కమల

ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది, సమ్మోహింపజేస్తోంది. ఈ మార్గంలో తను వేసే ప్రతి అడుగునుండీ సిద్ధార్థుడు ఏదో ఒక క్రొత్త విషయం నేర్చుకుంటున్నాడు. అడవులు, కొండలమీదుగా సూర్యుడు ఉదయించటం, దూరంగా తాటిచెట్ల ఒడ్డున అస్తమించటం అతడు చూశాడు. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు పరచుకొని ఉండటం కనిపించింది. నీలాకాశంలో పడవ మాదిరి తేలియాడే కొడవలి ఆకారంలోని చంద్రుడు కనిపించాడు. ఇప్పుడతను చెట్లను చూశాడు, నక్షత్రాలను, జంతువులను, మబ్బుల్ని, ఇంద్రధనుస్సుల్ని, రాళ్లను, పనికిరాని మొక్కల్ని, పువ్వులను, వాగుల్ని, నదుల్ని, ఉదయవేళల్లో పొదలమీద తళతళలాడే మంచు బిందువుల్ని, దూరంగా, నీలంగా, మసక మసకగా కనబడే కొండల్ని- అన్నిటినీ చూశాడు, అన్నీ కనబడుతున్నాయి. పక్షులు పాడుతున్నాయి, తేనెటీగలు ఝుమ్మని తిరుగుతున్నాయి, వరి చేల మీదుగా మెల్లని పిల్లగాలి వీస్తున్నది, సహస్ర విధాలైన రూపాలతో నానా వర్ణశోభితంగా ఇదంతా ఎప్పుడూ ఉండనే ఉన్నది- సూర్యుడు, చంద్రుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నారు, నదులు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉన్నై, తేనెటీగలు ఝుమ్మని నాదం చేస్తూనే ఉన్నై. కానీ ఇదివరకు సిద్ధార్థునికి ఇదంతా తన కళ్లముందున్న- భ్రాంతిగొల్పే- క్షణభంగురమైన పరదా మాదిరి కనబడేది: "ఈ ప్రపంచం నమ్మరానిది- ఆలోచనల్లోకికూడా దీన్ని రానివ్వరాదు; లక్ష్యపెట్టరాదు- ఎందుకంటే ఇది వాస్తవంకాదు. కనబడేదానికి అవతలివైపున వాస్తవం ఉన్నది."

కానీ ఇప్పుడు అతని చూపులు ఇవతల ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నాయి. కళ్లకు కనబడేదాన్నే అతనిప్పుడు చూస్తున్నాడు; గుర్తిస్తున్నాడు. ఈ ప్రపంచంలో తనకొక స్థానం కావాలనుకుంటున్నాడు. అతను ఇప్పుడు వాస్తవానికై "ప్రయత్నించటం" లేదు- అతని గమ్యం వేరే వైపున లేదు- ప్రపంచాన్ని ఈ విధంగా చూసినప్పుడు, ఇలా అప్రయత్నంగా, సరళంగా, పిల్లవానిమాదిరి చూసినప్పుడు, అది అందంగా తోస్తున్నది- చంద్రుడు, నక్షత్రాలు అందంగా ఉన్నాయి. వాగు, ఒడ్డు, అడవి, బండరాళ్లు, గొర్రెలు, బంగారు కాంతులీనే బీటిల్ పురుగు, పువ్వు, సీతాకోకచిలుక- అన్నీ సుందరంగా ఉన్నై. ఈ ప్రపంచాన్ని ఇలా, చిన్నపిల్లలమాదిరి, అంత మెలకువతో, ప్రస్తుతం గురించి అంత శ్రద్ధతో, ఎలాంటి అపనమ్మకమూ లేకుండా చూడగల్గటం అందంగాను, మధురంగాను ఉన్నది. ఒక్కొక్కచోట సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు; ఒక్కొక్కచోట అడవిలో చెట్లకింది నీడలో చల్లదనం ఉన్నది; వేరేచోట అరటి పండ్లు, గుమ్మడికాయలు ఉన్నాయి. రాత్రులు, పగళ్లు చిన్నవిగా ఉన్నై- సముద్రంలో తెరచాప పడవలో మాదిరి, ఆ తెరచాప క్రింద అపారమైన నిధులున్నట్లు, ప్రతిగంటా సంతోషంగా, తొందరగా గడచిపోతున్నది. అరణ్యం మధ్యలో ఒక కోతుల గుంపు కనబడింది- అవి ఎత్తైన కొమ్మలమీద ఊగుతూ తిరుగాడుతున్నాయి. సిద్ధార్థుడు వాటిని చూశాడు. సాయంత్రపు ఆకలితో కొరమీను ఒకటి, చిరుచేపల సరస్సులో వేటాడటం చూశాడు. ఆ చిన్న చిన్న చేపల గుంపులు తడి తడిగా మెరుస్తూ, టపటపా తోకలు అల్లాడిస్తూ దానినుండి దూరంగా పారిపోవటం చూశాడు. వాటిని అంతే తీవ్రంగా వెంటాడుతున్న కొరమీను చుట్టూ వేగంగా ప్రవహిస్తున్న నీటి గుండాలు బలాన్ని, కోరికను ప్రతిఫలిస్తున్నాయి.

తాను జేతవనంలో ఉండగా జరిగిన విషయాలన్నీ- గౌరవనీయుడైన బుద్ధునినుండి తానువిన్న బోధనలు, గోవిందుని వీడ్కోలు, బుద్ధభగవానునితో తాను జరిపిన సంభాషణ, అన్నీ- సిద్ధార్థునికి గుర్తుకు వచాయి. తాను భగవానునికి చెప్పిన ఒక్కొక్క మాట అతనికి గుర్తువచ్చింది- తనకు అప్పటికి ఇంకా తెలీని సంగతులనుకూడా తను చెప్పిన సంగతిని గుర్తించి సిద్ధార్థునికిప్పుడు ఆశ్చర్యం కలిగింది. తను బుద్ధునితో అన్న విషయం- "బుద్ధుని జ్ఞానం, ఆయన నిర్వాణం పొందిన క్షణంలో ఆయన అనుభూతిలోనికి వచ్చిన ఆ రహస్యం, ఆయన బోధనలలో ప్రతిఫలించే అవకాశం లేదు: అది వ్యక్తీకరణకు అందనిది, ఇతరులెవ్వరికీ అందింప వీలుకానిది, బోధింపరానిది" అని తానన్న సంగతే ఇప్పుడు తన అనుభూతిలోనికి రావటం మొదలౌతున్నది. తను సొంతంగా అనుభవం గడించవలసిందే. తనలోని ’తను’ ఆత్మనే, అని అతనికి చాలా కాలంగా తెలుసు, ’పరబ్రహ్మ తత్వమే ఆ ఆత్మ’ అని తనకు తెలుసు, కానీ తనకు ఆ ఆత్మ ఎన్నడూ కనబడలేదు- ఎందుకంటే దానిని ఆలోచనల వలలో ఇరికించి చేజిక్కించుకోవాలని తను ప్రయత్నించాడు. ఈ 'దేహం' ఖచ్చితంగా ఆత్మ కాదు- 'ఇంద్రియాల విన్యాసం' కూడా ఆత్మకాదు- 'ఆలోచనా' ఆత్మకాదు, 'అర్థం చేసుకోవటం' కూడా ఆత్మకాదు. ఇప్పటికే ఉన్న ఆలోచనలనుండి కొత్త ఆలోచనల్ని అల్లేందుకు, వాటినుండి వేరే ఏవో నిష్కర్షలు రాబట్టేందుకు పనికివచ్చే విజ్ఞానం- 'శృతప్రజ్ఞ' కూడా ఆత్మ కాదు. ఈ ఆలోచనా ప్రపంచంకూడా ఇటువైపున ఉన్నదే. జీవాత్మ యొక్క ఇంద్రియజ్ఞానాన్ని నాశనం చేసినా, దానికి ఆలోచనల్ని, సంచిత పాండిత్యాన్నీ సరఫరా చేస్తుంటే అది గమ్యానికి చేర్చజాలదు. ఆలోచనలు, ఇంద్రియాలు కూడా చాలా సూక్ష్మమైన అంశాలు- ఈ రెండింటి వెనకా పరమార్థం దాక్కొని ఉన్నది; అందువల్ల ఈ రెండింటినీ వినటం శ్రేయోదాయకం; ఈ రెండింటితోనూ ఆడుకోవటం అవసరం; వీటిలో ఏ ఒక్కదాన్నిగానీ అసహ్యించుకోవటంగానీ, అతిగా ప్రేమించటంగానీ కాదు- ఈ రెండు గొంతులనూ శ్రద్ధగా వినటం అవసరం. ఈ అంతరాత్మ ప్రబోధం నిర్దేశించిన ప్రకారమే తను కృషి చేయనున్నాడు, ఈ అంతరాత్మ సూచించిన స్థలాలలో తప్ప తను ఆగడు. గౌతముడు తనకు బోధి లభించిన సమయంలో, ఆ ఘడియలో- బోధి వృక్షం క్రింద ఎందుకు కూర్చున్నాడు? ఆయన ఈ నిర్దేశాన్ని విన్నాడు- తన హృదయపు లోతుల్లోంచి వచ్చిన నిర్దేశం- ఈ వృక్షం క్రింద సేద తీరమన్నది- అందువల్ల ఆయన ఇక దేహాన్ని కష్టపెట్టే పనులు, యజ్ఞాలు, తీర్థస్థానాలు, పూజలు, తినటం, త్రాగటం, నిద్రపోవటం, కలలు కనటం చేయలేదు- ఆ అంత:స్వరం చెప్పినట్లు చేశాడు. బాహ్య ప్రపంచపు ఏ నిర్దేశానికీ తలవంచకపోవటానికి కారణం, కేవలం ఈ స్వరమే- దానికి సిద్ధపడటం- ఇదే మంచిది; ఇదే అవసరం- ఇది తప్ప వేరే ఏదీ అవసరం లేదు.

అ రోజు రాత్రి ఒక పడవ సరంగు పూరి గుడిశలో పడుకున్నాడు సిద్ధార్థుడు. ఆ సమయంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో తనకు ఎదురుగా గోవిందుడు నిలబడి ఉన్నాడు- భిక్షువులు ధరించే పసుపుపచ్చ వస్త్రాలలో. గోవిందుడు బాధ పడుతున్నాడు- "నన్నెందుకు వదిలేశావు?" అని అడుగుతున్నాడు. అప్పుడు తను గోవిందుడిని కౌగలించుకున్నాడు, అతని చుట్టూ చేయి వేశాడు, అతనిని తన గుండెకు హత్తుకొని ముద్దు పెట్టుకునేసరికి, అతడు ఇక గోవిందుడు కాడు, ఎవరో స్త్రీ. ఆమె వస్త్రాలనుండి పాలతో నిండిన రొమ్ము ఒకటి బయల్పడింది, సిద్ధార్థుడక్కడ పడుకొని, ఆ రొమ్మునుండి తియ్యని పాలు, చాలా రుచిగల పాలను త్రాగాడు. ఆ రుచిలో స్త్రీ- పురుషులు, సూర్యుడు-అడవి, జంతువు-పువ్వు, అన్ని రకాల పండ్లు, అన్ని సుఖాలూ ఉన్నాయి. ఆ రుచి అతనికి మత్తెక్కించింది. సిద్ధార్థుడు మేల్కొనే సరికి, గుడిశ ముందునుండి వివర్ణమైన నది ప్రవహిస్తున్నది, అడవిలోంచి గంభీరమైన, స్పష్టమైన గొంతుకతో ఒక గుడ్లగూబ అరుపు వినవస్తున్నది.

తెల్లవారగానే సిద్ధార్థుడు తనకు ఆశ్రయం ఇచ్చిన నావికుడిని అడిగాడు, తనను నది దాటించమని. తన వెదురు బల్లకట్టునుండి, ఒక తెప్పలో ఆ సరంగు అతనిని నది దాటించాడు. ఉదయ కిరణాలలో వెడల్పుగా పరచుకొని ఉన్న నీటిపొర, లేత గులాబీ రంగులో తళతళలాడింది.

"చాలా అందంగా ఉంది, ఈ నది" అన్నాడు సిద్ధార్థుడు తన సహచరునితో.

"అవును" అన్నాడు సరంగు: "చాలా అందమైన నది ఇది. నాకు అన్నిటికంటే ఈ నది ఎక్కువ ఇష్టం. నేను చాలాసార్లు దీన్ని వింటాను, దీనికేసే చూస్తూ ఉండిపోతాను, నేను ఎప్పుడూ దీనినుండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. నదినుండి మనం చాలా నేర్చుకోవచ్చు."

అవతలి ఒడ్డుకు చేరాక సిద్ధార్థుడు అతనికి ధన్యవాదాలు చెప్పాడు: "ధన్యవాదాలు, మహాశయ. నీకిచ్చేందుకు నా దగ్గర బహుమానం గానీ, డబ్బుగానీ ఏదీలేదు. నేను నిరాశ్రయుడిని, బ్రాహ్మణకుమారుడిని, శ్రమణుడిని."

"నాకు తెలుసు ముందుగానే" అన్నాదు పడవ సరంగు. "నేను నీనుండి ఏ బహుమానాన్నిగానీ, ధనాన్నిగానీ ఆశించలేదు. మళ్లీ ఎప్పుడో చెల్లిస్తావులే వాటిని, నువ్వు- నాకు!"

"నీకు అలా అనిపిస్తోందా?" అన్నాడు సిద్ధార్థుడు ఉత్సాహంగా.

"ఖచ్చితంగా. నేను నది నుండికూడా అదే నేర్చుకున్నాను- అన్నీ తిరిగి వస్తాయి, నువ్వుకూడా, శ్రమణుడా, తిరిగివస్తావు. ఇప్పటికి మాత్రం, మరి, వీడ్కోలు. నీ స్నేహమే నువ్వు నాకిచ్చే ప్రతిఫలమగుగాక! నువ్వు దేవతలకోసం యజ్ఞం చేసేటప్పుడు నన్ను గుర్తుచేసుకొందువుగాక!"

వారిరువురూ విడిపోయారు చిరునవ్వుతో. పడవ సరంగు స్నేహతత్వం సిద్ధార్థుడికి నచ్చింది. అతను సంతోషంగా అనుకున్నాడు- "ఇతను గోవిందునిలాంటివాడు- నాకు మార్గంలో కలిసేవాళ్లందరూ గోవిందునిలాంటివారే. అందరూ నాపట్ల కృతజ్ఞతతో ఉంటారు- కానీ నిజానికి వాళ్లకే నేను ధన్యవాదాలు అర్పించాల్సి ఉన్నది. అందరూ ఇతరులెవరికైనా లోబడి ఉండాలనుకుంటారు, అందరూ నాకు స్నేహితులౌదామనుకుంటారు, విధేయులుగా ఉందామనీ, ఆలోచించకుండా ఉందామనీ అనుకుంటారు- ప్రజలంతా పిల్లలే."

మధ్యాహ్న సమయానికి అతనొక గ్రామాన్ని దాటుకొని వెళ్లాడు. మట్టి గుడిశలముందు సందులో- పిల్లలు గంతులువేస్తున్నారు. గులకరాళ్ళతోటీ, గవ్వలతోటీ ఆడుకుంటున్నారు. అరచుకుంటూ, ఒకళ్లమీద ఒకళ్లు కలబడి యుద్ధం చేసుకుంటున్నారు. కానీ వింత శ్రమణుడు కనబడగానే సిగ్గుతో దూరంగా పారిపోయారు. గ్రామపు అవతలి చివరన ఒక వాగు పక్కగా పెళ్తున్నది దారి. ఆ వాగు అంచున ఒక పడుచుపిల్ల కూర్చొని బట్టలు ఉతుకుతున్నది. సిద్ధార్థుడు ఆమెను పలకరించగానే, ఆమె తలెత్తి, అతనికేసి చూసి, చిరునవ్వు నవ్వింది. నవ్వులో ఆమె కళ్లు మెరవటం సిద్ధార్థుడు గమనించాడు. బాటసారుల విధిని అనుసరించి అతడు ఆశీర్వాద సూచకంగా స్వస్తి వాచకాలు పలికి, 'అవతల ఉన్న పెద్ద పట్టణం ఇంకా ఎంత దూరంలో ఉన్నదో' అడిగాడామెను. ఆ యువతి లేచి అతని వద్దకు వచ్చింది. యౌవనం ఉట్టిపడే ఆమె ముఖంలో తడి ఆరని పెదవులు మెరుస్తున్నాయి. ఆమె అతనితో అవీ ఇవీ మాట్లాడింది, అతని భోజనం అయ్యిందేమో అడిగింది, శ్రమణులను గురించిన వివరాలు అడిగింది. "శ్రమణులు ఒంటరిగా రాత్రిపూట అరణ్యాలలో నిద్రిస్తారట. వారితోబాటు ఆడవాళ్లను ఉంచుకోరట- నిజమేనా?" అని అడిగింది. ఆపైన ఆమె తన ఎడమ పాదాన్ని అతని కుడి పాదంపై రాస్తూ, శాస్త్రాలు ’వృక్షారోహణం’గా వర్ణించిన విధానంలో, మగవాడిని కామకేళికి పిలిచే యువతి మాదిరి, సంకేతాలతో అతనిని ఆహ్వానించింది. సిద్ధార్థుని రక్తం వేడెక్కింది. ఆ క్షణాన అతనికి తన కల గుర్తుకు వచ్చింది. అతడు ఆ యువతివైపుకు వంగి, గోధుమరంగులోని ఆమె చనుమొనను ముద్దు పెట్టుకున్నాడు. పైకి చూసిన అతనికి, చిరునవ్వుతో వికసించిన ఆ యువతి ముఖం: నిండా కోరికతో, సగం మూసిన ఆమె కనులు ఉద్రేకంతో ప్రాధేయపడుతుండటం కనిపించింది. సిద్ధార్థునిలో కూడా ఒక ఉద్వేగం, లైంగికపరమైన కదలికలు కలిగాయి. అతని చేతులు ఆమెను చుట్టేసేందుకు సిద్ధపడ్డాయి, కానీ అతడు ఎపుడూ స్త్రీని ముట్టుకొని ఉండలేదు కనుక, ఒక్క క్షణం పాటు తటపటాయించాడు.

ఆ క్షణంలో అతడు తన అంతరాత్మ ప్రబోధాన్ని విన్నాడు- "వద్దు" అని అరిచింది ఆ స్వరం. దానితో ఆ పడుచుపిల్ల నవ్వు ముఖంలోని ఇంద్రజాలం చెదిరిపోయింది. ఆ స్థానంలో ఇప్పుడు ఉద్రేకంతో కూడుకున్న యువతి తదేకంగా చూసే చూపు మాత్రం కనబడుతున్నది. అతడు ఆమె బుగ్గను సున్నితంగా నిమిరి, నిరాశ చెందిన ఆ యువతినుండి దూరంగా, వెదురు పొదల అరణ్యంలోకి వెళ్లిపోయాడు.

ఆరోజు సాయంత్రానికి ముందుగానే అతనొక పెద్ద పట్టణం చేరుకున్నాడు. ప్రజలతో కలిసి ఉండాలనుకుంటున్నాదు కనుక అతనికి ఇప్పుడు ఆ పట్టణం నచ్చింది. అతడు చాలా కాలంగా అడవులలోనే ఉంటూ వచ్చాడు; గడచిన రాత్రి అతను పడుకున్న సరంగు గుడిశ చాలా కాలం తరువాత తనకు ఆశ్రయమిచ్చిన మొదటి కప్పు.

పట్టణం బయటగా, కంచెలేని ఒక ఆందమైన తోట ప్రక్కగా, బుట్టలు పట్టుకున్న పురుష-స్త్రీ పరిచారకుల వరుస ఒకటి ఈ సంచారికి ఎదురైంది. వారి మధ్యలో, నలుగురు బోయీలు మోసే పల్లకీ( మేనా) లో ఒక స్త్రీ- వారి యజమానురాలు- రంగుల ఛత్రం క్రింద, ఎర్రటి మఖ్మల్ మెత్తలమీద కూర్చుని వెళ్తున్నది. ఆ తోట ముఖద్వారం వద్ద కదలకుండా నిలబడి సిద్ధార్థుడు ఆ ఊరేగింపును చూశాడు. పరిచారకులను, పరిచారికలను. బుట్టలను, ఆ మేనాను, అందులోని స్త్రీని చూశాడు. (వదలిన) నల్లటి కేశాల వెనక మెరుస్తూ ముగ్ధమనోహరంగా ఉన్న ఆమె వదనాన్ని, తెలివి ఉట్టిపడే ఆమె ముఖాన్ని, అప్పుడే కోసిన అత్తిపండు (ఫిగ్) మాదిరి ఎర్రని కాంతులీనుతున్న ఆమె నోటిని, ధనుస్సులా కళాత్మకంగా వంగిన ఆమె కనుబొమ్మలను, చురుకుదనంతో అవలోకించే నల్లని కళ్లను, ఆమె ధరించిన బంగారు, ఆకుపచ్చ రంగు చీరకు పైన అనాచ్ఛాదితంగా ఉన్న సన్నని మెడను అతడు చూశాడు. ఆమె చేతులు దృఢంగా, నునుపుగా, సన్నగా, పొడవుగా ఉన్నాయి. వెడల్పాటి బంగారుగాజులు ఆమె మణికట్టును అలంకరించి ఉన్నాయి.

ఆమె అందాన్ని చూసిన సిద్ధార్థునికి హృదయం పులకరించింది. మేనా అతనికి దగ్గరగా వెళ్తున్నప్పుదు అతను వంగి అభివాదనం చేసి, వెంటనే పైకి లేస్తూ, కాంతులీనుతున్న ఆ జవ్వని వదనాన్ని పరికించాడు. ఒక్క క్షణంపాటు చురుకైన ఆమె కళ్లలోకి చూశాడు, తనకు తెలీని సుగంధ ద్రవ్యపు పరిమళం దేన్నో ఆ క్షణంలో ఆఘ్రాణించాడు. ఒక్క క్షణంలో అందమైన ఆయువతి తలపంకించి చిరునవ్వు చిందించింది- మరుక్షణంలో పరిచారికలతోసహా ఆ వనం లోకి వెళ్ళి అదృశ్యమైంది.

"అంటే నేను ఈ పట్టణంలోకి శుభ ఘడియల్లో ప్రవేశించానన్నమాట! అనుకున్నాదు సిద్ధార్థుడు. వెంటనే ఆ వనంలోకి వెళ్లాలని అతనికి బలంగా అనిపించింది, కానీ కొంచెం ఆలోచించినమీదట, అతనికి ఆ ప్రవేశద్వారం వద్ద పరిచారకులు తనను చూసిన చూపులతీరు- ఎంత అసహ్యించుకుంటూ, ఎంత అపనమ్మకంతో, ఎంత తిరస్కారభావంతో ఉన్నదో గుర్తుకు వచ్చి ఆగాడు.

"నేను ఇంకా శ్రమణుడినే, ఇంకా సన్యాసినే, భిక్షగాడినే,"అనుకున్నాడతను. "నేనిక ఇలా ఉండటం కుదరదు. నేను తోటను ఇలా ప్రవేశించకూడదు-" అనుకున్నపుడు అతనికి నవ్వు వచ్చింది.

ఆ తోట పరిసరాలలో తనకు ఎదురైనవారిని అడిగి అతడు సత్వరమే ఆ తోటపేరు, ఆ యువతిపేరు, తెలుసుకున్నాడు. ఆ తోట కమలది. ఆమె పేరొందిన ఒక వేశ్య. ఆమెకు ఈ తోట మాత్రమేకాక పట్టణంలో ఇంకొక భవంతి ఉన్నది.

ఆ తరువాత అతడు పట్టణంలోకి ప్రవేశించాడు. అతని లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో అతడు పట్టణమంతా పరిశీలించాడు, అడ్డదిడ్డంగా ఉండే వీధులన్నిటా తిరిగాడు, కొన్నిచోట్ల నిశ్చలంగా నిలబడ్డాడు, నదివద్దగల రాతి మెట్లమీద విశ్రాంతి తీసుకున్నాడు.

సాయంత్రంగా అతను క్షురకుని సేవకుడు ఒకనితో పరిచయం పెంచుకున్నాడు. అతడు వీధిపైన ఒక కమాను నీడలో పనిచేస్తుండటం సిద్ధార్థుడు గమనించాడు. విష్ణుమూర్తి మందిరంలో పూజా సమయంలో అతనిని మళ్లీ కలిసి, అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ల కధలను వినిపించాడు. ఆ రాత్రికి నదిలో పడవల మధ్యన పడుకొని, మరుసటిరోజు ఉదయాన్నే, అతని మొదటి గిరాకీలు కూడా ఇంకా రాకుండానే ఆ క్షురకుని సేవకునిచేత గడ్డం తీయించుకున్నాడు. అలాగే తన తలకు చక్కని నూనె పట్టించి, తల దువ్వించుకున్నాడు. ఆ పైన నదిలో స్నానానికి వెళ్లాడు.

ఆ రోజు సాయంత్రం అవ్వబోతుండగా, సౌందర్యవతి కమల తన తోటవద్దకు మేనాలో వస్తున్నప్పుడు సిద్ధార్థుదు ఆ తోటద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. అతడు వంగి అభివాదనం చేసి, ప్రతిగా ఆమె అభివాదాన్ని స్వీకరించాడు. ఆ ఊరేగింపులో అందరికంటే చివరన వెళ్తున్న పరిచారకుడిని పిలిచి, ఒక యువ బ్రాహ్మణుడు ఆమెతో మాట్లాడేందుకు వచ్చాడని తమ యజమానురాలితో విన్నవించమన్నాడు. కొంతసేపటి తరువాత ఆ సేవకుడు తిరిగి వచ్చి, సిద్ధార్థుని తనతో పాటు రమ్మని, అతనిని నిశ్శబ్దంగా ఒక పందిరి క్రిందకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ కమల ఒక శయ్యపై పవళించి ఉన్నది. సిద్ధార్థుని అక్కడ వదలి పరిచారకుడు నిష్క్రమించాడు.

"నిన్న నువ్వు బయట నిలబడి నాకు అభివాదనం చేశావు కదూ?" అడిగింది కమల.

"అవును. నేను నిన్న నిన్ను చూశాను, నీకు అభివాదనం చేశాను."

"కానీ నిన్న నీకు గడ్డం, పొడవాటి జుట్టు ఉన్నై. నీ తలంతా దుమ్ముకొట్టుకొని ఉన్నది కదూ?"

"నువ్వు బాగా గమనించావు, నువ్వు అంతా చూశావు. నువ్వు బ్రాహ్మణకుమారుడైన సిద్ధార్థుడిని, శ్రమణుడిగా ఉన్న సిద్ధార్థుడిని చూశావు. అయితే నేను ఇప్పుడు ఆ మార్గాన్ని వదిలిపెట్టి, ఈ పట్టణం చేరుకున్నాను. నేనింకా పట్టణంలోకి అడుగుపెట్టకుండానె కలిసిన మొదటి వ్యక్తివి నువ్వు. ఓ కమలా! సిద్ధార్థుడు కనులెత్తి మాట్లాడిన మొదటి స్త్రీవి నువ్వే. అందమైన స్త్రీని ఎవరిని కలిసినా నేనిక కనులు దించను."

కమల చిరునవ్వు నవ్వి తన నెమలిఈకల విసనకర్రతో ఆడుకున్నది. "సిద్ధార్థుడు ఈ సంగతి చెప్పేందుకేనా, నన్ను కలిసింది?" అని అడిగింది.

"నేను నీకు ఈ సంగతి చెప్పేందుకు, ఇంకా నువ్వు ఇంత అందంగా ఉన్నందుకు నిన్ను అభినందించేందుకు (ధన్యవాదాలు చెప్పేందుకు ?) వచ్చాను. నీకు అభ్యంతరం లేకపోతే, కమలా! నిన్ను నాకు స్నేహితురాలుగాను, బోధకురాలుగాను ( గురువుగాను) ఉండమని అభ్యర్ధించదలచాను- ఏమంటే, నువ్వు అధ్భుత ప్రజ్ఞ సాధించిన ఆ కళ నాకు ఎంత మాత్రమూ తెలీదు."

కమల ఈ మాటలు విని పెద్దగా నవ్వింది.

"అరణ్యాలనుండి (ముక్కు మొఖం తెలీని ) శ్రమణుడెవరో వచ్చి నానుండి విద్య నేర్చుకోవాలని కోరటం ఏనాడూ నా అనుభవంలోకి రాలేదు. పొడవాటి జుట్టు, చినిగిన పాత గోచీ ధరించిన శ్రమణుడెవ్వరూ ఏనాడూ నా దగ్గరకు రాలేదు. చాలామంది యువకులు నావద్దకు వస్తుంటారు- బ్రాహ్మణపుత్రులతో సహా- కానీ వారందరూ నాదగ్గరకు విలువైన వస్త్రాలను ధరించి, చక్కని మేజోళ్లు ధరించి, సువాసనలూరే కేశాలతో, జేబుల్లో డబ్బుతో వస్తారు. ఓ శ్రమణుడా, ఈ యువకులందరూ నాదగ్గరకు ఆవిధంగా వస్తుంటారు."

సిద్ధార్థుడన్నాడు:" నేను ఇప్పటికే నీ నుండి నేర్చుకోవటం మొదలుపెట్టాను. నిన్నకూడా నీనుండి కొన్ని సంగతులు నేర్చుకున్నాను. ఇప్పటికే నా గడ్డం తీసివేశాను, నాజుట్టుకు నూనె రాసుకొని దువ్వుకున్నాను. ఇంక లేనివి ఏమన్ని ఎక్కువలేవు, ఓ స్త్రీ రత్నమా! కావలసినవల్లా విలువైన వస్త్రాలు, చక్కని మేజోళ్లు, జేబులో డబ్బు మాత్రమే. సిద్ధార్థుదు గతంలో ఇలాంటి అల్ప విషయాలకంటే చాలా కష్టమైనవాటినే సాధించాలని నిశ్చయించుకొని, వాటిని సాధించాడు. నేను నిన్న సాధించ నిశ్చయించినదానిని- నీ స్నేహం పొంది, నీనుండి ప్రేమ సుఖాలను నేర్చుకోవటం- మాత్రం ఎందుకు సాధించలేకపోతాను? నేను నీకు తగిన శిష్యుడినని నువ్వే చూస్తావు, కమలా. నువ్వు నాకు నేర్పవలసినవాటికంటే చాలా కష్టమైనవాటినే నేను నేర్చుకున్నాను. అయితే సిద్ధార్థుడు ఇప్పుడు ఉన్నవాడు ఉన్నట్లుగానైతే నీకు పనికిరాడన్నమాట- తలలో నూనెతో; కానీ వస్త్రాలు లేకుండా, మేజోళ్లు లేకుండా, డబ్బులేకుండా!"

కమల నవ్వింది. ఇలా అన్నది: " ఉహు. లేదు. అతను ఇంకా పనికిరాడు. అతనికి వస్త్రాలుండాలి- విలువైన వస్త్రాలు. మేజోళ్లుండాలి- చక్కని మేజోళ్లు, తనజేబులో చాలా డబ్బు, కమలకిచ్చేందుకు బహుమానాలు ఉండాల్సిందే. అరణ్యాలనుండి వచ్చిన శ్రమణుడా, నీకు ఇప్పుడు తెల్సిందా, నీకు అర్థమైందా?"

"నాకు బాగా అర్థమైంది" అన్నాడు సిద్ధార్థుడు గట్టిగా. "ఇటువంటి అందమైన నోటినుండి వచ్చిన విషయాన్ని నేను అర్థం చేసుకోకుండా ఎలా ఉండగలను? నీ నోరు ఇప్పుడే కోసిన అత్తిపండు మాదిరి ఉన్నది, కమలా! నా పెదిమలు కూడా కొత్తగా, ఎర్రగా ఉన్నాయి, అవి నీ పెదిమలలో చక్కగా సరిపోతాయి, నువ్వే చూస్తావు ఆ సంగతి. కానీ ఓ అందమైన కమలా, నీనుండి ప్రేమపాఠాలు నేర్చేందుకు అడవులనుండి వచ్చిన ఈ శ్రమణుడంటే నీకు ఏమాత్రం భయం వేయటం లేదా?"

"ఒక శ్రమణుడిని చూసి- అడవినుండి వచ్చిన ఒక వెర్రి (స్టుపిడ్) శ్రమణుడిని చూసి, తోడేళ్ల మధ్యనుండి వచ్చినవాడిని చూసిమ్ స్త్రీలగురించి ఏ మాత్రమూ తెలీని వాడిని చూసి నేనెందుకు భయపడాలి?" "శ్రమణుడు బలంగా ఉంటాడు, దేనికీ భయపడడు. అందమైన ఓ యువతీ, అతడు నిన్ను బలవంతం చేయవచ్చు, నిన్ను దోచుకోవచ్చు, నిన్ను గాయపరచవచ్చు."

"లేదు, శ్రమణా! నాకు ఆ భయంలేదు. వేరేవాళ్లెవరో వచ్చి తమను కొట్టి, తమ పవిత్రతను, లోతుగా ఆలోచించగల తమ శక్తిని, తమ జ్ఞానాన్ని దోచుకొని పోతారని ఎవరైనా శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు భయపడతారా? లేదు. ఎందుకంటే అవి తమకే చెందుతాయి, తాను వాటినుండి తనకు ఇష్టమైనవాటిని మాత్రమే, ఇష్టపడితే మాత్రమే ఏమన్నా- వారికి ఇవ్వగలడు. ప్రేమసుఖాలపరంగా కమల కూడా ఖచ్చితంగా అలాంటిదే. కమల అధరాలు సుందరమైనవి, ఎర్రనివిన్నీ. కానీ కమల కోరికకు వ్యతిరేకంగా వాటిని ముద్దులాడి చూడు, వాటినుండి ఏ కొంచెం మధురత్వమూ నీకు అందదు- వాటికి అమృతాన్నందించటం తెలిసినాకూడానూ. నువ్వు తగిన శిష్యుడివి, సిద్ధార్థా, అందువల్ల ఈ సంగతినీ నేర్చుకో. ఎవరైనా, వీధుల్లో కూడానూ- ప్రేమను అడుక్కోవచ్చు, కొనుక్కోవచ్చు, కనుగొనవచ్చు, బహుమానంగా పొందవచ్చు, కానీ దాన్ని దోచుకోవటం (దొందిలించటం) మాత్రం ఎన్నడూ సాధ్యం కాదు. నువ్వు ఇదంతా తప్పుగా అర్థం చేసుకున్నావు అసలు. అవును, నీలాంటి చక్కని యువకుడు ఇదంతా అంత తప్పుగా అర్థం చేసుకోవటం దయనీయం."

సిద్ధార్థుడు వంగి అభివాదనం చేస్తూ చిరునవ్వు నవ్వాడు: " నువ్వు సరిగ్గా చెప్పావు, కమలా! దయనీయమే. నిజంగా చాలా దయనీయం. లేదు, నీ అధరామృతపు తియ్యదనం ఏ కొంచెమూ తగ్గరాదు- నాది కూడా. అందువల్ల తన వద్ద లేనివి - వస్త్రాలు, మేజోళ్లు, డబ్బు- వచ్చాక సిద్ధార్థుడు మళ్లీ వస్తాడు. కానీ చెప్పు, అందమైన ఓ కమలా, నువ్వు నాకు కొంచెం సలహా ఎదైనా ఇవ్వరాదా?"

"సలహానా? ఎందుకివ్వను? అడవిలో తోడేళ్ల మధ్యనుండి వచ్చిన అమాయకపు శ్రమణుడికి ఎవరైనా ఒక సలహా ఎందుకివ్వకూడదు?"

"ప్రియమైన కమలా! ఈ వస్తువులను వీలైనంత త్వరగా సంపాదించేందుకు నేను ఎక్కడికి వెళ్లను?"

"చాలామంది ఆ సంగతినే తెలుసుకోవాలనుకుంటారు, మిత్రమా. నీకు వచ్చిన పని దేన్నైనా చేసి (నువ్వు నేర్చుకున్న దాన్ని చేసి) దాని ద్వారా డబ్బు, వస్త్రాలు, మేజోళ్లు సంపాదించాలి. పేదవాడు డబ్బు సంపాదించేందుకు వెరే మార్గం లేదు."

"నేను ఆలోచించగలను, నేను వేచిఉండగలను, నీను ఉపవాసం ఉండగలను."

"అంతేనా?"

"అంతే. ఓ, ఇంకా ఉంది, నేను కవిత్వం చెప్పగలను. నేనొక కవిత చెప్తే నువ్వు నాకొక ముద్దు ఇస్తావా?"

"నీకవిత నాకు నచ్చితే ఇస్తాను. ఆ కవిత పేరేంటి?"

ఒక క్షణం ఆలోచించి సిద్ధార్థుడు ఈ కవిత చెప్పాడు:

"తన తోటలోకి వెళ్ళింది అందమైన కమల
తోటతలుపు వద్ద నిలిచాడు శ్యామవర్ణపు శ్రమణుడు
నడిచే కమలాన్ని చూసిన అతడు
చక్కగా వంగి అభివాదనం చేశాడు
చిరునవ్వుతో స్వీకరించింది కమల
దేవతల కోసం యజ్ఞాలు చేసేకంటే
కమలకోసం తపించటం మంచిదేమో
అనుకున్నాడు యువకుడైన శ్రమణుడు."

కమల గట్టిగా చప్పట్లు కొడితే, ఆమె చేతికున్న బంగారు గాజులు గలగలలాడాయి.

"నీ కవిత చాలా బాగుంది, శ్యామవర్ణపు శ్రమణా! నిజంగానే దీనికోసం ఒక ముద్దు ఇస్తే నాకేమీ నష్టం లేదు."

ఆమె తన కళ్లతోనే అతనిని తన దగ్గరగా లాక్కున్నది. అతడు తన ముఖాన్ని ఆమె ముఖంపై, తన పెదిమల్ని

అప్పుడే కోసిన అత్తిపండువంటి ఆమె పెదిమలపై పెట్టాడు. కమల అతనిని గాఢంగా ముద్దు పెట్టుకున్నది. ఆమె తనకెంత నేర్పిందో, ఆమె ఎంత తెలివైనదో, ఎలా తనను లోబరచుకొన్నదో, తనని ఎలా నిరోధించిందో, తననెలా మురిపించిందో, గాఢమైన ఈ ముద్దు తరువాత, చాలా సేపు కొనసాగిన ఈ ముద్దు తరువాత, అనేక ముద్దుల పరంపర, అనీ ఒకదానికొకటి భిన్నంగా- ఎలా తనకోసం ఎదురుచూస్తున్నవో- ఆ అనుభూతిలో గ్రహించిన సిద్ధార్థునిలో ఉద్రేకం చెలరేగింది. అతడు బరువుగా ఊపిరిపీలుస్తూ నిశ్చలంగా నిలబడిపోయాడు. ఆ క్షణంలో అతడు తన కళ్లకెదురుగా వికసించిన విజ్ఞానం, విద్యలయొక్క సంపూర్ణత్వాన్ని గ్రహించి నిశ్చేష్టుడైపోయిన పిల్లవాని మాదిరి ఉన్నాడు.

"నీ కవిత్వం చాలా బాగున్నది" అన్నది కమల. "బాగా ధనవంతురాలినైతే, నేను నీకు ఆ కవిత్వానికి డబ్బు ఇచ్చి ఉండేదాన్ని. కానీ నీకు కావలసిన డబ్బును కవిత్వంద్వారా సంపాదించటం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు కమలతో స్నేహంచెయ్యాలంటే నీకు చాలా డబ్బు కావాలి."

"నువ్వెంత బాగా ముద్దు పెట్టగలవు, కమలా! "అన్నాడు సిద్ధార్థుడు ఇంకా తడబడుతూ.

"అవును. నాకు తెలుసు. అందుకనే నాకు వస్త్రాలకుగానీ, మేజోళ్లకుగానీ, గాజులకు, అన్నిరకాలైన అందమైన వస్తువులకుగాని కొరత లేదు. కానీ నువ్వు ఏం చేయగలవు? ఆలోచించటం, ఉపవాసం ఉండటం, కవిత్వం చెప్పటం కాకుండా మరింకేమీ చెయ్యలేవా, నువ్వు?"

"నాకు యజ్ఞగీతాలు పాడటం వచ్చు." అన్నాడు సిద్ధార్థుడు. "కానీ నేను వాటిని పాడను. నాకు ఆవాహన మంత్రాలు కూడా వచ్చు, కానీ ఇక నేను వాటిని పలుకను. నేను శాస్త్రాలు చదివాను- "

"ఆగాగు-" అడ్డువచ్చింది కమల- "నీకు రాయటం, చదవటం వచ్చు."

"చక్కగా వచ్చు. చాలామందికి వచ్చు, ఆ పని."

"చాలా మందికి కాదు- నాకు రాదు. నీకు చదవటం, రాయటం వచ్చనేది చాలా మంచి విషయం. చాలా మంచిది. నీకు మంత్రాలు కూడా ఉపయోగపడవచ్చు!"

ఆ క్షణాన ఒక పరిచారకుడు వచ్చి యజమానురాలి చెవిలో ఏదో చెప్పాడు.

"నాకోసం ఎవరో వచ్చారు-" అన్నది కమల-"త్వరగా, వెంటనే వెళ్లిపో, సిద్ధార్థా, నిన్నెవ్వరూ ఇక్కడ చూడకూడదు. నేను నిన్ను మళ్లీ రేపు కలుస్తాను."

కానీ ఆమె ఈ పవిత్ర బ్రాహ్మణుడికి ఒక తెల్లని వస్త్రం ఇవ్వమని పరిచారకుడిని ఆజ్ఞాపించింది. అసలేమౌతున్నదీ ఇంకా అర్థం కాకుండానే సిద్ధార్థుడు హడావిడిగా పరిచారకునిచేత తన వెంట తీసుకొని పోబడ్డాడు, చుట్టు తిరిగిన, మలుపుల దారిలో ఒక కుటీరంలోకి గొనిపోబడ్డాడు, తెల్లని వస్త్రం (గౌను, అంగరఖా)చే బహూకరింపబడ్డాడు, ఎవ్వరికీ కనబడకుండా, వీలైనంత త్వరగా ఆ వనాన్ని వదిలి వెళ్లమన్న స్పష్టమైన సూచనలతో పొదల్లో వదలివేయబడ్డాడు.

సిద్ధార్థుడు తృప్తిగా తనను చేయమన్న పని చేశాడు. అరణ్య సంచారానికి అలవాటు పడ్డవాడే కనుక అతను నిశ్శబ్దంగా వనం నుండి, పొదలమీదుగా, అవతలకు చేరుకున్నాడు. చుట్టచుట్టిన తన ధవళ వస్త్రాన్ని చంకకింద పెట్టుకొని నగరానికి తిరిగి వచ్చాడు. యాత్రికులు కలిసే ఒక సత్రం వాకిట నిలబడి నిశ్శబ్దంగా ఆహారం అడుక్కున్నాడు. వాళ్లిచ్చిన అన్నపు ముద్దను నిశ్శబ్దంగా స్వీకరించాడు. "బహుశ: రేపు, నాకిక ఆహారం అడుక్కునే అవసరం ఉండదు" అనుకున్నాడు.

అకస్మాట్తుగా అతనిని అభిమానం ముంచెత్తింది. అతడిప్పుడు శ్రమణుడు కాదు.. అతనికిప్పుడు అడుక్కోవటం తగని పని.

అతనా అన్నాన్ని ఒక కుక్కకు పెట్టి ఉపవాసం ఉన్నాడు.

"ఇక్కడ జీవించే జీవితం చాలా సులభం" అనుకున్నాడు సిద్ధార్థుడు. "ఇందులో కష్టాలు లేవు. నేను శ్రమణుడిగా ఉన్నప్పుడు ప్రతిదీ కష్టంగాను, కష్టదాయకంగాను, చివరికి నిరాశాజనకంగాను ఉండేది. ఇప్పుటు అంతా సులభమే, కమల నేర్పించే ముద్దు పెట్టుకునే సాధనంత సులభం. నాకు బట్టలు, డబ్బులు కావాలి, అంతే. ఇవి సులభ లక్ష్యాలు, నిద్ర ఏమాత్రం చెడదు."

అతను అంతకు ముందే పట్టణంలో కమల ఇంటి గురించి వాకబు చేసి ఉన్నాడు. మరునాటి రోజు వెళ్ళి ఆమెను అక్కడ కలిశాడు.

"పనులు బాగా ముందుకు సాగుతున్నాయి" అన్నదామె దూరం నుండే. "కామస్వామి ఎదురుచూస్తున్నాడు, నువ్వు తనను కలవటం కోసం. ఆయన పట్టణంలో అందరికంటే ధనికుడైన వర్తకుడు. నువ్వు ఆయనను మెప్పిస్తే ఆయన నిన్ను పనిలో పెట్టుకుంటాడు. తెలివిగా ఉండు, శ్యామల వర్ణపు శ్రమణుడా! నేను ఇతరుల ద్వారా నీ పెరు ఆయనకు చేరేటట్లు చూశాను. ఆయనతో స్నేహపూర్వకంగా ఉండు; ఆయన చాలా పలుకుబడి గలవాడు- కానీ మరీ వినయంగా, వినమ్రంగా ఉండకు. నువ్వు ఆయన సేవకుడిగా ఉండటం నా అభిమతం కాదు- ఆయనతో సమానంగా ఉండాలి. లేకపోతే నీ పట్ల నాకు ఇష్టం కలుగదు. రాను రాను కామస్వామి ముసలివాడౌతున్నాడు, సోమరితనం పెరుగుతున్నది. నువ్వు అతనిని మెప్పించగల్గితే నీపై చాలా నమ్మకం పెడతాడాయన.
సిద్ధార్థుడు ఆమెకు ధన్యవాదాలు చెప్పి నవ్వాడు. అతను ఆరోజు, అంతకు ముందురోజు ఏమీ తినలేదని తెలియగానే ఆమె రొట్టె, పండ్లు తెప్పించి, పెట్టింది.

సిద్ధార్థుడు వెళ్తుండగా ఆమె అన్నది- "నీకు అదృష్టం కలిసి వస్తున్నది. ఒక తలుపు తరువాత మరొకటి నీకోసం తెరచుకుంటున్నది. ఇలా ఎలా జరుగుతోంది? నీ దగ్గర ఏదైనా మంత్రం (మహిమ) ఉన్నదా?" సిద్ధార్థుడు అన్నాడు :" నేను నిన్న నీకు చెప్పాను- ’నాకు ఆలోచించటం ఎలాగో తెలుసు, వేచి ఉండటం ఎలాగో తెలుసు, ఉపవాసం ఉండటం ఎలాగో తెలుసు’ అని. కానీ నీకు అవి పెద్ద ఉపయోగకరమైనవిగా కనిపించలేదు. కానీ అవి చాలా చాలా ఉపయోగకరాలని నువ్వు తెలుసుకుంటావు, కమలా. అడవుల్లో బ్రతికే వెర్రి(స్టుపిడ్) శ్రమణులు చాలా ఉపయోగకరమైనవాటిని తెలుసుకుంటారు, నేర్చుకుంటారు అని నీకు అర్థం అవుతుంది. మొన్నటిరోజున నేను మురికి భిక్షగాడిని, నిన్నటి రోజున నేను అప్పటికే కమలను ముద్దుపెట్టుకున్నాను, ఇంక త్వరలో నేను ఒక వ్యాపారినౌతాను- నువ్వు విలువనిచ్చే డబ్బు, మిగిలిన అన్ని వస్తువులు ఉంటాయి." "నిజమే" ఒప్పుకున్నది కమల. "కానీ నేను లేకుండా ఉంటే నీ పని ఎలా జరిగేది? కమల నీకు సాయపడకపోతే నువ్వు ఎక్కడుండేవాడివి?"

"నా ప్రియమైన కమలా! అన్నాడు సిద్ధార్థుడు- "తోటలో, నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మొదటి అడుగు వేశాను. అందరికంటే అందమైన స్త్రీ నుండి ప్రేమ పాఠాలు నేర్చుకోవటం నా ఉద్దేశం. నేను అలా నిశ్చయించుకున్న క్షణంనుండే నాకు తెల్సింది- నేను దాన్ని అమలు చేస్తానని (సాధిస్తానని? ఎక్జిక్యూట్). నువ్వు నాకు సాయం చేస్తావనీ తెల్సింది, తోటద్వారం దగ్గర నువ్వు చూసిన తొలిచూపు నుండే నాకు ఆ సంగతి అర్ధమైంది."

"మరి నేను అలా అనుకొని ఉండకపోతే?"

"కానీ నువ్వు అలా అనుకున్నావు. విను, కమలా, నువ్వొక రాయిని నీళ్లలోకి విసిరితే అది నీటి అడుగుకు చేరుకునేందుకు అతిదగ్గరి దారిని కనుక్కుంటుంది- సిద్ధార్థునికి ఒక లక్ష్యం, ఒక గమ్యం ఉన్నప్పుడూ అంతే. సిద్ధార్థుడు ఏమీ చెయ్యడు; అతను వేచి ఉంటాడు, ఆలోచిస్తాడు, ఉపవాసం ఉంటాడు, కానీ అతను ప్రాపంచిక విషయాలగుండా- నీళ్లలో పడిన రాయి మాదిరి- పయనిస్తాడు- తానుగా ఏమీ చేయకుండా; తనను తాను తొందరపెట్టుకోకుండా- అతను లాగబడతాడు; తనకుగా తనను అందులోకి పడనిస్తాడు. అతను తన గమ్యం (లక్ష్యం) చేతనే లాక్కొనబడతాడు. ఎందుకంటే తన లక్ష్యానికి వ్యతిరేకంగా ఉండేదాన్ని దేన్నీ అతను తన మనసులోకి రానివ్వడు గనక. సిద్ధార్థుడు శ్రమణులనుండి నేర్చుకున్నది ఇదే. మూర్ఖులు మంత్రాలు, మాయలు అనేది కూడా దీన్నే. భూతాలు ఇలా చేస్తాయని వాళ్లు అనుకుంటారు. భూతాలు దేనికీ కారణం కావు. భూతాలు లేవసలు! అలోచించటం, వేచి ఉండటం, ఉపవాసం ఉండటం వస్తే ఎవరైనా మాయమంత్రాలు చేయవచ్చు. ఎవరైనా తమ గమ్యాన్ని చేరుకోవచ్చు."

కమల అతని మాటలు విన్నది. అతని స్వరం, అతని కళ్లలోని చూపు ఆమెకు నచ్చాయి.

"బహుశ: నువ్వనేది నిజం కావచ్చు, మిత్రమా" అన్నదామె మృదువుగా. "బహుశ: ఇంకో కారణం వల్ల కూడా కావచ్చు. -సిద్ధార్థుడు చాలా అందమైన యువకుడు, అతని చూపులు స్త్రీలకు నచ్చుతాయి- కనుక అతనికి అదృష్టం కలిసి వస్తుందేమో."

సిద్ధార్థుడు ఆమెను ముద్దు పెట్టుకొని వీడ్కోలు పలికాడు. "అలాగే అగుగాక, నా బోధకురాలా! నా చూపులు నీకు ఎల్లప్పుడూ నచ్చుగాక! అదృష్టం ఎల్లప్పుడూ, నాకు నీ ద్వారా వచ్చుగాక!"

(ఐదవ అధ్యాయం కమల పూర్తైంది.)

changed April 30, 2010