గాయం చాలా కాలంపాటు మాని పోలేదు. పిల్లలతో కలిసి వెళ్తున్న ప్రయాణీకుల్ని చాలామందినే నది దాటించాడు సిద్ధార్థుడు ఈ మధ్య కాలంలో. అలాంటి వాళ్లను చూసిన ప్రతిసారీ అతని మనసులో ఈర్ష్య కలిగేది; ప్రతిసారీ -"ఇంతగొప్ప సుఖం ప్రపంచంలో ఇంతమందికి లభించింది- నాకే ఎందుకు లేదు? దుర్మార్గులకు కూడా- చివరికి దొంగలకు, బందిపోట్లకు కూడా- పిల్లలున్నారు. వాళ్లు వాళ్ల పిల్లల్ని ప్రేమిస్తారు, పిల్లలచేత ప్రేమించబడతారు- నాకు మాత్రం ఆ సుఖం లేదు" అనుకోకుండా ఉండలేకపోయేవాడు. ఎంత అసమంజసంగా, తక్కువ స్థాయిలో ఆలోచించేవాడంటే, అతను సాధారణ మానవుల్లో ఒకడై పోయాడు.

ఇప్పుడతను ప్రజల్ని చూసే దృష్టికోణం మారిపోయింది. అందులో ఎక్కువ తెలివీ లేదు, ఎక్కువ అహంకారమూ లేదు. అందువల్ల అతను మరింత కరుణతో, మరింత కుతూహలంతో, మరింత సౌహార్ద్రతతో వర్తిస్తున్నాడు.

సాధారణ ప్రయాణీకుల్ని నది దాటిస్తున్నప్పుడు- వ్యాపారుల్ని, సైనికుల్ని, స్త్రీలను- వాళ్లు తనకు ఇదివరకులా దూరంగా అనిపించటం లేదు ఇప్పుడు. వాళ్ల ఆలోచనల్ని, అభిప్రాయాలను అతను పంచుకొనటం లేదు; కానీ జీవితపు కోర్కెల్ని, ఆకాంక్షల్ని పంచుకుంటున్నాడు. ఆత్మ సంయమనంలో ఉన్నత స్థాయిని అతడు సాధించినప్పటికీ, తన చివరి గాయానికి సరిగానే తట్టుకున్నప్పటికీ, ఈ సాధారణ ప్రజలందరూ ఇప్పుడు అతనికి సోదరులుగాను, అక్కచెల్లెళ్లుగాను కనబడసాగారు. వారి ఆడంబరాలు, కోరికలు, అల్పత్వం ఇప్పుడతనికి అసంగతంగా అనిపించటంలేదు. వాటిని ఇప్పుడు తను అర్థం చేసుకోగల్గుతున్నాదు, వారిని ప్రేమించగల్గుతున్నాడు, గౌరవించగల్గుతున్నాడు కూడా. తల్లి తన సంతానాన్ని గుడ్డిగా ప్రేమిస్తున్నది; తన ఏకైక కుమారుని చూసి తండ్రికి ఒక గుడ్డి గర్వం, అర్థంలేని ఒక గర్వం కలుగుతున్నది; పడుచుదనంలో ఉన్న యువతి ఆడంబరాలకోసం, ఆభరణాలకోసం, పురుషుల మెప్పుకోసం గుడ్డిగా ప్రవర్తిస్తున్నది. ఈ చిన్న చిన్న, సాధారణమైన, మూర్ఖపు- అయినా అతి బలమైన, అత్యంత కీలకమైన, ఉద్వేగభరితాలైన- కోరికలు, తృష్ణలు- ఇవేవీ సిద్దార్థునికి ఇప్పుడు ఇక అనావశ్యకమైనవిగా కనబడటం లేదు. వీటికోసమే ప్రజలు జీవించటం, అద్భుతమైన పనులు చేయటం, ప్రయాణించటం, యుద్దాలు చేయటం, అంతులేనన్ని దు:ఖాలను అనుభవించటం, భరించటం చేస్తున్నారు. ఈ పనులు చేస్తున్నందుకుగాను అతను వారిని అభిమానిస్తున్నాడు. వీరి కోరికలలోను, వీరి అవసరాలలోను అతనికి జీవితపు శక్తీ, సృష్టి రహస్యపు ప్రాధాన్యత, అవినాశి అయిన బ్రహ్మ కనబడుతున్నవి. వీరి గుడ్డి ప్రేమ కారణంగా, వీరి గుడ్డి శక్తి కారణంగా, వీరి గుడ్డి సంకల్పశక్తి కారణంగా వీరందరూ ప్రేమకు, అభిమానానికి పాత్రులౌతున్నారు. ఋషులకు, జ్ఞానులకు ఉండి వీరికి లేనిది ఒక్కటే- ఈ చిన్న తేడా మాత్రమే- సర్వ ప్రాణుల ఏకత్వం గురించిన ఎరుక. అసలు ఈ ఎరుక, ఈ జ్ఞానం, ఈ ఆలోచన కూడా అంత ముఖ్యమా, లేకపోతే ఇదికూడా మేధావులు తమ పిల్లతనంకొద్దీ, ఆత్మస్తుతి కోసం ఏర్పరచుకున్న నియమం కాదుగదా, అని సిద్ధార్థునికి నిజంగా అనుమానం కల్గింది- ఈ మేధావులు నిజానికి ఆలోచనగల పిల్లలే! ప్రాపంచిక జీవితాన్ని గడిపే సాధారణ ప్రజలందరూ మిగతా అన్ని విషయాలలోను జ్ఞానులకు సమానమే- తరచు జ్ఞానులకంటే అధికులు కూడాను- తమకు అవసరమైన సందర్భాలలో జంతువులు నిబ్బరంగా, స్థిరంగా, పూర్తి సంకల్ప శక్తితో ప్రవర్తించి మానవులకంటే తాము అధికులమని చూపుతున్నట్లు.

"నిజంగా జ్ఞానం అంటే ఏమిటి? ఎంతో కాలంగా జరుగుతున్న తన అన్వేషణ యొక్క గమ్యం ఏమిటి?" వీటి అవగాహన ఒకటి క్రమంగా సిద్ధార్థునిలో పెరిగి వ్రేళ్ళూనుకుంటున్నది. ఈ జ్ఞానం, గమ్యం- ఇదంతా కేవలం ఆత్మను మలచే విద్య మాత్రమే- కేవలం ఒక సామర్ధ్యం, అలోచించే తీరుకు సంబంధించిన ఒక రహస్య కళ, జీవితంలోని ప్రతిక్షణంలోను ఏకత్వపు ఆలోచనల్నే శ్వాసించటం, ఏకత్వపు భావనల్నే కలిగి ఉండటం. ఈ ఆలోచనవల్ల అతను మెల్లగా ఎదిగాడు. అతనిలోని ఈ సామరస్యం, ప్రపంచపు అనంత పరిపూర్ణత మరియు ఏకత్వాల జ్ఞానం వృద్ధ వాసుదేవుని పసి ముఖంలో ప్రతిఫలించేది.

కానీ గాయం ఇంకా బాధిస్తూనే ఉన్నది. సిద్ధార్థుడు ఆపేక్షగాను, చేదుగాను తన కొడుకు గురించి ఆలోచించేవాడు. తనకు అతనిపట్ల గల ప్రేమను, మృదుభావనల్ని పెంచి పోషించాడు, భరించరాని ఆవేదన అతన్ని కొరికి పిప్పి చేస్తుంటే, ప్రేమలో మునిగిన అజ్ఞాని ఏమేం చేయచ్చో అవన్నీ అతనూ చేశాడు. ఏం చేస్తున్నా ఆ అగ్ని తనంతట తాను ఆరిపోలేదు.

ఓనాడు, ఆ బాధ తనను తినివేస్తున్న సమయంలో, కోరికను ఇక తట్టుకోలేక సిద్ధార్థుడు పడవనెక్కి నదిదాటాడు- కుమారునికోసం పట్టణానికి బయలుదేరాడు. నది మెల్లగా, సుతారంగా ప్రవహిస్తున్నది. అది వేసవి. తక్కువ నీటితో మందగమనగా ఉన్నది నది, కానీ దాని గొంతు వింతగా ధ్వనించింది. నది నవ్వుతున్నది; స్పష్టంగా నవ్వుతోంది. సంతోషంగా, స్పష్టంగా, గట్టిగా నవ్వుతోంది నది, ముసలి సిద్ధార్థుడిని చూసి. సిద్ధార్థుడు నిశ్చలంగా నిలబడి, బాగా వినేందుకుగాను నీళ్లపైకి వంగాడు. నిశ్శబ్దంగా, తెరలు తెరలుగా ప్రవహిస్తున్న నీటిలో అతని ముఖం ప్రతిబింబించింది. ఈ ప్రతిబింబం లోనిదేదో అతను మరచిన సంగతిని ఒకదాన్ని గుర్తుచేస్తోంది- అవును తను గుర్తుపట్టాడు- ఆ ముఖం తనది కాదు! అందులో తను లేడు! తనొకనాడు ప్రేమించిన వ్యక్తి, తను భయపడిన వ్యక్తి పోలికలు స్పష్టంగా కనబడుతున్నాయి అందులో. ఆ ప్రతిబింబం తన తండ్రిది- చిన్ననాటి ఆ బ్రాహ్మణుని ముఖం అది. తను యువకుడిగా ఉన్నప్పుడు, తను వెళ్లి శ్రమణులలో కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని తండ్రిని పట్టుబట్టి సాధించిన సంగతి సిద్ధార్థునికి గుర్తుకు వచ్చింది. తను ఆయనను ఎలా విడిచినదీ, ఎలా తను వెళ్లి, వెనక్కి ఇక తిరిగి రానిదీ గుర్తుకు వచ్చింది.

ఈనాడు తను తన కొడుకు పట్ల పడుతున్న వ్యధనే ఆనాడు ఆయన అనుభవించలేదూ? తన తండ్రి, ఇక కొడుకును చూడకుండానే, ఒంటరిగా, ఎన్నో ఏళ్ల క్రితం మరణించలేదూ? తనకూ అదే గతి పట్టనున్నది కదా, తను దాన్ని ముందుగా ఊహించలేదూ? ఇదెంత నవ్వులాట అయిపోయింది, ఎంత వింత, ఎంత మూర్ఖత్వం- ఒకే సంఘటనలు ఇలా పునరావృతమవ్వటం!

నది నవ్వింది. అవును, అదంతే. ముగింపు పలకకుండా, అంతం వరకు భరించకుండా ఆపేది ఏదైనా సరే, మళ్లీ వస్తుంది, అవే దు:ఖాల్ని మోసుకొని. ఆ దు:ఖాల్ని భరించవలసిందే. సిద్ధార్థుడు మళ్లీ పడవనెక్కి గుడిశకు తిరిగి వచ్చాడు- తండ్రి గురించి ఆలోచిస్తూ, కొడుకు గురించి ఆలోచిస్తూ, నది నవ్వటాన్ని వింటూ, తనలోని సంఘర్షణను గమనిస్తూ, నిరాశలో, నిస్పృహలో కొట్టుమిట్టాడుతూ, తన మూర్ఖత్వానికి తనలో తానే సిగ్గుపడుతూ, తనను చూసి, ఈ ప్రపంచాన్ని చూసి నవ్విపోతూ, గుడిశకు తిరిగివచ్చాడు. గాయం ఇంకా వేధిస్తూనే ఉన్నది. అతడు తన రాతపై తాను తిరగబడుతూనే ఉన్నాడు. ఇంకా ప్రశాంతత లేదు; దు:ఖంపై విజయం కలగలేదు. అయినా అతను ఆశవీడలేదు. గుడిశకు తిరిగివచ్చిన సిద్ధార్థుడిని వాసుదేవునికి అంతా చెప్పేయాలన్న తీవ్రమైన తపన వేధించింది. "వినటం అనే కళను పరిపూర్ణంగా నేర్చిన ఆ వాసుదేవునికి అంతా చెప్పాలి. ఇదంతా వివరించి చెప్పేయాలి".

వాసుదేవుడు బుట్టను అల్లుతూ కూర్చుని ఉన్నాడు గుడిశలో. తను ఇప్పుడు పడవ నడపటం మానేశాడు. అతని కంటిచూపు మందగించింది. దానితోపాటు కాళ్లు, చేతుల శక్తి సరిపోవటం లేదు. కానీ అతని ముఖంలోని ప్రసన్నత, సంతోషపు చమక్కు మాత్రం అలాగే ప్రకాశిస్తున్నాయి.

సిద్ధార్థుడు అ వృద్ధుని ప్రక్కన కూర్చొని మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టాడు. తను ఇంతకుముందు చెప్పని విషయాలను ఎన్నింటినో సిద్ధార్థుడు ఇప్పుడు వాసుదేవునికి చెప్పాడు: తను అప్పుడు పట్టణానికి ఎలా వెళ్లాడు అన్న సంగతి చెప్పాడు. తనని పీడిస్తున్న గాయపు బాధను గురించి చెప్పాడు. సంతోషంగా ఉన్న తండ్రుల్ని చూసినప్పుడు తనలో కలిగిన అసూయ గురించి చెప్పాడు. అటువంటి భావనలలోని అజ్ఞానం తనకు తెలిసిన సంగతి చెప్పాడు. తనతో తాను చేస్తున్న నిరాశాభరిత పోరాటం గురించి చెప్పాడు. తను అన్నింటినీ పూర్తిగా చెప్పాడు, అన్నింటినీ పూర్తిగా చెప్పగల్గాడు, ఒప్పుకోగల్గాడు, అంగీకరించగల్గాడు. అత్యంత బాధాకరమైన సంగతులను కూడా అతను ఇప్పుడు చెప్పగల్గాడు. తన గాయాల్ని చూపగల్గాడు, ఆనాడే తను పారిపోయిన సంగతిని చెప్పాడు, పట్టణంలోకి వెళ్లే కోరికతో తను ఎలా నదిని దాటిందీ చెప్పాడు, నది ఎలా నవ్విందో చెప్పాడు.

తను మాట్లాడుతూ పోయాడు. ప్రశాంతమైన వదనంతో వాసుదేవుడు వింటున్నాడు. సిద్ధార్థునికి వాసుదేవుని సావధానపూర్ణ అస్తిత్వం ఇంకా ప్రస్ఫుటంగా కనిపించింది ఆనాడు. తన బాధలు, తన వ్యాకులత, తనలో దాగిన ఆశలు అన్నీ ఎగిరి వాసుదేవుని చేరి వెనక్కి రావటం అతను గమనించాడు. తన హృదయంలోని గాయాన్ని ఈ శ్రోతకు వినిపించటం అనేది నదిలో స్నానంచేస్తున్న అనుభూతిని ఇస్తున్నది- అది చల్లగా, నదితో ఏకమైపోయింది. తను మాట్లాడుతూ, తన మనసును విప్పి చెప్తున్నకొద్దీ సిద్ధార్థునికి ఇంకొక సంగతి తెలుస్తున్నది- ఇతడు వాసుదేవుడు కాదు. తను చెప్తున్నదానిని వింటున్నది (మానవుడు) కాదు. నిశ్చలంగా వింటున్న ఈ వ్యక్తి, చెట్లు వర్షపునీటిని పీల్చుకున్నట్లు, తను చెప్పినదాన్ని గ్రహిస్తున్నాడు. నిశ్చలంగా ఉన్న ఈ వ్యక్తి సాక్షాత్తూ నదే! సాక్షాత్తూ భగవంతుడే. కేవలమైన అనంతం తనను వింటున్నది! సిద్ధార్థుడు తనను గురించి, తనగాయం గురించి ఆలోచించటం మానిన క్షణంలోనే వాసుదేవుని అస్తిత్వంలోని ఈ మార్పును అతడు గుర్తించగలిగాడు. ఆ గుర్తింపు అతనిని ముంచెత్తింది. అతను దాన్ని గురించి ఆలోచించినకొద్దీ అది మరింత సహజంగా కనబడింది, ప్రతిదీ సహజంగాను, సక్రమంగాను ఉన్నట్లు తోచింది- వాసుదేవుడు చాలాకాలంక్రితంనుండి- నిజానికి అతను అలాగే ఉన్నాడు, తనే ఇంతకాలమూ గుర్తించలేదు- తనుకూడా, అతనికి ఏమంత భిన్నంగా లేడు. ప్రజలు దేవతలను చూసిన విధంగా తనిప్పుడు వాసుదేవుడిని చూస్తున్నట్లు అతనికి తోచింది- అలా అయితే ఈ భ్రాంతి ఎక్కువకాలం ఉండదు.. అంతర్గతంగా అతను వాసుదేవుడిని వదిలిపెట్టాడు; తను మాట్లాడటాన్ని కొనసాగించాడు.

అతను మాట్లాడటం ముగించగానే వాసుదేవుడు అతన్ని చూశాడు. బలహీనమైన అతని చూపు సిద్ధార్థుని స్పృశించింది. అతనేమీ మాట్లాడలేదు, కానీ అతని వదనం ప్రేమను, శాంతిని, అవగాహనను, జ్ఞానాన్ని ప్రసరింపజేస్తున్నది. అతను సిద్ధార్థుని చేయిపట్టుకొని నది వద్దకు తీసుకొనివెళ్ళి, నది ఒడ్డున కూర్చోబెట్టి, తనూ ప్రక్కన కూర్చొని చిరునవ్వుతో నదిని పరికించాడు- "నువ్వు నది నవ్వటం విన్నావు" అన్నాడతను "కానీ పూర్తిగా వినలేదు. మనం విందాం. ఇప్పుడు నీకు ఇంకా వినిపిస్తుంది."

వాళ్లిద్దరూ విన్నారు. నది తన సహస్ర కంఠాలతో పాడుతున్న పాట మృదువుగా ప్రతిధ్వనిస్తోంది. ప్రవహిస్తున్న నదిలోకి చూసిన సిద్ధార్థునికి ఆ ప్రవాహంలో అనేక చిత్తరువులు కనబడ్డాయి. తన తండ్రి ఒంటరిగా, కొడుకుకోసం తపిస్తూ రోదిస్తున్నాడు. తను ఒంటరిగా, దూరంగా ఉన్న కొడుకు పట్ల ప్రేమపాశాల్లో బందీ అయి కనబడ్డాడు. అతనికి తన కొడుకు కనిపించాడు- అతనూ ఒంటరే, జీవిత తృష్ణ అనే మండే దారిలో ఆత్రంగా ముందుకు సాగుతున్నాడు. ఎవరికివారు తమ లక్ష్యంపై ఏకాగ్రతతో, ప్రతివాళ్లూ తమ తమ లక్ష్యాల వ్యామోహంలో ఇరుక్కొని, ప్రతివాళ్లూ దు:ఖపడుతూ. నది స్వరం వ్యధాభరితంగా ఉంది. అది దు:ఖంతో, బాధగా, ఆశగా పాడుతూ తన లక్ష్యం దిశగా ప్రవహిస్తోంది.

"వినబడిందా?" వాసుదేవుని చూపు ప్రశ్నించింది. సిద్ధార్థుడు తలఊపాడు.

"ఇంకా బాగా విను" గుసగుసగా అన్నాడు వాసుదేవుడు.

సిద్ధార్థుడు ఇంకా బాగా వినేందుకు ప్రయత్నించాడు. తన తండ్రి చిత్రం, తన చిత్రం, తన కొడుకు చిత్రం అన్నీ ఒకదానిలో ఒకటి కలసిపోయాయి. కమల చిత్తరువుకూడా కనబడి, ప్రవాహంలో కలిసిపోయింది; గోవిందుని చిత్రం, ఇతరుల చిత్రాలన్నీ కూడ వ్యక్తమై, మళ్లీ కరిగిపోయాయి. అన్నీ నదిలో భాగమైనాయి. అదే వాటన్నిటి లక్ష్యం, గమ్యం, వాటన్నిటి తృష్ట, వాటన్నింటి కోరిక, వాటన్నిటి దు:ఖం. నది స్వరంలో నిండుగా ఆశ, ఆకాంక్ష, నిండుగా వ్యధాభరిత దు:ఖం, తీరని కోరిక. నది తన గమ్యం దిశగా ప్రవహిస్తూ పోయింది. తనతోటీ, తన బంధు బాంధవులతోటీ, తను ఇంతవరకు కలసిన వ్యక్తులందరితోటీ తయారైన ఆ నదీ ప్రవాహం సాగిపోతుండటం సిద్ధార్థునికి కనబడింది. ఆ అలలు, ఆ నీరు అన్నీ ప్రవహిస్తూ పోయాయి, దు:ఖప్రవాహం, వాటి వాటి లక్ష్యాలవైపుకు, అనేకానేక లక్ష్యాలు, జలపాతానికి, సముద్రానికి, సముద్రప్రవాహాల్లోకి, మహాసముద్రాలకు- అన్ని గమ్యాలూ చేరబడినై, ప్రతిదాని వెనకా వేరొక గమ్యం. నీరు ఆవిరై పైకి లేచింది, వర్షమైంది, తిరిగి క్రిందికి వర్షించింది, వసంతమైంది, సెలయేరు, నది అయ్యింది, కొత్తగా మారిపోయింది, కొత్తగా ప్రవహించింది. కానీ ఆ స్వరంలోని కాంక్ష మారింది, అదింకా వ్యధాభరితంగానే ఉన్నది, ఇంకా అన్వేషిస్తోంది. కానీ ఇతరగొంతుకలు ఇప్పుడు దానితోపాటు వినవస్తున్నాయి- నవ్వుతున్నవి, ఏడుస్తున్న గొంతులు- వందలాది గొంతులు, వేలాది గొంతుకలు.

సిద్ధార్థుడు విన్నాడు. అతనిప్పుడు ఏకాగ్రతతో వింటున్నాడు. సంపూర్ణంగా ధ్యానమగ్నుడై వింటున్నాడు, తనలో వేరే ఏ ఆలోచనాలేకుండా, ఖాళీగా వింటున్నాడు, ప్రతిదానినీ స్వీకరిస్తున్నాడు. తానిప్పుడు వినేకళను పరిపూర్ణంగా నేర్చుకున్నట్లు అనిపించింది అతనికి. తను తరచు విన్నాడు వీటిని- నదిలోని అనేకానేక కంఠాల్ని. కానీ నేడు అవన్నీ వేరుగా వినబడుతున్నాయి. అతనికి ఇప్పుడు వేరువేరు గొంతుకలమధ్య భేదం కనబడటం లేదు- సంతోషపు గొంతుకకు, ఏడుపు గొంతుకకు, పిల్లవాని గొంతుకకు- పెద్దల గొంతుకలకు మధ్య భేదంలేదు- ఇప్పుడు అవి అన్నీ ఒకదానికొకటి చెంది ఉన్నాయి. కాంక్షతో కూడుకున్న గొంతుల్లోని దు:ఖం, జ్ఞానుల నవ్వు, రోషపు అరుపు, చచ్చిపోయేవాని మూలుగు- అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి, ఒకదానిలో ఒకటి చిక్కుబడి, చుట్టుకొని ఉన్నవే. మరి, ఈ గొంతుకలన్నీ, ఈ గమ్యాలన్నీ, ఈ ఆకాంక్షలన్నీ, అన్ని దు:ఖాలూ, అన్ని సంతోషాలూ, మంచి, చెడు మొత్తం- ఇవన్నీ కలిపిందే ప్రపంచం. ఇవన్నీ కలిస్తే ఏర్పడేది సంఘటనల ప్రవాహం, రూపధార, జీవన సంగీతం.

సిద్ధార్థుడు నది మాటల్ని, సహస్రకంఠాల ఈ పాఠని శ్రద్ధగా విన్నాడు, అతడు దు:ఖాన్ని సంతోషాన్నీ వేరుగా విననప్పుడు, తన ఆత్మను అతడు ఒక్క గొంతులొ ముడిపెట్టి అందులో మునిగిపోనప్పుడు, వాటిని అన్నింటినీ మొత్తంగా ఏకంగా విన్నప్పుడు, ఆ సహస్ర కథల కంఠాల అద్బుత గానంలో ఒకే పదం - ఓం - పరిపూర్ణిత వినబడింది.

"నీకు వినబడుతోందా?" అడిగింది వాసు దేవుని చూపు, మళ్ళీ ఇంకోసారి.

వాసుదేవుని చిరునవ్వులో కోటి సూర్య ప్రభ తేజరిల్లింది. నదిలోని అన్ని గొంతుకలలోనూ ఓంకారం విస్తరించినట్లు ముడుతలుపడ్డ అతని ముసలిమోమునిండా ఆ ప్రకాశం పరచుకొన్నది. అతను తన స్నేహితుడిని చూస్తున్నప్పుడు ఆ ముఖంలోని ప్రకాశమే, ఇప్పుడు సిద్ధార్థుని వదనంలో ప్రతిబింబించింది. అతని హృదయంలోని గాయం మానుతున్నది, అతనిలోని బాధ పలచనౌతున్నది, అతని ఆత్మ ఏకత్వంతో కలిసిపోయింది.

ఆ క్షణంనుండి సిద్ధార్థుడు తన విధితో పోరాడటం ఆగిపోయింది. అతని వదనంలో జ్ఞానపు ప్రశాంతత, కోరికల సంఘర్షణను ఎదుర్కొనే అవసరం లేనివానిలోని ప్రసన్నత, ముక్తినొందినవాని ప్రశాంతత, సంఘటనల ప్రవాహంతో, జీవన ప్రవాహం రూపధారతో సమరసత నొందినవానిలోని దయ, కరుణ ప్రతిబింబించాయి. అతను సంపూర్ణంగా ఆ ప్రవాహపు శరణుజొచ్చి, అన్ని వస్తువుల ఏకత్వంలోనూ భాగమైనాడు.

వాసుదేవుడు నదిఒడ్డున తను కూర్చున్న చోటే లేచి నిలబడ్డాడు, సిద్ధార్థుని కళ్లలోకి చూశాడు; వాటిలో ప్రకాశిస్తున్న జ్ఞానపు ప్రశాంతిని గమనించాడు. తన దయాపూర్ణమైన, ఆశ్రయపూర్ణమైన శైలిలో మెల్లగా స్నేహితుని భుజంతట్టి అన్నాడు- "నేను ఈ సమయంకోసమే నిరీక్షించాను మిత్రమా! ఇప్పుడది వచ్చింది; కనుక నన్ను వెళ్ళనివ్వు. నేను పడవ నడిపే సరంగుగా, వాసుదేవునిగా, చాలా కాలంపాటు ఉన్నాను. ఇప్పుడది పూర్తయింది. గుడిశా! ఇక శలవు. నదీ, శలవిక. శలవు, సిద్ధార్థా!"

వెళ్ళిపోతున్న ఆ వ్యక్తికి సిద్ధార్థుడు తలవంచి అభివాదనం చేశాడు.

"నాకు తెలుసు" అన్నాడతను మెల్లగా. "నువ్వు అరణ్యంలోకి వెళ్తున్నావా?"

"అవును. నేను అరణ్యంలోకి వెళ్తున్నాను. నేను అన్ని వస్తువుల ఏకత్వంలోకి వెళ్తున్నాను." అన్నాడు వాసుదేవుడు, ప్రకాశవంతంగా.

అతను వెళ్లిపోయాడు. సిద్ధార్థుడు అతన్ని గమనించాడు. సంతోషంతో ఉప్పొంగే అంతరంగంతో, గంభీరంగా గమనించాడు. సంపూర్ణమైన శాంతితో నిండిన అతని అడుగులను, ప్రకాశిస్తున్న అతని ముఖాన్ని, కాంతులీనే అతని రూపాన్ని గమనించాడు.

(పదకొండవ అధ్యాయం "ఓం" ముగిసింది.)

changed April 22, 2008