"నేను ఈ నదితో ఉండిపోతాను" అనుకున్నాడు సిద్ధార్థుడు. "పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు నేను దాటింది ఈ నదినే. స్నేహశీలి అయిన పడవ సరంగొకడు నన్ను ఈనది దాటించాడు. నేనిప్పుడు అతని దగ్గరకు వెళ్తాను. ఒకప్పుడు నా మార్గం నన్ను అతని గుడిశ నుండి కొత్త జీవితం దిశగా అడుగులు వేయించింది. ఆ జీవితం ఇప్పుడు జీర్ణమై నశించింది. నా ప్రస్తుత మార్గాన్ని, నా నూత్న జీవితాన్ని అక్కడినుండే ప్రారంభిస్తాను."

ప్రవహిస్తున్న నీటిలోకి అతడు ఆప్యాయంగా చూశాడు. పారదర్శకంగా కనిపిస్తున్న ఆకుపచ్చ వర్ణంలోకి, స్ఫటికాల వరుసలను బోలిన దాని అద్భుత నిర్మాణంలోకి. నీలాకాశాన్ని ప్రతిఫలిస్తున్న అద్దంపై ఈదులాడే బుడగలు మెరిసే ముత్యాల మాదిరి దాని లోతుల్లో నుండి పైకి లేస్తున్నాయి. ఆ నది సహస్రాక్షియై వెయ్యికళ్లతో అతన్ని చూసింది- ఆకుపచ్చ, తెలుపు, స్ఫటికవర్ణం, అంబరపు నీల వర్ణం- ఈ నదిని ఎంతగా ఇష్టపడుతున్నాడో, అతను. ఎంత సమ్మోహింపజేస్తోందో, ఆ నది, ఇతన్ని. అతనికి ఆ నదిపట్ల ఎంత కృతజ్ఞతాభావం ఏర్పడిందో! అతని హృదయంలో కొత్తగా పురులువిప్పిన అంతర్వాణి పలికింది- "ఈ నదిని ప్రేమించు, దానితో ఉండు, దానినుండి నేర్చుకో" - అవును. తను దానినుండి నేర్చుకోవాలనుకుంటున్నాడు, తను అది చెప్పేదాన్ని వినాలి-" ఈ నదిని, దాని రహస్యాలను అర్థం చేసుకున్న వారెవరికైనా ఇంకెన్నో, ఎన్నో రహస్యాలు- అన్ని రహస్యాలూ అర్థమౌతాయి" అని అతనికి అనిపించింది.

కానీ ఈ రోజున అతను నది రహస్యాలలో ఒక్కదాన్ని మాత్రమే చూడగల్గాడు. తన ఆత్మను ఆకర్షించింది, కట్టి పడేసిందది. ఈ నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి, ప్రవహిస్తూనే ఉన్నాయి, కానీ నీళ్లు అక్కడ ఎప్పుడూ ఉన్నాయి: నీళ్లు ఎప్పుడూ అవే; కానీ ప్రతిక్షణమూ అవి కొత్తవి. ఎవరు ఊహించగలరు దీన్ని, ఎవరికి అర్థమౌతుందిది? అతనిలో కేవలం అనుమానపు ఛాయలు పొడసూపిన భావన కల్గింది, మరుగున పడిపోయిన ఏదో జ్ఞాపకం- దివ్య వాక్కులు. సిద్ధార్థుడు లేచాడు. ఆకలిబాధ దుర్భరమౌతున్నది. బాధను భరిస్తూనే అతడు నది ఒడ్డున తిరిగాడు; నీటి కెరటాల సవ్వడిని విన్నాడు; తన శరీరాన్ని నమిలేస్తున్న ఆకలిని విన్నాడు. అతను బల్లకట్టును చేరుకునేసరికి, పడవ అప్పటికే ఉన్నదక్కడ. యౌవనంలో ఉన్న శ్రమణుడిని పడవ లో నది దాటించిన సరంగే ఇప్పుడూ పడవలో నిలబడి ఉన్నాడు. సిద్ధార్థుడు మళ్లీ అతన్ని గుర్తుపట్టాడు- అతడు కూడా బాగా ముసలివాడయ్యాడిప్పుడు. "అవతలి ఒడ్దుకు తీసుకు వెళ్తావా, నన్ను?" అడిగాడు సిద్ధార్థుడు. పుర ప్రముఖుని మాదిరి దర్పంగా కనిపిస్తున్న వ్యక్తి ఒంటరిగా, నడచుకొని రావటం చూసిన సరంగు ఆశ్చర్యపోతూనే, అతన్ని తన తెప్ప మీదికి ఎక్కించుకొని బయలుదేరాడు.
"నువ్వు ఎంచుకున్న జీవితం అద్భుతంగా ఉంది" అన్నాడు సిద్ధార్థుడు. " ఈ నది ప్రక్కనే జీవిస్తూ, దీనిలో రోజూ తేలియాడటం చాలా బాగుంటుంది కదూ?" "బాగుంటుంది, అయ్యగారూ, మీరన్నట్లు. కానీ అన్ని జీవితాలు, అన్ని పనులు కూడా బాగానే ఉండవా, మరి?" "బహుశ: ఉండొచ్చు. కానీ నీ జీవితం నాకు అసూయ కల్గిస్తోంది." "ఓహ్ఁ మీకు ఇది త్వరలో మొహం మొత్తుతుంది. విలువైన వస్త్రాలు ధరించినవాళ్లు చేసే పనికాదు, ఇది" సిద్ధార్థుడు నవ్వాడు. " నా ఈ బట్టల కారణంగా ఇవాళ్ల ఇప్పటికీ ఒకసారి బేరీజు వేయబడ్డాను; ఇప్పటికే ఒకసారి సందేహాస్పదుడిని అయ్యాను. ఈ బట్టలు నాకు పెద్ద పీడ అయ్యాయి- నువ్వు వీటిని స్వీకరించరాదూ? ఎందుకంటే, నేను ముందుగానే చెప్పాలి, నన్ను అవతలి ఒడ్దుకు చేర్చినందుకు నీకిచ్చేందుకు నా దగ్గర ఏమీ డబ్బు లేదు. "అయ్యగారు పరిహాసాలాడు తున్నారు" అన్నాడు సరంగు నవ్వుతూ. "పరిహాసం కాదు, మిత్రమా! నువ్వొకసారి నన్ను ఉచితంగా ఈ నది దాటించావు. అందువల్ల ఇంకోసారి కూడా అదేపని చేయి; బదులుగా నా బట్టలు తీసేసుకో" "మరి అయ్యగారు బట్టలు లేకుండానే ముందుకు సాగుతారా?" "నాకైతే ముందుకు ఎక్కడికీ వెళ్లాలని లేదు. నువ్వు నాకు పాత బట్టలేమైనా ఇచ్చి, ఇక్కడే నీ సహాయకుడిగా- నిజానికి నీ శిక్షణలోని పనివాడిగా- ఏమంటే నేను ఇంకా పడవను నడపటం ఎలాగో నేర్చుకోవాలి- అలా పనివాడిగా ఉండనిస్తే చాలా సంతోషిస్తాను" పడవ సరంగు ఆ అపరిచితుడిని శ్రద్ధగా చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. "నేను నిన్ను గుర్తు పట్టాను" అన్నాడతను చివరికి. "నువ్వొకసారి నా గుడిశలో పడుకున్నావు. చాలా కాలమైంది, బహుశ: ఇరవై సంవత్సరాలకు పైమాటే అనుకుంటాను. నేను నిన్ను నది దాటించాను, మనం మంచి స్నేహితులుగా విడిపోయాం. నువ్వొక శ్రమణుడివి, కదూ? నాకు నీ పేరు గుర్తుకు రావటం లేదు." "నా పేరు సిద్ధార్థుడు. నువ్వు నన్ను గతంలో చూసినప్పుడు నేను శ్రమణుడిగా ఉన్నాను." "నీకు స్వాగతం, సిద్ధార్థా. నాపేరు వాసుదేవుడు. నువ్వు ఈ రాత్రికి నా అతిథిగా ఉండగలవని, నా గుడిశలో పడుకుంటావని ఆశిస్తున్నాను. అలాగే నువ్వెక్కడినుండి వస్తున్నదీ, నీవు ధరించిన ఈ వస్త్రాలపట్ల నీకు అంత విముఖత ఎందుకు కలిగిందీ చెప్పవచ్చు నాకు" వాళ్లు అప్పటికి నది మధ్యకు చేరుకున్నారు. ప్రవాహం ఉంది గనక వాసుదేవుడు ఇంకా బలంగా తెడ్లు వేశాడు. పడవ కొనను చూస్తూ అతను ప్రశాంతంగా పడవ నడుపుతున్నాడు, బలమైన తన చేతులతో. సిద్ధార్థుడు అతన్ని గమనిస్తూ, తనకు ఒకప్పుడు, తను శ్రమణుడిగా ఉన్నరోజుల్లో అతని పట్ల కలిగిన ఆదరాన్ని, అభిమానాన్ని గుర్తు చేసుకున్నాడు. వాసుదేవుని ఆహ్వానానికి అతడు సంతోషంగా అంగీకరించాడు. వాళ్లు నది అవతలి తీరం చేరుకున్న తరువాత పడవను తీరానికి కట్టివేయటంలో సిద్ధార్థుడు కూడా సాయం చేశాడు. తరువాత వాసుదేవుడు అతనిని తన గుడిశలోనికి తీసుకొనిపోయి రొట్టె, నీళ్లు ఇవ్వగా, సిద్ధార్థుడు వాటిని సంతోషంగా స్వీకరించాడు. ఆపైన వాసుదేవుడిచ్చిన మామిడిపండునుకూడా తృప్తిగా తిన్నాడు. ఆ తరువాత, సూర్యాస్తమయం అవుతుండగా, వాళ్లిద్దరూ నది ప్రక్కగా ఓ చెట్టును ఆనుకొని కూర్చొని ఉన్నప్పుడు, సిద్ధార్థుడు తన పుట్టుక గురించి, తన జీవితం గురించి మాట్లాడాడు; నిస్పృహ తొలగిపోయిన తరువాత తను ఎలా ఉన్నదీ వివరించాడు. రాత్రి చాలా ప్రొద్దుపోయేవరకు ఆ కథ కొనసాగింది. వాసుదేవుడు చాలా శ్రద్ధగా విన్నాడు, అతని పుట్టుక, బాల్యం గురించీ, అతని చదువులు, అన్వేషణ, అతని సుఖాలు, అవసరాలు- అన్నిటిని గురించీ విన్నాడు. ఆ పడవ సరంగుకున్న అద్భుత శక్తుల్లో ఒకటి ఏమంటే, అతనికి వినటం ఎలాగో తెలుసు. ప్రపంచంలో చాలా కొద్ది మందికే ఉంటుందా శక్తి. ఒక్క మాటకూడా పలకకుండానే, వాసుదేవుడు నిశ్శబ్దంగా, ఆసక్తితో ప్రతి పదాన్నీ వింటున్నాడని, స్వీకరిస్తున్నాడనీ సిద్ధార్థుడికి తెలుస్తూ ఉండింది: అతనినుండి ఒక్క మాటకూడా తప్పి పోవటం లేదు. అతను అసహనంగా వేరే దేనికోసమో ఎదురుచూడటమూలేదు; మెచ్చుకోలేదు, తిట్టలేదు- కేవలం విన్నాడు, అంతే. "అటువంటి శ్రోత లభించటం ఎంత అద్భుతం" అనిపించింది సిద్ధార్థునికి- అతను తన జీవితంలో లీనమయ్యాడు, తన కృషిలో, తన దు:ఖాల్లో ఇమిడిపోగల్గాడు. అయితే తన కథ చివరలో, తను నది ప్రక్కన కూర్చొనటం, ప్రగాఢమైన తన నిస్పృహ, పవిత్ర ఓంకారం, గాఢ నిద్ర, ఆ నిద్ర తరువాత తనకు నది పట్ల కలిగిన అనిర్వచనీయమైన ప్రేమల గురించి సిద్ధార్థుడు చెప్తున్నప్పుడు ఆ పడవ సరంగు కనులుమూసుకొని, అందులో సంపూర్ణంగా లీనమై, మరింత శ్రద్ధగా విన్నాడు. సిద్ధార్థుడు తను చెప్పేది ముగించిన తరువాత ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆ తరువాత, వాసుదేవుడన్నాడు- ’నేను అనుకున్నట్లే జరిగింది: నది నీతో మాట్లాడింది. అది నీతో కూడా స్నేహపూర్వకంగా ఉంది. నీతో అది మాట్లాడుతోంది. ఇది చాలా మంచి సంగతి. చాలా మంచిది. నాతో ఉండు, సిద్ధార్థా, నా మిత్రమా! నాకు గతంలో ఒక భార్య ఉండేది. కానీ ఆమె చాలా కాలం క్రితమే మరణించింది. అప్పటినుండీ నేను ఒంటరిగానే నివసిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు. ఇక్కడ మనిద్దరికీ సరిపడ తిండీ, నీడా ఉన్నాయి." "చాలా సంతోషం, ధన్యవాదాలు" అన్నాడు సిద్ధార్థుడు. "హృదయపూర్వకంగా ధన్యవాదాలర్పిస్తూ నా అంగీకారం తెలియజేస్తున్నాను. వాసుదేవా, నీకు ఇంకొక విషయంలో కూడా ధన్యవాదాలు అర్పించాలి- అంత చక్కగా విన్నందుకు. వినటం ఎలాగో తెలిసిన వారు అరుదు. నేను ఇప్పటివరకు నీమాదిరి వినగలిగే వ్యక్తిని చూడలేదు. ఈ విద్యనుకూడా నేను నీనుండి నేర్చుకుంటాను." "నువ్వు నేర్చుకుంటావు" అన్నాడు వాసుదేవుడు. "కానీ నానుండి కాదు. నాకు ఈ విద్యను ఈ నదే నేర్పించింది. నువ్వుకూడా దానినుండే నేర్చుకుంటావు. నదికి అన్నీ తెలుసు. మనం దానినుండి అన్నీ నేర్చుకోవచ్చు. కృషి చేయకుండా ఉండేందుకోసం ప్రయత్నించటం మంచిదని, మునగటం, లోతులను అందుకోవటానికి ప్రయత్నించటం మంచిదని ఇప్పటికే ఈ నది నీకు నేర్పించింది. ధనికుడు, ప్రముఖుడు అయిన సిద్ధార్థుడు ఇకపైన నావికుడౌతాడు. పండితుడు, బ్రాహ్మణుడు అయిన సిద్ధార్థుడు పడవ సరంగౌతాడు. నువ్వు దీన్నికూడా నది నుండి నేర్చుకున్నావు. అంతేకాక, ఇంకో సంగతి కూడా నువ్వు నేర్చుకుంటావు-" చాలా సేపు నిశ్శబ్దంగా గడిచింది. తరువాత సిద్ధార్థుడు అన్నాడు- "ఏ సంగతి, వాసుదేవా?" వాసుదేవుడు లేచి నిలబడ్డాడు- "చాలా చీకటిపడింది" అన్నాడు. "మనం ఇక పడుకుందాం. ఆ సంగతి ఏంటో నేను నీకు చెప్పలేను, మిత్రమా. నువ్వే తెలుసుకుంటావు- బహుశ: నీకు ఇప్పటికే తెలుసేమో కూడాను. నేను పండితుడిని కాదు; నాకు మాట్లాడటం, ఆలోచించటం ఎలాగో తెలీదు. కేవలం వినటం, శ్రద్ధాళువుగా ఉండటం మాత్రం తెలుసు- లేకపోతే మరి నేనేమీ నేర్చుకోనట్లే అవుతుంది. ఒకవేళ నాకు మాట్లాడటం, బోధించటం వచ్చిఉంటే, నేను గురువునై ఉండేవాడిని- కానీ నేను కేవలం ఒక పడవ సరంగును; నాపని కేవలం ప్రజలను నది దాటించటం మాత్రమే. నేను ఇప్పటికే అనేక వేలమందిని ఈ నది దాటించాను సిద్ధార్థా; కానీ వారందరికీ ఈ నది కేవలం ఒక అడ్డంకిగా ఉండింది. వారి ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకం ఈ నది. వాళ్లు డబ్బుకోసం, వ్యాపారంకోసం, పెళ్లిళ్లకోసం, తీర్థయాత్రలకోసం ప్రయాణించేవాళ్లు; ఈ నది వాళ్ల దారికి అడ్డం వచ్చేది; అప్పుడు ఈ పడవసరంగు ఉండేవాడు- వాళ్లను త్వరగా దాటించేందుకు, దరి చేర్చేందుకు. కానీ ఈ వేలాది మందిలో కొందరు మాత్రమే ఉన్నారు- ఏ నలుగురో, ఐదుగురో- వారికి మాత్రం ఈ నది ఆటంకం కాదు. వాళ్లు దాని స్వరం విన్నారు; నదిని విన్నారు, ఆ నది నాకు పవిత్రం అయిన విధంగా వారికి కూడా పవిత్రమైంది. మనం ఇక పడుకుందాం, సిద్ధార్థా!" సిద్ధార్థుడు ఆ పడవ నడిపే సరంగుతో ఉండిపోయాడు. పడవను సంరక్షించటం ఎలాగో నేర్చుకున్నాడు; బల్లకట్టు దగ్గర పనేమీ లేనప్పుడు వాసుదేవునితోబాటు వరిపొలంలో పనిచేశాడు; కట్టెపుల్లలు ఏరుకొచ్చాడు; అరటి పండ్లను కోశాడు; తెడ్లు తయారు చేయటం ఎలాగో నేర్చుకున్నాడు. పడవలో మార్పులు చేయటం నేర్చుకున్నాడు; బుట్టలు అల్లటం నేర్చుకున్నాడు. తను చేస్తున్న ప్రతి పనిలోను, నేర్చుకుంటున్న ప్రతి విషయంలోను అతనికి సంతోషం కనబడేది; అలా రోజులు, నెలలు గడిచిపోయాయి. వాసుదేవుడు నేర్పించగలిగిన విషయాలకంటే సిద్ధార్థుడు నదినుండి ఎక్కువ సంగతులు నేర్చుకున్నాడు. దానినుండి అతను నిరంతరం నేర్చుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా, అతను వినటం నేర్చుకున్నాడు, నదినుండి. హృదయాన్ని నిశ్శబ్దంగా చేసుకొని వినటం- ఎలాంటి ఉద్వేగంగానీ, ఎలాంటి కోరికగాని లేకుండా, ఎలాంటి ద్వంద్వం గానీ, ఎలాంటి అభిప్రాయంగానీ లేకుండా స్వచ్ఛంగా, తెరచిన హృదయంతో, ఎదురుచూసే ఆత్మతో వినటం నేర్చుకున్నాడు. అతను వాసుదేవునితో కలిసి సంతోషంగా జీవించాడు. ఒక్కొక్కసారి వాళ్లు మాట్లాడుకునేవారు- కొన్ని పదాలు మాత్రమే, చాలా ఆలోచించి శ్రద్ధగా, మనస్ఫూర్తిగా పలికే మాటలు. వాసుదేవుడు ఎక్కువ మాట్లాడే మనిషి కాదు. అతన్ని మాట్లాడేలా చేయటంలో సిద్ధార్థునికి ఎప్పుడోగాని విజయం లభించేదికాదు. అతనొకసారి వాసుదేవుడిని అడిగాడు- "నువ్వు నదినుండి ఈ రహస్యం తెలుసుకున్నావా?- కాలం అనేది అసలు లేదని?" గొప్ప చిరునవ్వొకటి వాసుదేవుని ముఖంనిండా పరచుకున్నది. "అవును సిద్ధార్థా!" అన్నాడతను. "ఇదేనా, నువ్వనేది?- నది ఒకే సమయంలో అన్ని చోట్లా ఉన్నది- జన్మ స్థలంవద్ద, ముఖద్వారం వద్దా, జలపాతం వద్దా, బల్లకట్టు దగ్గరా, ప్రవాహంవద్దా, సముద్రంలోను, పర్వతాలలోనూ- ప్రతిచోటా; దానికి ఉండేది కేవలం వర్తమానమే, గతపు నీడకాదు; భవిష్యత్తు నీడా కాదు- ఇదేనా నువ్వంటున్నది?" "అవును!" అన్నాడు సిద్ధార్థుడు. "నాకా సంగతి అర్థమైన తరువాత నా జీవితాన్ని దర్శించాను- అదికూడా ఒక నదే- పిల్ల సిద్ధార్థుడు, పరిణతి చెందిన సిద్ధార్థుడు, ముసలివాడైన సిద్ధార్థుడు- అందరూ కేవలం ఛాయా మాత్రంగా వేరుగా ఉన్నాఋ, వాస్తవంగా కాదు. సిద్ధార్థుని ముందు జన్మలు కూడా గతంలో లేవు, అతని మృత్యువు, అతను భస్మమైపోవటం అనేవి భవిష్యత్తులో లేవు. ఏదీ గతంలో లేదు, ఏదీ భవిష్యత్తులో లేదు. ప్రతిదానికీ వాస్తవికత ఉన్నది, ప్రతిదానికీ అస్తిత్వం ఉన్నది."

సిద్ధార్థుడు చాలా ఆనందంగా మాట్లాడాడు- ఈ ఆవిష్కరణ అతనికి చాలా సంతోషాన్ని కలిగించింది. "దు:ఖం అంతా, మరి, కాలంలో లేదూ? ఆత్మ తిరస్కారం, భయం అన్నీ కాలంలోనే కదా, ఉన్నాయి? ఎవరైనా కాలాన్ని జయిస్తే, అలా కాలాన్ని దూరం చేసుకోగల్గిన వెంటనే ప్రపంచంలోని అన్ని కష్టాలు, మొత్తం చెడు జయించబడతాయి కదా?"- అతను చాలా ఉత్సాహంగా మాట్లాడాడు, కానీ వాసుదేవుడు చల్లని చిరునవ్వొకటి చిందిచి, అవునన్నట్లు తల ఊపాడు. ఆ పైన అతను సిద్ధార్థుని భుజం నిమిరి, తన పనిలోకి దిగాడు. ఒకసారి వర్షాకాలంలో నదికి వరదలొచ్చి పెద్దగా గర్జిస్తున్నప్పుడు, సిద్ధార్థుడన్నాడు-" నదికి చాలా గొంతులున్నాయి, నిజమే కదూ, మిత్రమా?- రాజు గొంతు, యోధుని గొంతు, ఎద్దు స్వరం, రాత్రిపూట అరిచే పిట్ట గొంతు, గర్భిణి స్వరం, నిట్టూర్చే మానవుని స్వరం, ఇంకా వేలాది ఇతర గొంతుకలు? "అవును" అన్నాడు వాసుదేవుడు. "జీవించే ప్రతి ప్రాణి గొంతుకా నదిగొంతుకలో ఉన్నది." "నీకు తెలుసా, మరి?" అడిగాడు సిద్ధార్థుడు- "ఎవరైనా దానిలోని పదివేల గొంతుకలనూ ఒకేసారి వినగలిగితే అది ఎలా వినిపిస్తుందో నీకు తెలుసా?" వాసుదేవుడు సంతోషంగా నవ్వాడు- సిద్ధార్థునివైపు వంగి అతని చెవిలో "ఓం" అని పలికాడు. సిద్ధార్థుడు విన్నదీ ఆ స్వరాన్నే. కాలం గడిచినకొద్దీ అతని నవ్వు పడవ సరంగు నవ్వులా కనబడసాగింది- దాదాపు దానంత ప్రకాశవంతంగా, దాదాపు దాని మాదిరే పూర్తి సంతోషంతో నిండి, దాదాపు దానిమాదిరే వెయ్యి ముడతలుగా విరిసే ప్రకాశం, దానంత బాల్యచేష్ఠలా, దానంత ముసలి నవ్వులా. చాలా మంది యాత్రీకులు వాళ్లిద్దర్నీ కలిసి చూసి, వాళ్లు అన్నాదమ్ములనుకునేవారు. తరచు వాళ్లు నది ప్రక్కన చెట్టుకాండం మీద కూర్చొనేవారు. నిశ్శబ్దంగా నీటిని వినేవారు- అది వారికి కేవలం నీరు కాదు- జీవితపు వాణి, అస్తిత్వపు వాణి; నిరంతరం అవుతూ ఉండటపు (బికమింగ్) వాణి. ఒక్కోసారి, నదిని వింటూ కూర్చున్నప్పుడు, ఇద్దరిలోనూ ఒకే ఆలోచనలు నడిచేవి- బహుశ: నిన్నటిరోజున మాట్లాడుకున్న సంగతులు కావచ్చు, లేదా వారిద్దరి మనసుల్లో ఉన్న యాత్రికులెవరో ఒకరి విధి, పరిస్థితులకు సంబంధించిన ఆలోచనలు కావచ్చు, లేదా మృత్యువు, లేదా వారి బాల్యం- ఇంకా నది ఎప్పుడైనా వాళ్లకు ఏదైనా మంచి సంగతి చెప్పినప్పుడు వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకునేవారు- ఇద్దరూ ఒకే ఆలోచనతో, ఒకే ప్రశ్నకు ఇద్దరూ పొందిన ఒకే సమాధానం పట్ల హర్షంతో. ఆ బల్లకట్టునుండి, ఇద్దరు సరంగులనుండీ ఏదో (దివ్య శక్తి) వెలువడేది- చాలామంది యాత్రికులకు అలా అనిపించేది. ఒక్కోసారి, వీళ్లిద్దరి ముఖాలనూ చూసిన యాత్రికులు కొందరు, తమ జీవితాలను గురించి, కష్టాలను గురించి మాట్లాడటం మొదలు పెట్టేవారు, తమ తప్పిదాలను ఒప్పుకునేవారు, వారి సలహాలను అడిగి, వారినుండి సాంత్వన కోరేవారు. ఒక్కోసారి ఎవరో వాళ్లతోపాటు ఒక రాత్రిని వారి గుడిశలో నదిని వినేందుకు అనుమతి కోరేవారు. ఒక్కోసారి, ఎవరో చెప్పారని, "ఇద్దరు జ్ఞానులు, మాంత్రికులు, లేదా ఋషులు బల్లకట్టు దగ్గర ఉంటారు" చూడాలని ఔత్సాహికులు కొందరు ఊడిపడేవారు. ఇలాంటి ఔత్సాహికులు అనేక ప్రశ్నలు వేసేవాళ్లు, కానీ వాళ్లకు జవాబులు దొరికేవికావు- వాళ్లకు అక్కడ మాంత్రికులూ కనబడేవారు కారు, జ్ఞానులూ కనబడేవారు కారు. వాళ్లకక్కడ కేవలం ఇద్దరు ముసలివాళ్లు, స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, బహుశ: కొంచెం మూగగా, కొంచెం వింతగా, మందబుద్ధులుగా ఉన్నవాళ్లు- కనబడేవారు. అలాంటి ఔత్సాహికులు నవ్వేవాళ్లు; ఇలా అద్భుతమైన పుకార్లను లేవనెత్తే మూర్ఖులు, అమాయకులు అయిన ప్రజల్ని తలచుకొని వాళ్లు నవ్వేవాళ్లు.

సంవత్సరాలు గడిచాయి; వాటిని ఎవరూ లెక్కించలేదు. అప్పుడు ఒకనాడు గౌతమ బుద్ధుని అనుయాయులు అయిన కొందరు భిక్షువులు వచ్చారు ఆ దారిన, నది దాటించమంటూ. వీలైనంత త్వరగా వాళ్ళు మహోన్నతుడైన ఆ బోధకుని వద్దకు చేరుకునేందుకై వెనక్కి వెళ్తున్నారని వాళ్ల మాటలవల్ల సరంగులకు ఇద్దరికీ తెలిసింది- బుద్ధభగవానుని ఆరోగ్యం క్షీణించింది, ఆయన త్వరలో తన దైహిక జీవితాన్ని ముగించి నిర్యాణమొందనున్నాడు. త్వరలోనే ఇంకొందరు భిక్షువులు, ఆపైన మరికొందరు- ఇక భిక్షువులే కాక, ఇతర ప్రయాణీకులందరూ కూడా గౌతముని గురించి, త్వరలో రానున్న ఆయన మృతిని గురించే మాట్లాడటం మొదలు పెట్టారు. సైనికుల కవాతును చూసేందుకో, రాజుగారి పట్టాభిషేకాన్ని తిలకించేందుకో అన్ని దిక్కులనుండీ చేరుకున్నట్లు, ప్రజలు, తేనెటీగల దండుల్లాగా, సూదంటురాయిచే ఆకర్షింపబడ్డ ఇనుప ముక్కల్లాగా, బుద్ధుడు తన మృత్యుశయ్యపై పడుకొని ఉన్న చోటుకు, యుగపురుషుడొకరు అనంతంలోకి ప్రవేశించనున్న అద్భుత సంఘటన జరగనున్న ఆ ప్రదేశానికి- బారులు కట్టారు. ఈ సమయంలో సిద్ధార్థుడు అనేక వేలమందిని కదిలించిన ఆ మహాత్ముని గురించి, త్వరలో మరణించనున్న ఆ బుద్ధమూర్తిని గురించి చాలా ఆలోచించాడు. ఆయన గొంతును తను విన్నాడు, ఒకనాడు. ఆయన పావన మూర్తిమతను తనుకూడా అబ్బురపడుతూ దర్శించాడొకనాడు. అతడు ఆయనను ఆప్యాయంగా తలచుకున్నాడు. ఆయన విముక్తిమార్గాన్ని తలచుకొని, యువకుడిగా తాను భగవానునితో పలికిన మాటల్ని చిరునవ్వుతో గుర్తుచేసుకున్నాడు. తను మాట్లాడిన ఆ మాటలు చాలా అహంకారపూరితంగాను, వయసుకు మించిన మాటలుగాను అనిపించాయిప్పుడు. ఆయన బోధనలను తాను అంగీకరించకపోయినప్పటికీ, తాను గౌతమునినుండి వేరుకాదని సిద్ధర్థునికి చాలాకాలం నుండే తెలిసివచ్చింది- లేదు, నిజమైన అన్వేషకుడు అన్నవాడు ఏ బోధనలనూ అంగీకరించలేడు- దేన్నైనా నిజంగాకనుగొనాలనుకుంటే అతను ఏ బోధననూ విశ్వసించడు- కానీ అలా కనుగొన్నవాడు మాత్రం అన్ని మార్గాలను, అన్ని గమ్యాలను అంగీకరించగల్గుతాడు- అతనిని అనంతత్వంలో జీవించే వేలాదిమంది ఇతరులనుండి, పరమాత్మస్వరూపులైన ఇతరులనుండి వేరుచేసేదేదీ ఉండదు.
ఒకరోజున, మరణించనున్న బుద్ధుని సందర్శించేనిమిత్తం ప్రజలందరూ యాత్రలు చేపట్టుతున్న ఆ సమయంలో, ఒకనాటి అతి సుందర వేశ్యాంగన అయిన కమల కూడా బుద్ధ దర్శనానికై బయలుదేరింది. ఆమె తన గతజీవితాన్ని వదిలివేసి ఎన్నో సంవత్సరాలు గతించింది. బుద్ధుని బోధలను శరణుజొచ్చి, ఆమె తన వనాన్ని గౌతముని భిక్షువులకు బహూకరించింది, యాత్రికులలో మహిళలు, హితకాఋల సమూహంలో చేరిపోయిందామె. గౌతముని మరణం సమీపంలోనే ఉందన్న వార్తను విని, ఆమె కాలినడకన, సాధారణవస్త్రాలు ధరించి, తన కుమారునితోబాటు బయలుదేరింది. మార్గంలో వారు నదిని చేరారు, కానీ ఆ పిల్లవాడు అప్పటికే అలసిపోయాడు. అతనికి ఇంటికి వెళ్ళాలని ఉంది, విశ్రాంతి తీసుకోవాలని ఉంది, ఏదైనా తినాలని ఉంది. తరచు అతను రుసరుసలాడుతూ, ఏడుస్తూ, గింజుకుంటూ ఉన్నాడు. కమల తరచు ఆ పిల్లవాడితో పెనుగులాడాల్సి వస్తున్నది. అతను ఆమెను ఎదిరించటానికి అలవాటుపడి ఉన్నాడు- ఆమె అతనికి భోజనం పెట్టేది, బుజ్జగించేది, తిట్టేది. కానీ అతనికి తన తల్లి ఇంత శ్రమతో కూడుకున్న, దు:ఖభరితమైన ఈ ప్రయాణాన్ని ఎందుకు చేయాలో అసలు అర్థం కాలేదు. "తెలీని ప్రదేశానికి, పవిత్రుడైన ఎవరో వింతమనిషిని- అందునా చావనున్నవాడిని- చూసేందుకు ఇంత కష్టపడటం ఎందుకు? అతనిని చావనియ్యి- నాకేం పోతుంది?" బాల సిద్ధార్థుడు తనకు విశ్రాంతి కావాలని చెప్పే సమయానికి తల్లీ కొడుకులిద్దరూ వాసుదేవుని బల్లకట్టుకు దగ్గర్లోనే ఉన్నారు. కమలకూడా స్వయంగా బాగా అలసిపోయి ఉన్నదేమో, కొడుకు ఒక అరటిపండు తినేటప్పుడు, ఆమె నేలమీద కళ్లు సగం మూసుకొని విశ్రాంతిగా కూర్చున్నది. అకస్మాత్తుగా ఆమె బాధతో గట్టిగా అరచింది- పిల్లవాడు ఉలిక్కిపడి తల్లికేసి చూసే సరికే ఆమె ముఖం భయంతో పాలిపోయి ఉన్నది. ఆమె బట్టల మడతల్లోంచి, ఆమెను కాటువేసిన నల్లని త్రాచుపామొకటి జరజరా అవతలికి పాకిపోయింది.

ఎవరైనా మనుషుల్ని చేరుకునేందుకై వారిద్దరూ గబగబా పరుగెత్తారు. వాళ్ళు బల్లకట్టును చేరుకునేసరికి కమల కూలిపోయింది- ఇక ముందుకు అడుగు వేయలేకపోయింది. పిల్లవాడు ఆమెను కౌగిలించుకొని, ముద్దాడుతూ సహాయంకోసం అరవటం మొదలుపెట్టాడు. ఆమెకూడా తనగొంతును జతచేసే సరికి, ఆ అరుపులు బల్లకట్టు వద్దనున్న వాసుదేవుని చెవులబడ్డాయి. అతనుత్వరగా వచ్చిచూసి, ఆ స్త్రీని తన చేతుల్లో ఎత్తుకొని తన పడవ వద్దకు తీసుకొని వచ్చాడు. పిల్లవాడు వెంటరాగా వారిరువురూ త్వరలో నదిని దాటి గుడిశను చేరుకున్నారు. ఆ సమయానికి సిద్ధార్థుడు నిలబడి పొయ్యి వెలిగిస్తున్నాడు. అతను కనులెత్తి మొదట పిల్లవానిని చూశాడు. ఆ ముఖంలో చూసినప్పుడు అతనిలో ఏవో విచిత్రమైన జ్ఞాపకాలు కదలాడాయి. అపుడతను కమలను చూశాడు. ఆమె పడవ సరంగు చేతుల్లో అచేతనంగా పడిఉన్నప్పటికీ వెంటనే ఆమెను గుర్తించాడు. ఆ క్షణంలోనే తనలో జ్ఞాపకాలు రేకెత్తించిన ఆ ముఖం తన కొడుకుదేనని అతనికి అర్థమైంది. అతని హృదయం వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది.

కమల గాయాన్ని కడిగారు, కానీ ఆ భాగం అప్పటికే నల్లబారి ఉన్నది; ఆమె శరీరం అంతటా వాపు మొదలైంది. ఔషధాలను వాడి ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకొనిరాగల్గారు వాళ్లు- ఆమె సిద్ధార్థుని గుడిశలో అతని పక్కమీద పడుకొని ఉన్నది. ఒకప్పుడు ఆమెను అమితంగా ప్రేమించిన వ్యక్తి- సిద్ధార్థుడు- ఆమె మీదికి వంగి ఉన్నాడు. తను కలగంటున్నాననుకున్నదామె. నవ్వుతూ సంతోషంగా తన ప్రియుని ముఖంలోకి చూసింది. క్రమంగా తన పరిస్థితి తనకు గుర్తురాగానే, పాముకాటు మాట గుర్తుకు రాగానే ఆమె కళ్ళు కంగారుగా కొడుకుకోసం వెతికాయి. "కంగారు పడకు" అన్నాడు సిద్ధార్థుడు. "వీడు ఇక్కడే ఉన్నాడు." కమల అతని కళ్లలోకి చూసింది. శరీరంలోని విషం తనను మాట్లాడనివ్వట్లేదు. "నువ్వు పెద్దవాడివయ్యావు, మిత్రమా" అన్నదామె. "నువ్వు ముసలివాడివయ్యావు, కానీ ఒకప్పుడు నా తోటలోకి బట్టలులేకుండా, మట్టిగొట్టుకున్న కాళ్లతో వచ్చిన యువశ్రమణుడిలాగే ఉన్నావిప్పుడు. నన్ను, కామస్వామిని వదిలి వచ్చినప్పటికంటే ఎక్కువ శ్రమణుడివయ్యావు ఈనాడు. నీ కళ్లు అతని కళ్లలాగే ఉన్నాయి సిద్ధార్థా! అహ్ఁ నేను కూడా ముసలిదాన్నయ్యాను. నువ్వు నన్ను గుర్తుపట్టావా?" సిద్ధార్థుడు చిరునవ్వు నవ్వాడు. "నిన్ను చూడగానే గుర్తు పట్టాను కమలా" అన్నాడు. కమల తన కొడుకుకేసి చూపించి అన్నది- "వీడిని గుర్తు పట్టావా, నీ కొడుకు." ఆమె కనుగుడ్లు తేలిపోయి, కళ్లు మూతలు పడ్డాయి. పిల్లవాడు ఏడవటం మొదలుపెట్టాడు. సిద్ధార్థుడు వాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఏడవనిచ్చాడు. వాడి జుట్టునునిమిరాడు, ప్రేమగా. ఆ పిల్లవాని ముఖాన్ని చూస్తుండగా అతనికి బ్రాహ్మణుల ప్రార్థన ఒకటి గుర్తుకు వచ్చింది. తను పిల్లవాడుగా ఉన్నప్పుడు నేర్చుకున్నాడు దాన్ని. మెల్లగా, పాటపాడుతున్నట్లు, అతడు దాన్ని ఉచ్చరించటం మొదలుపెట్టాడు. తన గతంలోంచీ, బాల్యంలోంచీ పదాలు లేచి వచ్చాయి. అతని పాటను వింటూ పిల్లవాడు ఏడుపు ఆపాడు, కొంచెంసేపు ఎక్కిళ్లు పెట్టుకొని, నిద్రలోకి జారాడు. సిద్ధార్థుడు అతనిని వాసుదేవుని ప్రక్కమీద పడుకోబెట్టాడు- వాసుదేవుడు పొయ్యిదగ్గర అన్నం వండుతున్నాడు. సిద్ధార్థుడు అతనికేసి చూశాడు, అతను చిరునవ్వు నవ్వాడు. "ఆమె చనిపోతున్నది" అన్నాడు సిద్ధార్థుడు మెల్లగా. వాసుదేవుడు తలఊపాడు. దయతో నిండిన అతని ముఖంలో పొయ్యిలోని మంట ప్రతిఫలిస్తోంది. కమల మళ్ళీ స్పృహలోకి వచ్చింది. ఆమె ముఖంలో బాధ. సిద్ధార్థునికి ఆమె నోటిలోను, పాలిపోయిన ఆమె ముఖంలోను బాధ కానవచ్చింది. అతను నిశ్శబ్దంగా, మెలకువతో, ఎదురుచూపుతో, ఆమె బాధను పంచుకుంటూ గమనించాడు. కమలకు ఇది తెలిసింది. ఆమె చూపులు అతని చూపుల్ని కలిసాయి.

అతనిని చూస్తూ ఆమె అన్నది- "నీ కళ్లు కూడా మారిపోయాయి, ఇప్పుడు. అవి చాలా వేరేగా కనిపిస్తున్నాయి. నువ్వు సిద్ధార్థుడివేనని నేను ఎలా గుర్తు పట్టగలనిక? ఒక ప్రక్కన నువ్వు సిద్ధార్థునివే, కానీ మరోవైపున నువ్వు సిద్ధార్థునిలాగా లేవు." సిద్ధార్థుడు మాట్లాడలేదు. నిశ్శబ్దంగా ఆమె కనులలోకి చూశాడు. "నువ్వు సాధించావా, దాన్ని?" అడిగిందామె. "నీకు శాంతి లభించిందా?" అతను చిరునవ్వుతో తన చేతిని ఆమె చేతిపై వేశాడు. "అవును" అన్నదామె. "నాకు కనిపిస్తోంది. నేనుకూడా శాంతిని సాధిస్తాను." "నీకు అది లభించింది." మెల్లగా అన్నాడు సిద్ధార్థుడు. కమల అతనివైపే చూసింది స్థిరంగా. ఆమె గౌతముడిని చూసే ఉద్దేశంతో బయలుదేరింది. ఆ భగవానుని ప్రశాంత వదనాన్ని దర్శించేందుకు, దానిలోంది కొంత శాంతిని తనూ పొందేందుకు బయలుదేరింది. కానీ ఆమెకు సిద్ధార్థుడే లభించాడు- బాగుంది ఇది. తను ఆ వ్యక్తిని చూసినట్లే ఉంది. ఆమె అతనికి ఈ విషయం చెప్పాలనుకున్నది. కానీ ఆమె నాలుక సహకరించలేదు. నిశ్శబ్దంగా ఆమె అతనికేసి చూసింది. ఆమె కళ్లల్లో జీవం తగ్గిపోవటం అతను గమనించాడు. అంతిమ బాధ ఆమెను నింపి, ఆమె కనులనుండి ప్రసరించిన తరువాత, ఆమె శరీరం చివరిసారి వణికి నిశ్చలమైపోయిన తరువాత అతని చేతులు ఆమె కళ్లను మూసివేశాయి.

చనిపోయిన కమల ముఖాన్నే చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు సిద్ధార్థుడు. చాలాసేపు ఆమె నోటిని చూస్తూండిపోయాడు- ముసలిదైపోయి, అలసిపోయిన నోరు; వాడి, ముడతలు పడి, కుంచించుకుపోయిన పెదిమలు- తన యౌవనపు వసంతంలో, తను ఆమె పెదవులను అప్పుడే కోసిన అత్తిపండ్లతో పోల్చిన సంగతిని గుర్తుచేసుకున్నాడతను. చాలాసేపటివరకు అతను ఆమె పాలిపోయిన ముఖాన్నే చూస్తూ కూర్చున్నాడు- ఆమె ముఖంలోని అలసటను, వార్థక్యపు ముడతలను. ఆ ముఖంలో అతనికి తన ముఖం కనిపించింది- అలాగే తెల్లగా పాలిపోయి, అలాగే చనిపోయి; అదే సమయంలో అతనికి తమ ఇద్దరి ముఖాలూ కనిపించాయి- యౌవనంలో, ఎర్రని పెదవులతో, కోరిక నిండిన కళ్లతో- వర్తమానపు సమకాలీన అస్తిత్వ భావన ఒకటి ఉప్పెనలాగా అతన్ని ముంచెత్తింది.

ఈ సమయంలో అతను ప్రాణం అవినాశి, ప్రతిక్షణం అనంతం అని స్పష్టంగా అనుభూతిచెందాడు.

అతను లేచి నిలబడేసరికి వాసుదేవుడు అన్నం వండి ఉన్నాడు, కానీ సిద్ధార్థుడు తినలేదు. గొర్రెను కట్టివేసిన చావడిలో గడ్డిని పరచుకొని వృద్ధులిద్దరూ పక్కలు సిద్ధం చేసుకున్నాదు. వాసుదేవుడు పడుకున్నాడు; కానీ సిద్ధార్థుడులేచి, రాత్రంతా గుడిశముందు కూర్చొని, నదిని వింటూ, అదే సమయంలో గతంలో మునిగి, అదే సమయంలో తన జీవితపు విభిన్న దశలన్నింటితోటీ ఆవరించబడి, ఉండిపోయాడు. మధ్య మధ్యలో అతను లేచి గుడిశ తలుపు దగ్గరకు వెళ్లి నిలబడి పిల్లవాడు లేచిన అలికిడి ఏమైనా ఉన్నదేమో గమనిస్తూ ఉన్నాడు.

తెల్లవారుతుండగా, ఇంకా సూర్యోదయమవ్వకుండానే వాసుదేవుడు చావడినుండి వచ్చాడు స్నేహితుని దగ్గరకు- "నువ్వు పడుకోలేదు" అన్నాడు.

"లేదు, వాసుదేవా, నేను ఇక్కడే కూర్చొని నదిని వింటూ ఉండిపోయాను. అది నాకు చాలా సంగతులు చెప్పింది. నన్ను చాలా గొప్ప ఆలోచనలతో నింపింది- ఏకత్వపు ఆలోచనలు" "నువ్వు దు:ఖపడ్డావు, సిద్ధార్థా!" అన్నాడు వాసుదేవుడు. "కానీ దు:ఖం నీ హృదయంలోకి రాలేదు." "లేదు, స్నేహితుడా. నేనెందుకు దు:ఖించాలి? ఇప్పటికే ధనికుడుగా, సంతోషంగా ఉన్న నేను, ఇంకా ధనికుడినయ్యాను; ఇంకా ఎక్కువ సంతోషం కల్గింది. నాకొడుకు నాకు దొరికాడు." "నేనుకూడా నీ కొడుకుకు స్వాగతమిస్తున్నాను. కానీ, ప్రస్తుతం, సిద్ధార్థా, మనం పనికి బయలుదేరాలి. చేయవలసిన పని చాలా ఉన్నది. నా భార్య మరణించిన పక్కమీదే కమలకూడా మృతిచెందింది. నేను ఒకనాడు నా భార్య చితిని నిర్మించిన కొండమీదనే ఇప్పుడు మనం కమల చితిని నిర్మిద్దాం." పిల్లవాడు ఇంకా నిద్రపోతుండగానే, వాళ్లిద్దరూ చితిని ఏర్పాటు చేశారు.

(తొమ్మిదవ అధ్యాయం: పడవ సరంగు ముగిసింది)

changed April 19, 2008