వేశ్య కమల గౌతముని అనుయాయులకు ఒకనాడు బహుమానంగా ఇచ్చిన ఆనందవనంలో, తోటి భిక్షువులు కొందరితో కలసి గోవిందుడు కొంతకాలంపాటు విశ్రాంత జీవితాన్ని గడిపాడు. ఆ సమయంలో నది ప్రక్కనే నివసించే ఒక పడవ సరంగును గురించి అతడు విని ఉన్నాడు- ఆ నది పట్టణం నుండి ఒకరోజు ప్రయాణ దూరంలో ఉన్నది. చాలామంది అతనిని ఒక మహాత్మునిగా పరిగణిస్తుంటారు. గోవిందుడు పట్టణాన్ని విడచి వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు, ఈ బల్లకట్టు దారి పట్టాడు- పడవ సరంగును చూసేందుకు ఉత్సుకతతో. ఎందుకంటే అతను తన స్వీయ జీవితాన్ని నియమబద్ధంగా గడిపినప్పటికీ, తన వయసును, వినమ్రతను గుర్తించిన అనేకమంది యువ భిక్షువులు అతన్ని గౌరవించి, ఆదరభావంతో చూసినప్పటికీ, అతని హృదయంలో అశాంతి ఇంకా ఉంది. అతని అన్వేషణ ఇంకా ఫలించలేదు.

అతను నది వద్దకు చేరి తనను నది దాటించమని ముసలి సరంగును కోరాడు. ఆవలి తీరాన్ని చేరి పడవ దిగిన తరువాత అతను సరంగును అడిగాడు- "నువ్వు భిక్షువులకు, యాత్రికులకు చాలా సాయం చేస్తున్నావు. మమ్మల్ని చాలామందిని నీవు దరి చేర్చావు. నువ్వుకూడ సమ్యక్ పథాన్ని వెతికే అన్వేషకుడివేనా?"

సిద్ధార్థుని ముసలి కన్నులలో చిరునవ్వు విరిసింది. "నిన్ను నువ్వు ఇంకా అన్వేషకునిగా చూస్తున్నావా, మహాశయా? గౌతముని భిక్షువుల వస్త్రాలు ధరించిన నీవు, వయసు పైబడిన నీవు ఇంకా కూడా అన్వేషకుడివేనా?" అన్నాడు సరంగు.

"నేను ముసలివాడిని, నిజమే. కానీ నేను అన్వేషించటం మానలేదు. నేను అన్వేషణను ఎన్నటికీ మానను- అదే నా విధి రాత అనుకుంటాను. నీవు కూడా అన్వేషించావని నాకు అనిపిస్తున్నది. నువ్వు దాన్ని గురించి నాతో కొంత మాట్లాడరాదా, మిత్రమా?"

నేను నీకు చెప్పగల గొప్ప సంగతి ఏముంటుంది?" అన్నాడు సిద్ధార్థుడు. "బహుశ: నువ్వు చాలా ఎక్కువ అన్వేషిస్తున్నావేమో, నీ అన్వేషణ కారణంగానే నీకు అది దొరకటంలేదేమో?"

"అదెలా?" అడిగాడు గోవిందుడు..

"ఎవరైనా దేన్నైనా అన్వేషిస్తున్నప్పుడు, సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి తను అన్వేషించే దాన్ని మాత్రమే చూస్తాడు. అతను ఇక వేరే దేన్నీ చూడడు, కనుగొనడు, దేన్నీ తనలో ఇముడ్చుకోలేడు. ఎందుకంటే అతను కేవలం తను అన్వేషిస్తున్నదాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తుంటాడు; అతనొక లక్ష్యాన్ని చూస్తుంటాడు; తన లక్ష్యంలోనే పాతుకుపోయి, మైమరచిపోయి ఉంటాడు. అన్వేషించటం అంటేనే ఒక గమ్యాన్ని కలిగిఉండటం. కానీ "కనుగొనటం" అంటే స్వేచ్ఛగా ఉండటం, నూత్న విషయాలను స్వాగతించేలా ఉండటం, లక్ష్యం ఏదీ లేకపోవటం. నువ్వు, గౌరవనీయుడైన ఓ శ్రమణుడా, నువ్వు బహుశ: నిజంగా ఒక అన్వేషకుడివే- ఎందుకంటే నీ గమ్యాన్ని చేరేందుకు చేసే సాధనక్రమంలో నువ్వు నీ చుట్టూ జరిగే అనేక విషయాలను గుర్తించవు."

"నాకు సరిగా అర్థం కాలేదు" అన్నాదు గోవిందుడు-"మీరేం అంటున్నారు?"

"ఓ మహానుభావా, ఒకసారి, చాలా సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావు. అప్పుడొక మనిషి ఇక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు నువ్వు అతని ప్రక్కనే కూర్చొని అతని రక్షణ బాధ్యత వహించావు. కానీ నిద్రపోతుండిన ఆ మనిషిని నువ్వు గుర్తించలేదు, కదూ, గోవిందా?"

ఆశ్చర్యంతో మంత్రముగ్డుడైపోయిన గోవిందుడు పడవ సరంగును గుడ్లప్పగించి చూశాడు.

"నువ్వు సిద్ధార్థునివా?" అడిగాడతను సిగ్గుపడుతున్న స్వరంతో. "నేను నిన్ను ఈసారికూడా గుర్తుపట్టలేదు. నిన్ను మళ్లీ కలవగల్గటం- చాలా సంతోషంగా ఉంది సిద్దార్థా, చాలా బాగుంది. నువ్వు చాలా మారావు, మిత్రమా. ఇప్పుడు నువ్వు పడవ సరంగువయ్యావా?"

సిద్ధార్థుడు స్నేహపూర్వకంగా నవ్వాడు. "అవును, నేను పడవ సరంగునయ్యాను. చాలామంది మనుషులు చాలా మారాల్సి ఉంటుంది, చాలా రకాల బట్టలు ధరించాల్సి వస్తుంది. నేను అలాంటివాళ్లలో ఒకడిని, మిత్రమా. నీకు స్వాగతం, ఓ గోవిందా, ఈరోజు రాత్రి నా గుడిశలో గడిపేందుకు నిన్ను ఆహ్వానిస్తున్నాను."

గోవిందుడు ఆ రాత్రి సిద్ధార్థుని గుడిశలో గడిపాడు. గతంలో వాసుదేవుడు పడుకున్న పక్కమీద ఇప్పుడు అతను పడుకున్నాడు. అతను తన చిన్ననాటి స్నేహితుడిని చాలా ప్రశ్నలు వేశాడు; సిద్ధార్థుడు అతనికి తన జీవితం గురించి చాలా చెప్పాడు.

తరువాతి రోజున, ఉదయం, తాను వెళ్లవలసిన సమయం దగ్గర పడుతుండగా, కొంత సంకోచిస్తూనే గోవిందుడు అతన్ని అడిగాడు- " నా దారిన నేను వెళ్లేముందు, సిద్ధార్థా, ఇంకొక ప్రశ్న అడగాలి నిన్ను. నువ్వు సరిగా, మంచిగా జీవించేందుకు తోడ్పడే జ్ఞానం, నమ్మకం లేదా సిద్ధాంతం ఏదైనా ఉందా, నీ దగ్గర?"

సిద్ధార్థుడు అన్నాడు- " నీకు తెలుసు మిత్రమా, యువకునిగా ఉన్నప్పుడు కూడా, మనం శ్రమణులతో కలిసి అరణ్యంలో జీవించినప్పుడుకూడా, నేను సిద్ధాంతాలపట్ల, గురువుల పట్ల నమ్మకం కోల్పోయాను, వాటిని తిరస్కరించాను. ఆనాటి నుండి నాకు చాలామంది గురువులు అయ్యారు- అయినప్పటికీ నా మన: ప్రవృత్తి మాత్రం అప్పటిమాదిరే ఉన్నది. అందమైన ఒక వేశ్య నాకు గురువుగా ఉన్నది, చాలాకాలంపాటు. ఒక ధనిక వర్తకుడు, జూదగాడు కూడాను. ఒకానొక సందర్భంలో బుద్ధుని భిక్షువొకడు, తన సంచారంలో, నాకు గురువైనాడు. అతడు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొని, నా ప్రక్కన కూర్చొని, నేను ఒళ్ళు తెలీకుండా నిద్రపోతున్నప్పుడు నన్ను సంరక్షించాడు. నేను అతనినుండి కూడా కొంత నేర్చుకున్నాదు, అందుకై నేను అతనికి కృతజ్ఞుడిని- చాలా కృతజ్ఞుడిని. కానీ అన్నింటికంటే ముఖ్యం, నేను ఈ నదినుండి, నాకు ముందు పడవసరంగు అయిన నా పూర్వీకుడు, వాసుదేవుని నుండి చాలా నేర్చుకున్నాను. అతను చాలా సామాన్యమైన వ్యక్తి- మేధావి కాదు, కానీ మూలవిషయాన్ని గౌతముడు గ్రహించినంతగా అతనూ దర్శించాడు. అతను ఒక పవిత్ర పురుషుడు. ఋషి."

గోవిందుడన్నాడు- " నీకు అపహాస్యం చేయటం, ఎగతాళి పట్టించటం అనే అలవాట్లు ఇంకా ఉన్నట్లున్నాయి సిద్ధార్థా! నువ్వు ఏ గురువునూ అనుసరించలేదని నాకు తెలుసు, నేను నిన్ను నమ్ముతాను. కానీ నీకంటూ నీకు, ఒక దర్శనం, ఒక సిద్ధాంతం, కాకపోతే- కనీసం కొన్ని ఆలోచనలంటూ లేవా? జీవించేందుకు తోడ్పడే ఒక ప్రత్యేక జ్ఞానం అంటూ దేన్నీ నువ్వు కనుగొనలేదా? నువ్వు దీన్ని గురించి కొంచెం చెబితే నేను చాలా సంతోషిస్తాను."

సిద్ధార్థుడన్నాడు-" అవును నిజమే, నాకు అక్కడక్కడా ఆలోచనలు, జ్ఞానం అందిన మాట వాస్తవమే. మన హృదయంలో జీవం ఉనికి స్ఫురించినట్లు, ఒక్కొక్కసారి, ఒక గంటపాటు, ఒక రోజుపాటు, జ్ఞానం నా ఎరుకలోనికి వచ్చింది- నాకు చాలా ఆలోచనలు వచ్చాయి, కానీ వాటిని అన్నిటిని గురించి నీకు చెప్పటం చాలా కష్టం. కానీ ఈ ఆలోచన ఒకటి మాత్రం నాకు చాలా నచ్చింది, గోవిందా: (విస్డమ్ ఈజ్ ఇన్ కమ్యూనికబుల్) జ్ఞానాన్ని ఇతరులకు అందించటం వీలుకాదు. జ్ఞాని ఎవరైనా, ఇతరులకు అందించాలని ప్రయత్నించే జ్ఞానం, అది ఎలాంటిదైనా సరే, తెలివి తక్కువదిగానే కనబడుతుంది.

"నువ్వు ఊరికే, ఎగతాళిగా అంటున్నావా?" అడిగాడు గోవిందుడు.

"లేదు, నేను కనుగొన్నదానిని నీకు చెబుతున్నాను. విషయ పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించవచ్చు; కానీ జ్ఞానం అలాకాదు. ఎవరైనా ఆ జ్ఞానాన్ని కనుగొనవచ్చు, దానివల్ల బలం పొందవచ్చు, దాని సహాయంతో అద్భుతాలను సాధించవచ్చు, కానీ ఎవ్వరూ ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందించలేరు, నేర్పించలేరు. నేను ఇంకా యువకుడిగా ఉన్నప్పుడే నాకు ఈ మాత్రం అనుమానం ఉండేది; అందువల్లనే నేను గురువులనుండి దూరంగా పారిపోయాను. నాకు ఒక ఆలోచన కలిగేది, గోవిందా. అది చెప్తే, నేను మళ్లీ అపహాస్యం చేస్తున్నాననుకుంటావు నువ్వు. అది ఏమంటే, ప్రతి సత్యానికి వ్యతిరేకంగా ఉండేది కూడా దానంత సత్యమే. (ఇన్ ఎవిరీ ట్రూత్, ద ఆపోసిట్ ఈజ్ ఈక్వల్లీ ట్రూ) ఉదాహరణకు, చెప్తాను- ఏదైనా సత్యాన్ని ఇతరులకు అందించాలంటే, మాటల్లో వివరించాలంటే, అది కేవలం ఏకపక్షంగా ఉండాలి. ఆలోచన ద్వారా పయనించి, పదాలుగా కూర్చబడేది ఏదైనా ఏకపక్షంగా ఉండవలసిందే. కేవలం అర్ధసత్యం అది- అలా బయల్వెడలినదానిలో సంపూర్ణత, పరిపూర్ణత, ఏకత్వం ఉండజాలదు. భగవానుడైన బుద్దుడు ప్రపంచాన్ని గురించి బోధించతలపెట్టినప్పుడు, ఆయన దానిని సంసారం, నిర్వాణం అనే రెండు భాగాలుగాను, మిథ్య-సమ్యక్ అనే రెండు భాగాలుగాను, దు:ఖం-విముక్తి గాను విభజించవలసి వచ్చింది. వేరే మార్గం లేదు, బోధింపనెంచినవారికి వేరే మార్గమేమీ లేదు. కానీ ప్రపంచం మాత్రం- మనలోపల, బయట వ్యాపించిఉన్న ఈ ప్రపంచం మాత్రం- ఎన్నడూ ఏకపక్షంగా ఉండదు. ఏ వ్యక్తిగానీ, ఏ పనిగానీ ఎన్నడూ పూర్తిగా సంసారరూపం, లేదా పూర్తిగా నిర్వాణరూపం కాజాలదు. ఏ మనిషీ, ఏనాడూ పూర్తిగా పాపిగానీ, పూర్తిగా పుణ్యపురుషుడుగానీ కాడు. కేవలం ఇది అలా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కాలం వాస్తవమనే భ్రాంతిలో ఉంటాం. కాలం వాస్తవంకాదు, గోవిందా. ఈ సంగతిని నేను అనేక పర్యాయాలు అనుభూతిచెంది గ్రహించాను. అలా కాలం వాస్తవం కానప్పుడు, ఈ ప్రపంచానికీ, అనంతానికీ; దు:ఖానికీ, ఆనందానికీ; మంచికీ, చెడుకూ మధ్య ఉన్నట్లుతోచే విభజనరేఖకూడా అవాస్తవమే అవుతుంది.

"అదెలా" అన్నాదు గోవిందుడు, కలవరపడుతూ.

"విను, మిత్రమా! నేను పతితుడిని, నువ్వూ పతితునివే, కానీ ఏదో ఒకనాడు ఈ పతితుడు తిరిగి బ్రహ్మ అవుతాడు, ఏదో ఒకనాడు నిర్వాణాన్ని సాధిస్తాడు, ఏదో ఒకనాటికి బుద్దుడౌతాడు- అయితే ఈ "ఏదో ఒకనాడు" అనేది భ్రాంతి. ఇది కేవలం ఒక పోలిక మాత్రమే. పతితుడు బుద్ధుని స్థితిని చేరుకునే మార్గంలో లేడు; అతను, పరిణామమేమీ చెందటంలేదు- కానీ ఇలాకాక వేరేగా ఊహించుకోవటం మన మేధస్సుకు సాధ్యం కాదు. లేదు; బుద్దుని బీజం-బోధి- పతితునిలో ముందుగానే ఉన్నది. అతనిలో దాగిఉన్న ఈ బోధిని అతను తనలో గుర్తించాలి., నీలోనూ, అందరిలోనూ. ఈ ప్రపంచం, గోవిందా, అపరిపూర్ణంగా లేదు; పరిపూర్ణత దిశగా మెల్లగా ఎదుగుతూ పరిణామం చెందటమూలేదు- లేదు; అది ప్రతి క్షణంలోనూ పరిపూర్ణంగా ఉన్నది. ప్రతి పాపమూ తనలోనే క్షమను కల్గి ఉన్నది, పిల్లలందరూ బీజరూపంలోని ముసలివారే, పసికూనలన్నిటిలోనూ మృత్యువు ఉన్నది, మరణించే వారిలోనే అనంత జీవం ఉన్నది. మార్గంలో ఎవరు ఎంతదూరం వెళ్లారు అన్నది వేరే ఎవ్వరూ కనుగొనలేరు- దోపిడి దొంగలోనూ, జూదగాడిలో కూడాను బుద్ధత్వం ఉన్నది; బ్రాహ్మణుడిలో బందిపోటున్నాడు. లోతుగా ధ్యానం చేసినప్పుడు కాలాన్ని దూరం చేసుకొనవచ్చు, గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును మొత్తాన్నీ ఒకేసారి చూడవచ్చు- అప్పుడు ప్రతిదీ మంచిదే- మృత్యువు-జీవితం; పాపం-పుణ్యం; జ్ఞానం-అజ్ఞానం అన్నీ మంచివే. ప్రతిదీ అవసరమే., ప్రతిదానికీ కేవలం నా ఒప్పుకోలు, నా ప్రేమ పూర్వక అవగాహన, అంగీకారం మాత్రం చాలు- అప్పుడు నాకూ బాగుంటుంది, ఏదీ నాకు కీడు చేయజాలదు. పాపంతోటీ, మోహంతోటీ యుద్ధం చేయకుండా ఉండటం నేర్చుకునేందుకు; ప్రపంచాన్ని ప్రేమించటం నేర్చుకునేందుకు దాన్ని ఇక నేను కోరే వేరే ఏ ఊహాత్మక ప్రపంచంతోటిగానీ, పరిపూర్ణతను గురించిన ఏ ఊహతోటీగానీ పోల్చకుండా ఉండేందుకు, ఉన్నదానిని ఉన్నట్లు వదిలివేసేందుకు, దాన్ని ప్రేమించి, ఆ వాస్తవ ప్రపంచంలో భాగమైనందుకు సంతోషించేందుకుగాను నేను పాపం లోనికి దిగవలసి వచ్చింది, మోహంలోకి దిగవలసి వచ్చింది, ఆస్తికోసం కృషిచేయవలసి వచ్చింది, వాటిపట్ల తీవ్రమైన జుగుప్సను, లోతైన నిస్పృహను అనుభవించవలసివచ్చింది. ఇవన్నీ నాకు అవసరమైనాయని నేను మనసా, వాచా, కర్మణా తెలుసుకున్నాను. గోవిందా, ఇవీ, నా మనసులోని కొన్ని ఆలోచనలు."

సిద్ధార్థుడు వంగి, నేలమీదున్న రాయిని ఒకదాన్ని చేతులోకి తీసుకున్నాడు: "ఇది ఒక రాయి. కొంతకాలం గడచిన తరువాత ఇది బహుశ: మట్టిగా మారుతుంది. ఆ మట్టినుండి మొక్క, జంతువు, లేక మనిషి అవుతుంది. గతంలో అయితే, నేను -’ఈ రాయి కేవలం ఒక రాయి, దీనికి విలువలేదు; ఇది కేవలం మాయా ప్రపంచానికి చెందినది; కానీ మార్పు అనే చక్రంలో ఇది కూడా మనిషిగాను, ఆత్మగాను రూపాంతరం చెందుతుంది కనుక దీనికి కూడా కొంత ప్రాధాన్యత లేకపోలేదు’ అనేవాడిని. అలా అనుకొని ఉండేవాడిని నేను. కానీ ఇప్పుడు నేను అలా అనుకోను: "ఈ రాయి, ఒక రాయి. ఇది జంతువు కూడా. భగవంతుడూ, బుద్ధుడూ కూడా ఇదే. ఇది ఒక వస్తువు మాదిరి ఉండి వేరే వస్తువు మాదిరి మార్పు చెందుతుందన్నది నేను దాన్ని ప్రేమించేందుకు, గౌరవించేందుకు కారణంకాదు- అది ఇప్పటికే ఎంతో కాలంగా అన్నీ అయింది, ఎప్పుడూ అన్నీ అయి ఉన్నది: అది రాయి కనుక, ఈ రోజున, ఈ క్షణంలో అది నాకు రాయిగా కనిపిస్తోంది కనుక నేను దానిని ప్రేమిస్తాను. దానిపైనున్న ప్రతి సూక్ష్మ రేఖలోను, దానిలోని ప్రతి రంధ్రంలోను, దాని పసుపుపచ్చలో, దాని బూడిదరంగులో, దాని గట్టిదనంలో, దాన్ని కొట్టినప్పుడు అది చేసే శబ్దంలో, దాని ఉపరితలపు పొడితనంలో, లేదా దాని తేమలో నాకు విలువ, అర్థం కనబడతాయి. నూనె మాదిరి, లేదా సబ్బు మాదిరి అనిపిస్తాయి కొన్ని రాళ్ళు; కొన్ని రాళు ఆకులమాదిరి, ఇసుకమాదిరి కనిపిస్తాయి- ప్రతిదీ వేరే, ప్రతిదీ ఓంకారాన్ని తనదైన పద్ధతిలో పూజిస్తుంది- ప్రతిదీ బ్రహ్మమే, అదే సమయంలో ప్రతిదీ రాయే, సబ్బులాంటి రాయి, నూనెలాంటి రాయి, నూనె లాంటి రాయి. అదే నాకు సంతోషాన్నిస్తుంది, అందులనే అది అద్భుతంగాను, పూజనీయంగాను కనబడుతుంది. కానీ నేను దాన్ని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పను. పదాలు ఆలోచనలను పూర్తిగా ప్రతిబింబించవు. వాటిని వ్యక్తీకరించిన క్షణంలోనే అవి కొంత వేరేగా అవుతాయి; మార్పు చెందుతాయి, కొంచెం వక్రీకరణకు గురౌతాయి, కొంచెం తెలివి తక్కువగా ఔతాయి. అయితే ఒక వ్యక్తికి చాలా విలువైనదిగాను, జ్ఞానంగాను అనిపించే ఆలోచనలే ఇంకొకరికి అర్థంలేనివిగా తోస్తాయే, ఈ సంగతికూడా నాకు సంతోషాన్నిస్తుంది, సరైనదేనన్పిస్తుంది.

గోవిందుడు మాట్లాడకుండా విన్నాడు ఇదంతా. కొంతసేపటి తరువాత కొంత సంకోచిస్తూనే అడిగాడు- "నువ్వు నాకు రాయి గురించి ఎందుకు చెప్పావు?" అని.

"దాని వెనక ఏ ఉద్దేశమూ లేదు. అయితే నేను రాయిని, నదిని, మనం చూసే ఈ అన్ని వస్తువుల్ని, మనకు నేర్పించే వీటినన్నింటినీ చాలా ప్రేమిస్తున్నాను, అని మాత్రం తెలుస్తుంది దానినుండి. నేనొక రాయిని ప్రేమించగలను, గోవిందా, లేకపోతే ఓ బెరడు ముక్కను ప్రేమించవచ్చు. ఇవన్నీ వస్తువులే, వస్తువుల్ని ప్రేమించవచ్చు, కానీ పదాలను ఎవ్వరూ ప్రేమించలేరు. అందువల్ల బోధనలవల్ల నాకు ఉపయోగం లేదు. వాటిలో గట్టిదనంలేదు, మెత్తదనంలేదు, రంగులు లేవు, మూలలు లేవు, వాసనలేదు, రుచిలేదు- వాటిలో పదాలు తప్ప వేరే ఏమీ లేవు. బహుశ: నీకు శాంతి లభించకుండా అడ్డుకుంటున్నవీ అవేనేమో, బహుశ: చాలా చాలా పదాలైపోయాయేమో, ఏమంటే చివరికి ముక్తి, శీలం, సంసారం, నిర్వాణం- ఇవన్నీ కేవలం పదాలు మాత్రమే, గోవిందా. నిర్వాణం అనే ఒక వస్తువు లేదు. కేవలం నిర్వాణం అనే పదం మాత్రం ఉన్నది."

గోవిందుడన్నాడు: "నిర్వాణం అన్నది కేవలం పదం మాత్రమే కాదు, మిత్రమా. అది ఒక ఆలోచన."

సిద్ధార్థుడు కొనసాగించాడు- " అది ఒక ఆలోచనే కావచ్చు, మిత్రమా. కానీ నేనొక సంగతి ముందుగానే చెప్పాలి. నేను ఆలోచనలకు, పదాలకు మధ్య పెద్ద తేడాను చూడను. నిజంగా చెప్పాలంటే నేను ఆలోచనలకు కూడా ఏమంత ప్రాధాన్యతనివ్వను. నేను వస్తువులకు ప్రాధాన్యతనిస్తాను. ఉదాహరణకు, ఈ బల్లకట్టు దగ్గరే ఉండిన నా పూర్వీకుడు, నాగురువునే తీసుకుందాం_ అనేక సంవత్సరాలపాటు కేవలం ఈ నదినే నమ్మాడాయన. ఈ నది గొంతెత్తి తనతో మాట్లాడటాన్ని గుర్తించాడు; దానినుండి ఆయన నేర్చుకున్నాడు. ఆ నదే ఆయనకు విద్య గరిపింది, బోధించింది. నదే ఆయనకొక దేవత అయ్యింది. ఇలా అనేక సంవత్సరాలవరకు జరిగింది. ఆయన గుర్తించలేదు- ప్రతి పవనం, ప్రతి మేఘం, ప్రతి పిత్తా, ప్రతి చిన్న పురుగుకూడా ఈ నది అంత దైవత్వమే, దీనంత జ్ఞానియే, ఈ గొప్ప నది బోధించినంత ఉదాత్తంగా బోధించేవే. కానీ ఈ మహాత్ముడు చివరికి అరణ్యంలోకి వెళ్లిపోయిననప్పటికి, ఆయనకు అన్నీ తెలిసిపోయాయి. నీకు, నాకు తెలిసినదానికంటే ఎక్కువ తెలిసింది- ఏ గురువూ, ఏ పుస్తకాలూ లేకుందానే- ఇదంతా కేవలం ఆయన నదిని నమ్ముకోవటం వల్ల జరిగింది."

గోవిందుడన్నాడు: "కానీ నువ్వు దేన్నైతే ’వస్తువు’ అంటున్నావో, అది నిజంగా వాస్తవమేనా? స్వత: సిద్ధమేనా? అదంతా మాయ కల్పించే భ్రాంతి, కేవలం ఒక రూపం, ఒక కల్పన కాదా? నీ రాయి, నీ చెట్టు, ఇవన్నీ సత్యమేనా?"

"ఇదికూడా నన్ను పెద్దగా బాధించదు" అన్నాడు సిద్ధార్థుడు. "అవి గనక మిధ్యారూపాలైతే,అ ప్పుడు నేను కూడా మిధ్యే. వాటి తత్వమూ, నా తత్వమూ ఎల్లప్పుడూ ఒకటే, అందువల్లనే అవి నాకు అంత ప్రియమైనవీ, గౌరవనీయమైనవీ అవుతున్నాయి. అందువల్లనే నేను వాటిని ప్రేమించగల్గుతున్నాను. నా యీ సిద్ధాంతం విని నువ్వు నవ్వుతావు- గోవిందా, ప్రపంచంలో అతి ముఖ్యమైనది ప్రేమ అని నాకు అనిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని వివరించటమూ, దాన్ని తృణీకరించటమూ గొప్ప గొప్ప మేధావులకు ముఖ్యం కావచ్చు. కానీ, ప్రపంచాన్ని కేవలంగా ప్రేమించటం, దాన్ని తృణీకరించకపోవటం ముఖ్యం అని నాకు అనిపిస్తుంది. ఒకరిని ఒకరు అసహ్యించుకోవటం కాదు, కానీ మనల్ని మనం, దానితోపాటు అన్ని ప్రాణుల్ని కూడాను ప్రేమ పూర్వకంగా, గౌరవంగా అభిమానంగా చూడటం ముఖ్యం."

"నేను అది అర్థం చేసుకోగలను." అన్నాడు గోవిందుడు. ’కానీ బుద్ధ భగవానుడు మిధ్య అన్నది దీనినే. ఆయన దయను బోధించారు, ఓరిమిని, కరుణను, శాంతిని బోధించారు- కానీ ప్రేమను కాదు. భౌతికమైన ఈ ప్రేమతో మనల్ని మనం బంధించుకోరాదని ఆయన శాశించారు."

"నాకు తెలుసు" అన్నాడు సిద్ధార్థుడు చిరునవ్వు నవ్వుతూ. " నాకు ఆ సంగతి తెలుసు, గోవిందా. ఇలాగే, మనం అర్థాల జంజాలంలో పడేదీ, పదాల సంఘర్షణల్లో చిక్కుకునేదిన్నీ. ఎందుకంటే, నేను అనేదానికి, గౌతముని బోధనలకు మధ్య వైరుధ్యం ఉన్నట్లు అనిపిస్తుంది, నేను కాదనను. అందుకనే నాకు పదాలమీద అంత అపనమ్మకం. ఎందుకంటే, ఈ వైరుధ్యం కేవలం భ్రాంతి అని నాకు తెలుసు. నేను చెప్పేదీ, గౌతముడు బోధించినదీ ఒకటే. ఆ మహానుభావునికి, మానవజాతి మొత్తపు శూన్యతను, క్షణికతను దర్శించిన గొప్ప వ్యక్తికి, ప్రేమ గురించి తెలియకపోవటం ఏమిటి? తన పూర్తి జీవితాన్ని కేవలం జనులకు బోధించేందుకు, సాయపడేందుకు వెచ్చించేంతగా ఆయన మానవజాతిని ప్రేమించటం అనేది ఎలా సాధ్యపడింది? ఈ గొప్ప బోధకుని పరంగా కూడా, గోవిందా, పదాలకంటే వస్తువులే ముఖ్యమనిపిస్తుంది నాకు- ఆయన అభిప్రాయాలకంటే ఆయన చేతలు, అయన జీవితం ఎక్కువ విలువైనవనిపిస్తాయి నాకు. మాటల్లోను, ఆలోచనల్లోను కాదు; చేతల్లోను జీవితంలోను ఆయనను ఉత్తమ పురుషునిగా గుర్తిస్తాను నేను."

వృద్ధులిద్దరూ మౌనంగా కూర్చున్నారు చాలా సేపు. తర్వాత బయలుదేరేందుకు సిద్ధమౌతూ గోవిందుడు ఇలా అన్నాడు: "నీ ఆలోచనల్లో కొన్ని నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సిద్ధార్థా, వాటిలో కొన్ని చాలా వింతైనవి. వాటిని అన్నింటినీ నేను వెంటనే అర్థం చేసుకోలేను. అయినప్పటికీ, నీకు ధన్యవాదాలు. నీ ప్రశాంతత మరింతకాలం కొనసాగాలని నేను అభిలషిస్తున్నాను." అయితే తనలో తాను అతను ఇలా అనుకున్నాడు: " సిద్ధార్థుడు చాలా వింత మనిషి. అతని ఆలోచనలు వింతగా ఉన్నై. అతని అభిప్రాయాలు తిక్కతిక్కగా ఉన్నాయి. బుద్ధభగవానుని బోధనలు ఎంత భిన్నంగా ఉంటాయి! అవి స్పష్టంగా, సూటిగా ఉంటాయి; బాగా అర్థమయ్యేలా ఉంటాయి. వాటిలో వింతగా, మొరటుగా, నవ్వులాటగా ఏమీ అనిపించదు. అయితే, సిద్ధార్థుని పాదాలు, అతని కన్నులు, నుదురు, అతని శ్వాస, అతను స్వాగతించే తీరు అన్నీ అతని ఆలోచనలకు వ్యతిరేక ప్రభావం కలిగిస్తున్నాయి నాలో. మా బుద్ధ భగవానుడు నిర్యాణం చెందిన నాటినుండి ఈ సిద్ధార్థుని మాదిరిగా "ఇదిగో, ఇతను మహాత్ముడు" అనిపించిన వ్యక్తి నాకు ఒక్కరుకూడా తారసపడలేదు. ఇతని అభిప్రాయాలు వింతగా ఉండవచ్చు; ఇతని మాటలు తిక్కగా ఉండచ్చు; కానీ ఇతని చూపు, ఇతని చేతులు, చర్మం, జుత్టు అన్నీ పవిత్రతను, శాంతిని, ప్రశాంతతను, మార్దవాన్ని, ఋషిత్వాన్ని వెదజల్లుతున్నాయి. మా ఆచార్యుడైన బుద్ధభగవానుని నిర్యాణం తరువాత ఇంత తేజస్సును నేను ఏ వ్యక్తిలోనూ చూడలేదు. గోవిందుడు ఇలా ఆలోచిస్తూ, తన హృదయంలో విరుద్ధ భావనలతోనే సిద్ధార్థునికి అభివాదం చేశాడు. ఆప్యాయంగా అతను, మౌనంగా కూర్చున్న సిద్ధార్థునికి వంగి అభివాదం చేశాడు. "సిద్ధార్థా!" గోవిందుడన్నాడు: " మనం ఇప్పుడు వృద్ధులం. ఈ జీవితంలో మనం ఇంకోసారి ఒకరిని ఒకరం కలవకపోవచ్చు. నీకు శాంతి లభించిందని, మిత్రమా, నాకు తెలుస్తోంది. నాకు ఇంకొక్కటి ఏదైనా చెప్పు, ఆదరణీయుడైన ఓ మిత్రమా, నా ఊహకు అందేదీ, నాకు అర్థమయ్యే మాట ఏదైనా చెప్పు. సిద్ధార్థా, నా మార్గంలో నాకు సహాయపడేదేదైనా ఇవ్వు. నామార్గం తరచు కష్టంగాను, చీకటిగాను ఉంటోంది."

సిద్ధార్థుడు అతన్ని మౌనంగా, తన నిశ్చలమైన, ప్రశాంతమైన చిరునవ్వుతో చూశాడు. గోవిందుడు ఆతృతతో, ఆశతో అతని ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు. దు:ఖం, నిరంతర అన్వేషణ, నిరంతర వైఫల్యం అతని చూపులో వ్యక్తమౌతున్నాయి.

సిద్ధార్థుడు అది చూసి చిరునవ్వు నవ్వాడు.

"దగ్గరకు వంగు" మెల్లగా, గుసగుసగా చెప్పాడు గోవిందుని చెవిలో. "రా, ఇంకా దగ్గరకు రా, బాగా దగ్గరికి వంగు. నా నుదుటిని చుంబించు, గోవిందా."

గోవిండుడు కొంత ఆశ్చర్యపోయినప్పటికీ, అవ్యాజమైన ప్రేమ ఒకటి అతని అంతరాత్మను నిర్దేశించినట్లు అతను సిద్ధార్థుడు చెప్పినట్లు చేశాడు. అతనికి దగ్గరగా వంగి తన పెదిమలను సిద్ధార్థుని నుదుటికి ఆనించాడు. ఆ క్షణంలో అనిర్వచనీయమైన అనుభూతి ఒకటి అతన్ని నింపివేసింది. ఒకవైపున అతడు సిద్ధార్థుని వింత పలుకులను బేరీజు వేసుకుంటూ ఉండగానే, కాలమనే భావనను తిరస్కరించేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూండగానే, నిర్వాణం, సంసారం ఒకటే అని ఊహించుకునేందుకు వ్యర్థంగా పోరాడుతుండగానే, ఒకవైపున మిత్రుని మాటలపట్ల ఏర్పడ్డ ఒక ప్రత్యేకమైన విముఖత, అతనిపై తనకు కలిగిన అద్భుతమైన ప్రేమ, అభిమానాలతో ఘర్షణ పడుతుండగానే, అతనికి ఇది జరిగింది- అతనికి తన స్నేహితుడైన సిద్ధార్థుని వదనం కనిపించలేదు! దానిబదులు అతనికి అనేక ముఖాలు కనబడ్డాయి- ఇతర ముఖాలు, వరసగా అనేక ముఖాలు, ముఖాల నిరంతర ప్రవాహం- వందలు, వేలాది ముఖాలు, అన్నీ వచ్చి, మాయమౌతూ, అయినా, అన్నీ ఎప్పుడూ ఉన్నట్లు, అన్నీ నిరంతరంగా మార్పుచెందుతున్నాయి, పునర్నిర్మాణం అవుతున్నాయి, అయినా అన్నీ సిద్ధార్థనే! అతను ఒక చేప ముఖాన్ని చూశాడు; ఒక సొరచేప (కార్ప్)- బాధగా, తెరచిన విశాలమైన నోటితో, వాలిపోతున్న కన్నులతో, మరణించబోతున్న ఒక చేప. అతను అప్పుడే పుట్టిన పిల్లవాడిని ఒకడిని చూశాడు- ఎర్రగా, ముడతలు ముడతలుగా, ఏడ్చేందుకు సిద్ధపడుతున్నవాడిని, అతనొక హంతకుడి ముఖాన్ని చూశాడు- ఒక మనిషి శరీరంలోకి చాకును జొనుపుతూ; అదే సమయంలో అతనీ నేరస్తుడిని, మోకాళ్లపై కూర్చొని, బందీగా చూశాడు- అతని తలను ఒక తలారి నరికివేస్తుండగా చూశాడు. అతను వివిధ భంగిమల్లో రతిలో పరవశమొందుతున్న పురుషుల, స్త్రీల నగ్న శరీరాల్ని చూశాడు. శవాలు- పడుకోబెట్టబడి, కదలక-మెదలక, చల్లగా, ఖాళీగా పడిఉండటం చూశాడు. అతను జంతువుల తలలు చూశాడు- అడవి పందులు, మొసళ్లు, ఏనుగులు, దున్నపోతులు, పక్షుల ముఖాలను చూశాడు. కృష్ణుడిని, అగ్నిని చూశాడు. ఒకదానితో ఒకటి సహస్ర విధాలుగా ముడిపడిన రూపాలను, ముఖాలను అన్నింటినీ ఒకదానిని ఒకటి ప్రేమిస్తూ, స్వేషిస్తూ, సహాయం చేసుకుంటూ, నాశనమొందించుకుంటూ, తిరిగి నూతనంగా జన్మిస్తుండగా చూశాడు. ప్రతిదీ అంతమొందేందే, ప్రతిదీ క్షణికతకు ఒక ఉద్వేగపూర్ణమైన, బాధభరితమైన ఉదాహరణే. అయినప్పటికీ వాటిలో ఏదీ మృతిచెందటంలేదు. కేవలం రూపాంతరం చెందుతున్నాయి- ఎల్లప్పుడూ పునర్జన్మనొందుతున్నాయి; నిరంతరంగా నూత్నముఖాలతో భాసిస్తున్నాయి. ఒక ముఖానికీ, ఇంకొక ముఖానికీ మధ్య కేవలం కాలం నిల్చున్నది. ఈ రూపాలన్నీ, ఈ ముఖాలన్నీ విశ్రాంతిగా నిలిచాయి, ప్రవహించాయి, పునరుత్పత్తి చెందాయి, దాటిపోయాయి, ఒకదానితో ఒకటి కలిసిపోయాయి, వీటన్నింటిపైనా నిరంతరంగా ఎల్లప్పుడూ ఏదో పలుచని, అవాస్తవమైన, అయినా వ్యస్తమైన (అస్తిత్వంగల) పొర- పలుచని గాజుమాదిరి, మంచు మాదిరి పరచుకొని, ఏదో పారదర్శకమైన చర్మం మాదిరి, గవ్వ మాదిరి, ఏదో నీటి రూపం మాదిరి, నీటితో ఏర్పడిన తొడుగు మాదిరి- ఈ పొర గోవిందుడు ఆ క్షణంలో స్పృశించిన సిద్ధార్థుని నవ్వు ముఖమే. ఈ ముసుగులాంటి మందహాసం, ప్రవహిస్తున్న రూపాలపైన ఉన్న ఏకత్వపు ఈ చిరునవ్వు, అనంత జన్మ-మృత్యువులపై ఏకకాలికత్వపు చిరునవ్వు- సిద్ధార్థుని నవ్వు- ఇది ఖచ్చితంగా, తను ఆశ్చర్యాతిరేకంతో వందలాదిసార్లు వీక్షించిన ప్రశాంతమైన, సున్నితమైన, నిగూఢమైన, కొంచెం కరుణాపూర్ణంగా, కొంచెం ఎగతాళిగా, జ్ఞానపూర్ణంగా, సహస్ర రూపాలతో భాసించిన గౌతముని చిరునవ్వే! గోవిందునికి తెలుసు, పరిపూర్ణుడైన ఆ బుద్ధ భగవానుడు ఇలాగే నవ్వుతాడు.

కాలం ఉన్నదీ లేనిదీ తెలీక, ఈ తెరవీడింది ఒక క్షణమా, లేక వంద సంవత్సరాలా తెలీక, అక్కడ ఉన్నది సిద్ధార్థుడా, గౌతముడా, ఒక ఆత్మనా, ఇతరులా, తెలీని స్థితిలో అద్భుత ఆనందాన్నిచ్చిన దివ్యబాణంతో లోతుగా గాయపడినవాని మాదిరి గోవిందుడు అన్ని వర్తమాన, భూతభవిష్యత్ రూపాల నృత్యానికి వేదికగా నిల్చిన ఆ మోముపైన, తను అంతకు ముందే స్పృశించిన సిద్ధార్థుని చిరునవ్వు ముఖంపై, ఇంకొంతసేపు వంగి నిలిచాడు. ఆ ఉపరితలం నుండి సహస్ర రూపాల దర్పణం అదృశ్యమైన తరువాతకూడా సిద్దార్థుని రూపు (కౌంటెనెన్స్) మారకుండా అచలంగా నిలిచింది. అతడు ప్రశాంతంగా, మెల్లగా, బహుశ: చాలా ఎగతాళిగా, ఖచ్చితంగా ఆ పరిపూర్ణజ్ఞాని బుద్ధుడు నవ్వినట్లు- చిరునవ్వు నవ్వాడు.

గోవిందుడు వంగి నమస్కరించాడు. అతని ముసలి ముఖంపై అశృబిందువుల ప్రవాహం అనియంత్రితంగా సాగింది. అపారమైన ప్రేమ, అంతులేని వినమ్రతతో కూడిన ఆదరం అతన్ని ముప్పిరిగొన్నాయి. అతడు ఇంకా వంగాడు- అక్కడ నిశ్చలంగా కూర్చొన్న వ్యక్తిముందు సంపూర్ణంగా సాగిలపడ్డాడు. తను జీవితంలో ప్రేమించిన వాటికి అన్నింటికీ, తన జీవితంలో పవిత్రమూ, విలువకలదిగా ఉండిన వాటికి అన్నింటికీ ఆ చిరునవ్వు ఒక్కటీ ప్రాణం పోసింది.

(సమాప్తం)

changed April 23, 2008