనా అంతరంగంలోని ఆ ప్రశాంత నిశ్చలతలో ఆశ్రయం పొందగలవు. అందరికీ ఇలా చెయ్యగలిగే వీలున్నది, కానీ దానికి తగిన శక్తి సామర్థ్యాలు మాత్రం కొందరికే ఉన్నాయి.

"అందరూ అంత తెలివిమంతులు కారు" అన్నది కమల.

"దీనికి తెలివితేటలతో అసలు సంబంధమే లేదు కమలా! " అన్నాడు సిద్ధార్థుడు. "కామస్వామి తెలివిలో నాకేమీ తీసిపోడు. కానీ ఆతనికి అంతరంగంలో ఆశ్రయం లభించదు. తెలివితేటల్లో కేవలం పిల్లలు అనదగ్గవాళ్లకు ఈ ప్రశాంత నిశ్చలత ఉండవచ్చు. కమలా, అనేకమంది క్రిందికిరాలే పండుటాకు వంటివారు. ఆ ఆకు గాలిలో అటూ ఇటూ తేలుతుంది (డ్రిఫ్ట్స్), సుళ్లు తిరుగుతుంది (టర్న్స్), రెపరెపలాడుతుంది(ఫ్లట్టర్స్), నేలపై పడిపోతుంది. కానీ కొందరు వ్యక్తులు ఒక నిర్దిష్టమార్గంలో నడిచే నక్షత్రాలవంటివారు: వారిని ఏ గాలీ చేరదు. తమ మార్గమూ, తమ మార్గసూచికా (గైడ్) రెండింటినీ తమలోనే ఉంచుకొని ఉంటారు వాళ్ళు. ఇలాంటి జ్ఞానులు నాకు చాలామంది తెలుసు- అయితే వారందరిలోనూ ఒకరు ఈ విషయంలో పరిపూర్ణులు. ఆయనను నేను ఎన్నడూ మరవలేను. ఆయన స్వయంగా భగవానుడైన బుద్ధుడు! ఈ పరమ సత్యాన్ని బోధించే పరిపూర్ణ జ్ఞాని అతడే. వేలాదిమంది యువకులు ప్రతిరోజూ ఆయన బోధల్ని వింటారు, గంటగంటకూ ఆయన సూచనల్ని అనుసరిస్తారు- కానీ వాళ్లంతా రాలిపోయే ఆకులే; వారికి తమలో తమకుగా జ్ఞానం, మార్గ సూచికలు లేవు."

కమల అతనికేసి చూసి నవ్వింది- "నువ్వు మళ్లీ ఆయనగురించి మాట్లాడటం మొదలుపెట్టావు. మళ్లీ నీకు శ్రమణ ఆలోచనలు వస్తున్నాయి."

సిద్ధార్థుడు మాట్లాడలేదు. వాళ్లిద్దరూ ప్రేమగా క్రీడించారు- కమలకు తెలిసిన 30 లేదా 40 వేరువేరు విధానాలలో ఒకదానిని అనుసరించి వారు రతికేళి సల్పారు. ఆమెమేను చిరుతపులి మాదిరి, వేటగాని ధనువుమాదిరి వంగింది. ఆమెనుండి ప్రేమ రహస్యాలను నేర్చినవానికి అనేక సుఖాలు తెలుస్తాయి. ఆమె సిద్ధార్థునితో చాలాసేపు క్రీడించింది; అతనిని నిరోధించింది, అతనిని ముంచెత్తింది; అతనిని గెల్చుకొని వశం చేసుకొన్నది; తన ఆధిపత్యంలో పులకరించింది. చివరికి అతను పూర్తిగా వివశుడై, అలసిపోయి ఆమెప్రక్కన పడిపోయేంతవరకు ఆమె అతనితో క్రీడించింది.

ఆ వేశ్య అతనిపైకి వంగి అతని ముఖాన్ని, అలసిపోయిన అతని కళ్లను తదేకంగా చూసింది. "నాకు ఎదురైన ప్రియుళ్లలో అతిగొప్పవాడివి నువ్వే" అన్నదామె సాలోచనగా. "ఇతరులకంటే నీ శక్తి అధికం, నీ శరీరం బలిష్ఠం (సపుల్), నీ కోరికలో బలం ఎక్కువ(విల్లింగ్). నువ్వు నా కళను బాగా నేర్చుకున్నావు, సిద్ధార్థా! ఏదో ఒకనాడు, ఇంకొంత పెద్దదాన్నయ్యాక, నీనుండి నేనొక సంతానాన్ని పొందుతాను. అయినాకూడా, ఓ ప్రియుడా, నువ్వు ఇంకా శ్రమణుడిగానే ఉన్నావు. నన్ను నువ్వు నిజంగా ప్రేమించటం లేదు- నువ్వు అసలు ఎవ్వరినీ ప్రేమించవు- నిజం కదూ?" "అవునేమో, అన్నాడు సిద్ధార్థుడు అలసిపోయినట్లు. "నేను నీలాంటివాడిని. నువ్వూ ఎవరినీ నిజంగా ప్రేమించవు- లేకపోతే ప్రేమను ఒక కళగా నువ్వు ఎలా సాధన చెయ్యగలవు? బహుశ: మనలాంటి వ్యక్తులు ప్రేమించలేరు- సాధారణ ప్రజలు ఆ పని చేయగలరు- అదే వాళ్ల రహస్యం!"

changed March 1, 2008