గౌతముడు

శ్రావస్తీ నగరంలో ప్రతి పిల్లవాడికీ బుద్ధభగవానుని పేరు తెలుసు, నిశ్శబ్దంగా భిక్షనర్ధించే బుద్ధుని శిష్యుల భిక్షాపాత్రల్ని నింపేందుకు నగరంలోని ప్రతి ఇల్లూ సిద్ధంగా ఉండేది. నగరానికి దగ్గరలోనే గౌతమునికి ఇష్టమైన విహారం- 'జేతవనం' ఉండేది. దానిని బుద్ధునికి, బుద్ధుని అనుయాయులకు బుద్ధ భగవానుని అనన్య భక్తుడు, ధనిక వర్తకుడు అయిన అనాధపిండకుడు బహుమతిగా ఇచ్చాడు.

గౌతముని విహారాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్న యువసన్యాసులిద్దరూ, ప్రాచుర్యంలో ఉన్న వివిధ గాధల అధారంగాను, తమ ప్రశ్నలకు ఇతరులిచ్చే సమాధానాల ద్వారాను ప్రయాణించి, చివరికి ఈ నగరం చేరుకున్నారు. శ్రావస్తికి చేరుకోగానే, వాళ్లు భిక్షకోసం మొదట ఏ ఇంటి తలుపుకు ఎదురుగానైతే నిశ్శబ్దంగా నిలబడ్డారో, ఆ ఇంటివారే తక్షణం వారికి భోజనం పెట్టారు. భిక్షనందుకున్న తరువాత సిద్ధార్థుడు తమకు భోజనం పెట్టిన స్త్రీని ప్రశ్నించాడు:

"ఓ తల్లీ, మేం ఇద్దరమూ అరణ్యాలనుండి వచ్చిన శ్రమణులము. మహానుభావుడైన బుద్ధ భగవానుడిని చూసి, ఆయన నోటిగుండా స్వయంగా ఆయన ఉపదేశాలు వినాలని వస్తున్నాము. ఆ బుద్ధభగవానుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలనుకుంటున్నాము."

ఆమె అన్నది: "అరణ్యం నుండి వచ్చిన ఓ శ్రమణులారా! మీరు సరైన స్థలానికే వచ్చారు. భగవానుడు ప్రస్తుతం అనాధపిండకుని తోట- 'జేతవనం'లో బసచేసి ఉన్నారు. యాత్రికులారా! మీరు ఇవాళ్ల రాత్రికి అక్కడే విడిది చేయవచ్చు, ఆయన నోటిద్వారా ఆయన బోధనలు వినేందుకు నలుమూలలనుండి వచ్చిన యాత్రికులు అనేకమంది విడిది చేసేందుకు తగిన వసతి ఉన్నదక్కడ."

గోవిందుడు పరమానందంతో ఇలా అన్నాడు: "ఆహా, అంటే మేము మా గమ్యాన్ని చేరుకున్నామన్నమాట! మా యాత్ర ముగియనున్నది. కానీ ఓ తల్లీ! నీకు బుద్ధుడు తెలుసునా? నువు స్వయంగా నీ కళ్లతో ఆ మహానుభావుడిని దర్శించావా?"

ఆమె చెప్పింది: "నేను భగవానుడిని అనేక పర్యాయాలు చూశాను. వీధులవెంట, నిశ్శబ్దంగా, పసుపుపచ్చ అంగవస్త్రాన్ని ధరించి నడుస్తుండగా చూశాను; ఇళ్లముందు తన భిక్షాపాత్రను చాపి నిశ్శబ్దంగా నిల్చొని, నిండిన పాత్రతో తిరిగివచ్చేటప్పుడూ దర్శించాను."

గోవిందుడు ముగ్ధుడై విన్నాడు. ఇంకా చాలా ప్రశ్నలు వేయాలనీ, ఆ స్తీ బుద్ధునిగురించి చెప్పే సంగతులు మరిన్ని వినాలనీ అనుకున్నాడు. కానీ తాము వెళ్లవలసిన సమయమైందని సిద్ధార్థుడు అతనికి గుర్తు చేశాడు. వాళ్లిద్దరూ ఆమెకు ధన్యవాదాలు చెప్పి, ముందుకు సాగారు. ఇకపై ఎవరినీ మార్గం అడగవలసిన అవసరమే లేకుండింది- గౌతముని అనుయాయులైన అనేకమంది యాత్రికులు, సన్యాసులు జేతవనం దిశగా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. వారిరువురూ చీకటిపడి అక్కడికి చేరుకునే సమయానికి ఇంకా అనేకమంది కొత్తగా వస్తూనే ఉన్నారు.

అలా వచ్చినవారంతా వసతికై అభ్యర్థించటమూ, ఆశ్రయం పొందటమూ జరుగుతున్నది. సందడిగా, కోలాహలంగా ఉన్న ఆ వాతావరణంలో, అరణ్య జీవితానికి అలవాటుపడిన ఇద్దరు శ్రమణులు త్వరగా, నిశ్శబ్దంగా ఒకచోటు చూసుకొని, తెల్లవారేవరకు అక్కడ విశ్రమించారు.

సూర్యోదయమయ్యేసరికి అక్కడికి చేరిన జన సందోహాన్ని చూసి శ్రమణులు ఇద్దరూ అబ్బురపడ్డారు. లెక్కలేనంతమంది శ్రద్ధాళువులు, కుతూహలం కొద్దీ వచ్చినవారు తమతోబాటు ఆనాటి రాత్రి అక్కడ విశ్రమించి ఉన్నారు. అద్భుతమైన ఆ వనపు కాలిబాటలన్నిట్లోనూ పసుపుపచ్చ వస్త్రాలు ధరించిన సన్యాసులు తిరుగాడుతున్నారు. ఒక్కొక్కచోట వాళ్లు చెట్లకింద కూర్చొని ఉన్నారు- ధ్యానమగ్నులయ్యో, లేకపోతే ఉత్సాహంగా ఏదో మాట్లాడుతూనో. దట్టమైన చెట్లతో కూడిన ఆ తోట మొత్తం తేనెటీగలతో నిండిన పట్టణం మాదిరి శోభిల్లుతున్నది. చాలామంది సన్యాసులు అప్పటికే తమ భిక్షాపాత్రలు చేతబూని, మధ్యాహ్నభోజన నిమిత్తం భిక్షను అర్థించేందుకు బయలుదేరి వెళ్ళారు- వారంతా రోజూ ఏకభుక్తం చేస్తారు- స్వయంగా బుద్ధుడుకూడా ప్రతిరోజూ ఉదయం భిక్షాటన చేస్తాడు.

అన్ని వేలమందిలోనూ, ఎవరో దేవుడు వేలెత్తి చూపించినట్లు, సిద్ధార్థుడు బుద్ధుడిని చూసిన వెంటనే గుర్తు పట్టాడు. చేతిలో భిక్షాపాత్రను పట్టుకొని, నిశ్శబ్దంగా జేతవనం నుండి ఒంటరిగా బయటికి పోతున్న ఆ వినమ్రమూర్తి, పసుపుపచ్చ అంగవస్త్రాన్ని ధరించి ఉన్నాడు.

"చూడు" అన్నాడు సిద్ధార్థుడు మెల్లగా-"అదుగో బుద్ధుడు! చూడు, అక్కడ వెళ్తున్నాడు’" పసుపుపచ్చ వస్త్రాన్ని ధరించిన ఆ సన్యాసిపైపు ఉత్సాహంగా చూశాడు గోవిందుడు. అటువైపున ఉన్న వందలాదిమంది ఇతర సన్యాసులకు, ఈయనకు ఏమీ భేదం లేదు- అయినా గోవిందుడు వెంటనే ఆయనను గుర్తుపట్టాడు- "అవును. ఆయనే." ఇక వాళ్లిద్దరూ ఆయనను అనుసరించారు, ఆయననే గమనిస్తూ.

బుద్ధుడు నిశ్శబ్దంగా తనదారిన తను వెళ్తున్నాడు, ఏదో ఆలోచనలో ఉన్నట్లు. ప్రశాంతతను వెలువరిస్తున్న ఆయన హావభావాలు సంతోషాన్నిగాని, దు:ఖాన్నిగానీ వ్యక్తం చేయటం లేదు. ఆయన అంతరంగంలో చిరునవ్వు ఉన్నట్లు తోస్తోంది. చక్కని నవ్వు- పిల్లవాడి నవ్వు మాదిరి తనలో ఇమిడిన చిరునవ్వుతో, ఆయన ప్రశాంతంగా, నిశ్శబ్దంగా నడుస్తున్నాడు. అంగవస్త్రం ధరించి, ఆయన ఖచ్చితంగా ఇతర సన్యాసుల మాదిరే నడుస్తున్నాడు- కానీ ఆయన ముఖంలోని ప్రసన్నత, ఆయన నడకతీరు, క్రిందికి వాలిన- ప్రశాంతమైన ఆయన చూపు, క్రిందికి వాలి వ్రేలాడుతున్న చేతి కదలికలలోని ప్రశాంతత- ఆయన చేతి ఒక్కొక్క వేలు కూడా శాంతిని, పరిపూర్ణత్వాన్ని చాటుతున్నది: దేన్నీ కోరటంలేదు, దేనినీ అనుకరించటం లేదు, నిరంతర నిశ్శబ్దాన్ని, మాయని కాంతిని, అవిచలమైన ప్రశాంతతను ప్రతిఫలిస్తున్నది.

అలా గౌతముడు భిక్షకోసం నగరంలోకి బయలుదేరుతుండగా శ్రమణులిద్దరూ ఆయనను గుర్తు పట్టారు- కేవలం ఆయన నడవడిలోని ప్రశాంతత ఆధారంగా, ఆయన రూపంలో వ్యక్తమయ్యే అవిచలత ఆధారంగా- ఆ నిశ్చలతలో తృష్ణలేదు, సంకల్పం లేదు, ద్వంద్వం లేదు, ప్రయత్నం లేదు- కేవలం కాంతి, కేవలం శాంతి.

"ఇవాళ్ల మనం ఆయన బోధలు వింటాం, స్వయంగా ఆయన నోటినుండి!" అన్నాడు గోవిందుడు.

సిద్ధార్థుడు మారు పలకలేదు. ఆయన బోధనలు వినాలనే ఆరాటం లేదు అతనికి. అవి తనకు తెలీని క్రొత్త సంగతులేవో తెలియజేస్తాయని అతనికి అనిపించటంలేదు. తను, గోవిందుడు కూడాను, బుద్ధుని బోధనల సారాంశాన్ని ఇంతకు ముందే విని ఉన్నారు- బుద్ధుని నుండి స్వయంగా కాకపోయినా, ఆయన నుండి విన్నవాళ్లు, వాళ్ల నుండి విన్నవాళ్లు- అలా ఎవరో చెప్పగా విని తెలుసుకున్నవే కావచ్చు అవి; కానీ వాటి సారాంశం తమకు ఇప్పటికే తెలుసు. అతను శ్రద్ధగా చూశాడు- గౌతముని తలను, ఆయన భుజాలను, పాదాలను, నిశ్చలంగా క్రిందికి వాలి ఉన్న ఆయన చేతిని. ఆయన చేతి వ్రేళ్లలోని ప్రతి కణుపులోనూ విజ్ఞానం తొణికిసలాడుతున్నట్లు అతనికి తోచింది. అవన్నీ వాస్తవాన్ని పలుకుతున్నాయి, వాస్తవాన్ని శ్వాసిస్తున్నాయి, వాస్తవాన్నే ప్రసరిస్తున్నాయి. ఈ వ్యక్తి, ఈ బుద్ధుడు, నిజంగా ఆమూలాగ్రం పరిశుద్ధుడైనాడు. ఇంతవరకూ ఏనాడూ, ఏవ్యక్తి పట్లా సిద్ధార్థునికి ఇంత గౌరవభావం కలగలేదు.

వాళ్లిద్దరూ బుద్ధుడిని అనుసరిస్తూ నగరంలోకి వెళ్లి తిరిగి వచ్చారు. ఆరోజుకు తాముగా ఉపవాసం ఉండాలనుకున్నారు. ఆ తరువాత గౌతముడు వెనక్కి రావటం చూశారు, ఆయన తన శిష్యులమధ్య కూర్చొని తను తెచ్చుకున్నదానిని తినటం గమనించారు- కేవలం ఒక పిట్టతినేంత ఆహారం మాత్రం స్వీకరించాడాయన- ఆపైన ఆయన ఒక మామిడి చెట్టు నీడలోకి వెళ్లిపోవటం గమనించారు.

అయితే ఆరోజు సాయంత్రం, ఎండవేడి ఉపశమించిన తరువాత, జేతవనంలోని వారంతా మెలకువతో, కలసి కూర్చున్న తరువాత, వారు బుద్ధుని ప్రవచనాన్ని విన్నారు. ఆయన గొంతు విన్నారు! ఆ స్వరంలో కూడా సంపూర్ణత్వం, అంతర్లీనంగా నిశ్శబ్దం. ఆయన స్వరంలో నిండుగా శాంతి ఉన్నది. గౌతముడు దు:ఖం గురించి మాట్లాడాడు. దు:ఖపు మూలాన్ని గురించి, దు:ఖనివారణ మార్గం గురించి మాట్లాడాడు. జీవితం బాధ. ప్రపంచం దు:ఖమయం. కానీ దు:ఖాన్ని నివారించటానికి మార్గం కనుగొనబడింది. బుద్ధుని మార్గంలో ప్రయాణించిన వారికి ముక్తి లభిస్తుంది.

బుద్ధభగవానుని స్వరం మృదువుగాను, అదే సమయంలో దృఢంగాను ఉన్నది. ఆయన నాలుగు సత్యాలనూ బోధించాడు. అష్టాంగ మార్గాన్ని నేర్పించాడు. ఎంతో ఓపికతో ఆయన తన ప్రవచనాన్ని ఉదాహరణలద్వారాను, చెప్పిన అంశాలను తిరిగి నొక్కి చెప్పటం ద్వారాను కొనసాగించాడు. ఆకాశంలో కాంతి మాదిరి, నక్షత్రం మాదిరి, ఆయన స్వరంకూడా స్పష్టంగా, నిశ్చలంగా శ్రోతలను చేరింది.

బుద్ధుడు తన ప్రవచనాన్ని ముగించే సరికి- అప్పటికే చీకటి పడింది- యాత్రికులు అనేకమంది ముందుకు వచ్చి, తమను కూడా బుద్ధుని శిష్యవర్గంలో చేరనివ్వమని అభ్యర్ధించారు. బుద్ధుడు వారి అభ్యర్థనను అంగీకరిస్తూ "మీరు ప్రవచనాలను శ్రద్ధగా విన్నారు- ఇక మమ్మల్ని చేరండి, నిర్వాణాన్ని అనుభూతి చెందండి, దు:ఖాన్ని అంతం చేసుకోండి." అన్నాడు.

మామూలుగా సిగ్గరి అయిన గోవిందుడు కూడా అడుగుముందుకు వేసి "నేనుకూడా బుద్ధభగవానుని పట్ల, ఆయన బోధనలపట్ల విశ్వాసం ప్రకటిస్తున్నాను." అన్నాడు. అతనుకూడా భగవానుని శిష్య బృందంలో చేరేందుకు తన ఇష్టాన్ని ప్రకటించాడు, వారిలో ఒకడుగా చేర్చుకోబడ్డాడు.

బుద్ధుడు ఆ రాత్రి విశ్రమించేందుకు వెళ్లిపోయిన వెంటనే గోవిందుడు సిద్ధార్థునివైపుకు తిరిగి ఆతృతగా ప్రశ్నించాడు- : "సిద్ధార్థా, నిన్ను తప్పుపట్టటం నా ఉద్దేశం కాదు. మనం ఇద్దరం బుద్ధ భగవానుడిని విన్నాం, మనం ఇద్దరం ఆయన బోధనలను విన్నాం. ఆ బోధనలను విని గోవిందుడు వాటిని అంగీకరించాడు- కానీ, నువ్వు- ప్రియమిత్రుడా, నువ్వుకూడా ముక్తిమార్గంలోకి ప్రవేశించరాదా? నువ్వు ఇంకా ఆలసిస్తావా? నువ్వు ఇంకా ఆలస్యం చేస్తావా?"

గోవిందుని మాటలు విన్న సిద్ధార్థుడు ఒక్కసారిగా నిద్రనుండి మేలుకున్నట్లు ఉలిక్కిపడ్డాడు. గోవిందుని ముఖంలోకి చాలాసేపటివరకు చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత అతను మృదువుగా మాట్లాడాడు, అతని గొంతులో ఎగతాళి లేదు-" అతడన్నాడు- గోవిందా, నా స్నేహితుడా, నువ్వు అడుగు ముందుకువేసావు, నీ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు. నువ్వు ఎప్పుడూ నా స్నేహితుడిగానే ఉన్నావు, గోవిందా, కానీ ఎప్పుడూ నాకంటే ఒక అడుగు వెనకే ఉన్నావు. నేను తరచు అనుకునేవాడిని- 'నేను లేకుండా, తన సొంత విశ్వాసంతో అసలు గోవిందుడు ఒక్క అడుగైనా వేస్తాడా', అని. ఇప్పటికి నువ్వు పెద్దవాడివయ్యావు- నీ మార్గాన్ని నువ్వు స్వయంగా ఎంచుకున్నావు. ఆ మార్గంలో నువ్వు తుదివరకూ వెళ్లెదవుగాక! నీకు నిర్వాణం లభించుగాక!"

గోవిందునికి సిద్ధార్థుని మాటలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందువల్ల అతడు తన ప్రశ్ననే మళ్లీ ఇంకోసారి వేశాడు, అసహనంగా- " చెప్పు, నా ప్రియ స్నేహితుడా! నువ్వుకూడా బుద్ధుని పట్ల విశ్వాసం ప్రకటించకుండా ఉండలేనని చెప్పు! "

"నువ్వు నా ఆకాంక్షను విన్నావు, గోవిందా. నేను మళ్లీ ఇంకోసారి చెప్తాను- నువ్వు ఈ మార్గంలో తుదివరకూ వెళ్ళెదవుగాక! నీకు నిర్వాణం లభించుగాక!"

ఆ క్షణంలో తన స్నేహితుడిక తనను వదిలి పెట్టనున్నాడని గోవిందునికి అర్థమైంది. అతడు ఏడవటం మొదలుపెట్టాడు.

"సిద్ధార్థా!" అని అతను ఏడ్చాడు.

సిద్ధార్థుడు అతనితో ప్రేమగా మాట్లాడాడు- " మరువకు, గోవిందా! నువ్విప్పుడు బుద్ధుని శిష్యులలో ఒకడివి. నువ్వు ఇంటిని, తల్లిదండ్రులను త్యజించావు, నువ్వు వంశాన్నీ ఆస్తినీ సన్యసించావు, నువ్వు నీ సొంత సంకల్పాన్నే త్యజించావు, నువ్వు నీ స్నేహాన్నీ త్యజించావు. బోధనలు నేర్పేది అదే. భగవానుని సంకల్పం అదే. నువ్వు స్వయంగా కోరుకున్నదీ అదే. రేపు, గోవిందా, నేను నిన్ను వదిలి వెళ్తాను."

చాలాసేపటివరకు స్నేహితులిరువురూ అరణ్యంలో సంచరించారు. చాలాసేపు పడుకునేందుకు ప్రయత్నించారు- కానీ ఇద్దరికీ నిద్ర రాలేదు. గోవిందుడు తన స్నేహితుడిని మళ్లీ మళ్లీ నొక్కి నొక్కి ప్రశ్నించాడు- "నువ్వు బుద్ధుని బోధనలను ఎందుకు అనుసరించవు, వాటిలో నీకు ఏమి లోపం కనిపించింది?" అని. ప్రతిసారీ సిద్ధార్థుడు అతన్ని తోసిపుచ్చాడు- "శాంతించు, గోవిందా. భగవానుని బోధనలు చాలా బాగున్నాయి. నేను వాటిలో లోపాన్ని ఎలా ఎంచగలను?" అని.

మరునాడు తెల్లవారుతుండగా బుద్ధుని అనుచరులలో ఒకడైన, ఎవరో వృద్ధ సన్యాసి ఒకడు, తోటలో అంతా తిరిగి, భగవానుని బోధన పట్ల విశ్వాసం ప్రకటించిన కొత్తవారిని అందరినీ తన వద్దకు పిలిచాడు- వారికి పసుపుపచ్చని దీక్షా వస్త్రాలను ఇచ్చి, సంఘం యొక్క నియమాలను, ప్రాధమిక బోధనలను వారికి అవగతం చేసేందుకు. గోవిందుడు అప్పుడు బలవంతంగా లేచి, తన చిన్ననాటి మిత్రుడిని మరొకసారి కౌగిలించుకొని, ఆ వస్త్రాలను ధరించాడు.

సిద్ధార్థుడు ఆలోచనల లోతుల్లో మునిగి, ఆ వనంలో కలయ తిరిగాడు.

అలా తిరుగుతుండగా, అక్కడ అతనికి బుద్ధభగవానుడు ఎదురైనాడు. సిద్ధార్థుడు ఆయనకు అభివాదనం చేశాడు. బుద్ధుని తీరులో ప్రశాంతత, మంచితనం ఉట్టిపడుతున్నాయి. యువకుడు ధైర్యాన్ని కూడగట్టుకొని, భగవానునితో మాట్లాడేందుకు అనుమతిని కోరాడు. భగవానుడు సమ్మతిని తెలియజేస్తూ తలపంకించాడు.

సిద్ధార్థుడన్నాడు- " ఓ భగవానుడా! నిన్న రాత్రి అధ్భుతమైన నీ ప్రవచనాన్ని వినే భాగ్యం కలిగింది. నేను సుదూరం నుండి నా స్నేహితునితో కలిసి మీ బోధను వినేందుకు వచ్చాను. ఇప్పుడు నా స్నేహితుడిక మీతో ఉండిపోనున్నాడు, మీ పట్ల అతడు తన విశ్వాసాన్ని ప్రకటించాడు. నేను మాత్రం నా యాత్రను తిరిగి కొత్తగా ప్రారంభించబోతున్నాను."

"మీ ఇష్టం." అన్నాడు భగవానుడు మర్యాదతో.

బహుశ: నేను సాహసించి మాట్లాడుతున్నానేమో, మరి" అన్నాడు సిద్ధార్థుడు- "కానీ నా ఆలోచనలను చిత్తశుద్ధితో భగవానునికి తెలియజేయకుండా ఇక్కడినుండి వెళ్ళటం నాకు ఇష్టంగాలేదు. నేను చెప్పేదానిని భగవానుడు ఇంకొంతసేపు వినగలరా?"

బుద్ధుడు సమ్మతిని తెలియజేస్తూ నిశ్శబ్దంగా తల ఊపాడు.

సిద్ధార్థుడన్నాడు- "ఓ భగవానుడా, ఒక విషయంలో మీ బోధనల్ని నేను ఎంతో ప్రశంసించాను- మీరు చెబుతున్నది ప్రతి ఒక్కటీ సంపూర్ణంగాను, స్పష్టంగాను, నిరూపితంగాను ఉన్నది. మీరు ఈ ప్రపంచాన్ని కారణం- ప్రభావాలచే అనుసంధానింపబడిన అనంత శృంఖలంగాను; ఒక సంపూర్ణమైన, అవిభక్తమైన గొలుసుగాను చూపారు. ఇంతకు మునుపెన్నడూ దానిని అంత స్పష్టంగా ఎవరూ చూపి ఉండలేదు. ఇంత నిర్ద్వంద్వంగా మునుపెన్నడూ అది ప్రదర్శింపబడలేదు. నిజంగానే, మీ బోధనలద్వారా ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు- ఈ ప్రపంచాన్ని- పూర్తిగా పొందికతో, ఒక్క లొసుగూ లేకుండా, స్ఫటికమంత స్వచ్చంగా, యాదృచ్ఛికతపై అస్సలు ఏమాత్రం ఆధారపడకుండా, దేవతలపై ఆధారపడకుండా, తనంతట తానుగా ఉన్న ప్రపంచాన్ని చూసినపుడు, నిజంగానే ప్రతి బ్రాహ్మణుని గుండె ఉద్వేగంతో ఉరకలు వేస్తుంది. అది 'మంచిదా, చెడ్డదా'; అసలు జీవితం అన్నది స్వయంగా 'దు:ఖమా, సంతోషమా'; అది అసలు 'అనిశ్చితమా'? ఏమో అది అలాగే అయి ఉండవచ్చు, అదంత ముఖ్యం కాదు- కానీ ఈ ప్రపంచపు ఏకత్వం, అన్ని సంఘటనలు అమరి ఉన్న పొందిక, పెద్దవి-చిన్నవి; ఉన్నతమైనవి-నీచమైనవి అయినవన్నీకూడా ఒకేధారను- ఒకే కారణాన్ని- 'భావ్యత-నశించటం' అనే ఒకే ఒక న్యాయాన్ని అనుసరించటం: ఇది సమున్నతమైన మీ బోధనలో స్పష్టంగా వెలుగొందుతున్నది, ఓ మహానుభావుడా. కానీ మీ బోధనల ఆధారంగా చూస్తే, అన్నింటి ఈ ఏకత్వమూ, అన్నింటి తార్కిక పరిణామమూ ఒక్క చోట మాత్రం విచ్చిన్నమౌతున్నది: ఈ చిన్న ఖాళీ నుండి, ఏకరూపమైన ఈ ప్రపంచంలోకి నూతనమూ, అసాధారణమూ, అంతకుముందు లేనిది- అందువల్ల నిజంగా నిరూపించబడలేనిది- ఋజువు చెయ్యలేనిది- ఒకటి నెట్టుకు వస్తున్నది: అది మీరు చెప్తున్న "ప్రపంచాన్ని అధిగమించటం", నిర్వాణం. అయితే, ఈ చిన్న ఖాళీ వల్ల, ఈ చిన్న పగులు కారణంగా- మీరు అనంతమూ, ఏకరూపమూ అని చెప్పే ప్రపంచన్యాయం తిరిగి ముక్కలౌతున్నది. ఈ ఆక్షేపణ లేవనెత్తినందుకు నన్ను క్షమించాలి."

గౌతముడు నిశ్శబ్దంగా, కదలకుండా విన్నాడు. ఇప్పుడు ఆ పరిపూర్ణ వ్యక్తి తన కరుణాపూర్ణమైన స్వరంతో స్పష్టంగాను, గౌరవపూరకంగాను ఇలా అన్నాడు: " ఓ బ్రాహ్మణ కుమారుడా! నువ్వు బోధలను చక్కగా విన్నావు. వాటిని గురించి నీవు అంత లోతుగా ఆలోచించటం శ్లాఘనీయం. నీకు ఒక లోపం కనిపించింది- దానిని గురింఛి మళ్ళీ ఇంకా బాగా ఆలోచించు. అయితే, జ్ఞాన తృష్ణ గల నీకు ఒక హెచ్చరిక మాత్రం చేయనివ్వు- అభిప్రాయాల గుబురు గురించి, పదాల ఘర్షణ గురించీనీ: అభిప్రాయాలకు అసలు విలువలేదు- అవి అందంగా ఉండవచ్చు, లేదా వికారంగా ఉండొచ్చు; తెలివిగాను, లేదా మూర్ఖంగానూ ఉండవచ్చు. ఎవరైనా వాటిని స్వీకరించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు- అయితే, నీవు విన్న ఆ బోధన, నా అభిప్రాయం కాదు. జ్ఞాన తృష్ణగలవారికి ప్రపంచాన్ని వివరించటం దాని లక్ష్యం కాదు. దాని ఉద్దేశం పూర్తిగా భిన్నమైనది. దాని లక్ష్యం దు:ఖం నుండి విముక్తి. గౌతముడు బోధించేది ఇది మాత్రమే- వేరేదేదీ కాదు.

"కోపగించుకోకండి, ఓ భగవానుడా! అన్నాడు యువకుడు. "పదాలగురించి మీతో పోట్లాడేందుకుకాదు, నేను మీతో మాట్లాడింది. 'అభిప్రాయాలకు విలువలేదు' అని మీరు అంటున్నది వాస్తవమే. కానీ నేను ఇంకొంచెం చెప్పవచ్చునా? నేను మిమ్మల్ని ఒక్క క్షణమాత్రంకూడా శంకించలేదు. మీరు బుద్ధుడే అన్న విషయంలో నాకు లేశమాత్రం సందేహం లేదు. వేలాదిమంది బ్రాహ్మణులు, బ్రాహ్మణకుమారులు చేరేందుకు శ్రమిస్తున్న అత్యున్నత గమ్యాన్ని, నిస్సంశయంగా, మీరు సాధించారు. మీరు దాన్ని మీ సొంత ప్రయత్నం ద్వారా, మీ సొంత మార్గంలో, ఆలోచన ద్వారా, ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, నిర్వాణం ద్వారా సాధించారు. మీరు బోధనల ద్వారా ఏమీ నేర్చుకోలేదు- అందువల్ల నాకు అనిపిస్తున్నది, ఓ భగవానుడా, బోధనలవల్ల ఎవ్వరూ విముక్తిని సాధించలేరు. ఓ గౌరవనీయుడా, నిర్వాణం లభించిన ఘడియలో మీకేమయిందో పదాల ద్వారాను, బోధనలద్వారాను తెలియపరచలేరు. స్వప్రయత్నం ద్వారా నిర్వాణం సాధించిన బుద్ధుని బోధనలో అనేక విషయాలున్నాయి- అవి చాలా విషయాలను బోధిస్తాయి- 'సరైన జీవితాన్ని గడపటం ఎలా, చెడునుండి దూరంగా ఉండటం ఎలా', అనేవన్నీ. కానీ ఒక్క విషయం మాత్రం ఈ స్పష్టమైన, గౌరవనీయమైన బోధనలో ఉండదు: భగవానుడు స్వయంగా అనుభూతి చెందిన ఆ రహస్యం- వందల-వేల మందిలో ఆయన ఒక్కడూ మాత్రమే అనుభూతిచెందిన ఆ పరమ రహస్యం ఒక్కటీ ఆ బోధనలో ఉండదు. మీ బోధనలు వినినప్పుడు నేను అనుకున్నదీ, గుర్తించిందీ ఇదే. అందుకనే నా మార్గాన నేను వెళ్తున్నాను: ఇంకొక- చాలా మంచి- సిద్ధాంతాన్ని దేన్నో వెతుక్కుంటూ కాదు- ఎందుకంటే అటువంటిది ఏదీ ఉండదని నాకు తెలుసు- కానీ నేను వెళ్తున్నది ఎందుకంటే, అన్ని సిద్ధాంతాలను, అందరు గురువులనూ వదలి, నా గమ్యాన్ని నేను స్వయంగా చేరుకునేందుకు- లేదా మరణించేందుకు. కానీ నేను ఈ రోజును తరచు గుర్తుచేసుకుంటాను, ఓ భగవానుడా, నా కనులతో ఒక పవిత్రమూర్తిని సందర్శించిన ఈ సమయాన్ని మరువను."

బుద్ధుని కనులు నిమీలితాలైనాయి. లోతు తెలియని ఆయన వదనం సంపూర్ణమైన సమతను వ్యక్తీకరిస్తున్నది. "నీ తర్కంలో ఏ తప్పూ లేదని ఆశిస్తాను." అన్నాడు భగవానుడు మెల్లగా. "నీవు నీ గమ్యాన్ని చేరుదువు గాక! కానీ ఒక సంగతి చెప్పు- నువ్వు నాతోటి సన్యాసుల సంఘాన్ని, బోధనల పట్ల విశ్వాసం ప్రకటించిన అనేకమంది నా సోదరులను చూశావు గదా? సుదూరం నుండి వచ్చిన ఓ శ్రమణుడా, వీరంతా ఈ బోధనలను విడచిపెట్టి ప్రాపంచిక జీవితంలోకి, కోరికల వలయంలోకి తిరిగి వెళ్తే బాగుండునని నీకు అనిపిస్తున్నదా?"

"అటువంటి ఆలోచనే నాకు రాలేదు! " అన్నాడు సిద్ధార్థుడు గట్టిగా. "వారంతా బుద్ధుని బోధలను అనుసరించెదరు గాక! వారంతా వారి లక్ష్యాన్ని చేరుకొందురు గాక! ఇంకొకరి జీవితాలను బేరీజు వెయ్యటం నా అభిమతం కాదు. నన్ను నేను బేరీజు వేసుకోవాలి. నేనుగా నాకై ఎంచుకోవాలి, లేదా తిరస్కరించాలి. ఓ భగవానుడా! మేము, శ్రమణులము, ఆత్మనుండి విముక్తికై ప్రయత్నిస్తుంటాము. 'నేను మీ అనుయాయులలో ఒకడినైతే, ప్రశాంతంగా ఉన్నానని, ముక్తిని సాధించానని నన్ను నేను మోసం చేసుకుంటానేమో! అది కేవలం ఉపరితలం మీద ఉండే ప్రశాంతతే అవుతుంది, నిజానికి ఆత్మ జీవిస్తూ, ఇంకా బలపడి పెరుగుతూ పోతుంది. ఎలాగంటే, అది ఇప్పుడు తమరి పవిత్ర బోధనల రూపాన్ని సంతరించుకుంటుంది- వాటిపట్ల నా విశ్వాసపు రూపాన్ని, మీ పట్ల, సంఘం పట్ల గల ఆదరపు రూపాన్ని- సంతరించుకుంటుందేమో' అని నా భయం."

నన్నని చిరునవ్వుతో, అవిచలమైన ప్రకాశంతో, స్నేహ పురత్సరంగా బుద్ధుడు ఆ అపరిచితుడిని తేరిపారచూసి, కనబడీ కనబడని శరీర కదలికతో అతని మాటల్ని తీసి పడేశాడు- "నువ్వు చాలా తెలివైనవాడివి, ఓ శ్రమణుడా," అన్నాడు భగవానుడు-" తెలివిగా మాట్లాడటం ఎలాగో నీకు తెలుసు, మిత్రమా! అతి తెలివి పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త వహించు నువ్వు."

బుద్ధుడు నడిచి వెళ్ళిపోయాడు. ఆయన ప్రసన్నమైన చూపు, సన్న చిరునవ్వు మాత్రం సిద్ధార్థుని చిత్తంలో ఎన్నటికీ చెరిగిపోని ముద్రవేశాయి. "ఇలా నవ్వే, ఇలా కూర్చునే, ఇలా నడిచే వ్యక్తిని నేనెన్నడూ చూసి ఉండలేదు" అనుకున్నాడు సిద్ధార్థుడు. "నేనుకూడా అలా స్వేచ్చగా, అంత ప్రశాంతంగా, అంత సంయమనంతో, అంత నిష్కపటంగా, చిన్నపిల్లల మాదిరిగా, అద్భుతంగా చూడాలి, నవ్వాలి, కూర్చొనాలి, అలా నడవాలి" "ఎవరైనా తన ఆత్మను జయిస్తే తప్ప అలా చూడలేరు, అలా మాట్లాడలేరు. నేనుకూడా నా ఆత్మను జయించాలి."

"నేను ఒక్క వ్యక్తిని మాత్రమే చూశాను- ఒకే వ్యక్తిని- ఆయన ఎదుట నా చూపు వాల్చాను. నేనిక వేరే ఏ వ్యక్తిముందూ చూపు వాల్చను. ఈ వ్యక్తి బోధనలు నన్ను ఆకట్టుకోలేదు, కనుక ఇకపై ఏ ఇతర బోధనలూ నన్ను కట్టిపడేయలేవు" అనుకున్నాడు సిద్ధార్థుడు.

"బుద్ధుడు నన్ను దోచుకున్నాడు- ఆయన నన్ను దోచుకున్నాడు, కానీ నాకు దానికంటే విలువైనదాన్ని ఇచ్చాడు. ఆయన నానుండి నా స్నేహితుడిని దోచుకున్నాడు- అతను గతంలో నన్ను నమ్మేవాడు, ఇప్పుడు బుద్ధుని విశ్వసిస్తున్నాడు, గతంలో అతను నా నీడ- ఇప్పుడు అతను గౌతముని నీడ. కానీ బుద్ధుడు నాకు సిద్ధార్థుడిని ఇచ్చాడు- నన్ను నాకు ఇచ్చాడు!"

changed April 29, 2010